150 years of Indian Meteorological Department... Grand celebrations in Visakhapatnam
భారత వాతావరణ శాఖకు 150 ఏళ్లు... విశాఖపట్నంలో ఘనంగా సంబరాలు
అక్కడ మరో సంక్రాంతి కనిపించింది. వాతావరణ శాఖ వెలుగులతో నిండిపోయింది. సంక్రాంతి రోజున వాతావరణ శాఖ 150 ఏళ్ల సమాచార అవగాహన సంబరాలను చేసుకోవడం విశేషం.
సాధారణంగా వాతావరణంలోని మార్పులు.. వర్షాల సమాచారం, మంచు ఎండ ఇతర సమాచారం కోసం సాధారణంగా మనం వాతావరణ కేంద్రాలను సంప్రదిస్తుంటాం. వాతావరణ సమాచారాన్ని బట్టి పనులు, ఇతరత్రా ఆధారపడుతుంటాం. కానీ వాతావరణ కేంద్రం సంక్రాంతి రోజున వెలిగిపోయింది. సంక్రాంతి పండుగ రోజున వాతావరణ కేంద్రం అంతా కూడా కళకళలాడింది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా అవగాహన కలిగించడం కోసమే ఈ కార్యక్రమాలు చేశామని చెప్పి వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
భారత వాతావరణ శాఖ ఒకటిన్నర శతాబ్దాల (150 సంవత్సరాల) సంబరాలను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్ధ యొక్క విభాగాలు, అనుభాగాలు మరియు శాఖలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో జరిగిన ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీశ్ బంద్కర్ప్రధానోపన్యాసం చేసారు. భారత వాతావరణ విభాగం చేసిన సేవలను, వర్తమాన సేవలను కొనియాడారు. భవిష్యత్ లో అవసరమయ్యే విస్తృత సేవాకార్యక్రమాలకు మార్గనిర్దేశనం చేసారు.
భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజూజు తమ శాఖ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు. భారత వాతావరణ శాఖ మహానిర్దేశకులు డీ.జీ.ఎమ్. మృత్యుంజయ మహాపాత్ర సంస్థ చేపట్టిన నూతన వాతావరణ అనువర్తనాలైన పంచాయతీ మౌసం సేవ, డెసిషన్ సపోర్ట్ సిస్టం, ఐ ఎం డీ మొబైల్ ఏప్, నేషనల్ ఫ్రేం వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీసెస్ లను లాంఛనంగా ప్రారంభించారు.
సంస్థ పరిణామక్రమంలో తత్సంబంధ శాస్త్రాల పురోగమనానుసారంగా ఆహ్వానించదగ్గ పలు మార్పులు వచ్చాయి. క్రత్రిమ ఉపగ్రహాల ఛాయాచిత్రాలు, రాడార్లు, సాంఖ్యకీయవాతావరణ నమూనాలు, మహా గణన యంత్రాల అనువర్తనాలు, గణాంక ప్రక్రియలు, సమాచార, సంచార సేవలు కలగలిసి సఫలీకృత వాతావరణ పరిశోధనలలో, వాతావరణ పూర్వనుమాన కార్యాచరణలలో దోహదపడుతున్నాయి. కృత్రిమ మేథ సాయంతో వాతావరణసేవలు కూడా నూతన పరవళ్ళు తొక్కే విధంగా భవిష్యత్తు ఉందని అధికారులు అన్నారు.
ఏ వ్యవస్థ అయినా.. సంస్థ అయినా మనుగడ చెందాలంటే ఆ సంస్థ లో పనిచేసే సభ్యుల అంకితభావం ఎంతో సహకరిస్తుందన్నది నిర్వివాదాంశం. సందర్భంగా భారత వాతావరణ విభాగంలోని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, కైలాసగిరి డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రంలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మిరుమిట్లు గొలిపే ఎల్ ఈ డీ దీపాలతో వెలుగొందించి పండుగ శోభను సంతరించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
పరిశీలన వేదశాలను, వివిధ గదులలో పరికరాల ప్రదర్శనను సందర్శకుల దర్శన నిమిత్తం ఏర్పాటు చేసారు. రాడార్ పనిచేసే విధానం, జీ పీ ఎస్ సోండే పరికరం, పైలట్ బెలూన్, ఉష్ణమానిని, ఆర్ద్ర మాటను పరికరాలు, పవన దిశ, ధృతి తెలియజేసే పరికరాలు, వాతావరణ విశ్లేషణా నమూనాలు విద్యార్ధులు, సందర్శకులకు వివరణాత్మకంగా ప్రదర్శించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో జరిగిన సమారోహ కార్యక్రమాన్ని వీడియో ద్వారా తిలకించారు. వార్తా పత్రికలలో, ఛానల్ లలో కార్యక్రమ వివరాలు ముందుగానే తెలియ జేయడం వల్ల విస్తృతంగా జన బాహుళ్యానికి సేవార్ధం భారత వాతావరణ శాఖ చేస్తున్న, చేపట్టబోయే భవిష్యత్ కార్యప్రణాళికలు తెలియజేశారు.