WOMEN EMPOWERMENT SCHEMES
2025లో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు- రూ.లక్షల్లో సంపాదన, పొదుపు!
2025లో మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాలు- వీటి గురించి తెలుసా?
Women Empowerment Schemes : ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచాన్ని మహిళలు ఏలేస్తున్నారనే చెప్పాలి. ఆర్థికంగా ఇంటిని సరిదిద్దడంలో వారి పాత్ర ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం అనేక పథకాలను తీసుకొచ్చి 2025లోనూ అమలు చేస్తోంది. అవేంటో, వాటి వివరాలేంటో తెలుసుకుందాం.
లఖ్పతి దీదీ పథకం
లఖ్పతి దీదీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన మహిళా సాధికారత పథకాలలో ఒకటి. ఈ పథకం కింద స్వయం సహాయక బృందాలలో ఉన్న 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద రూ. లక్షకుపైగా వడ్డీ లేని రుణాలను మహిళలను ప్రభుత్వం అందిస్తోంది.
డ్రోన్ దీదీ పథకం
ఈ పథకం కింద దాదాపు 15,000 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం. పంట పర్యవేక్షణ, ఎరువుల పిచికారీ, విత్తనాలు వేయటం వంటివి నేర్పిస్తారు. గ్రామీణ భారతదేశం అంతటా భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడానికి, వ్యవసాయ భూమిని మ్యాప్ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
మిషన్ ఇంద్రధనుష్
మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన మరో ప్రతిష్ఠాత్మక పథకం మిషన్ ఇంద్రధనుష్. ఈ పథకం కింద జిల్లాలోని గర్భిణీలు, పిల్లలకు టీకాలను సకాలంలో వేస్తారు.
ముద్రా యోజన
సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు చేసే మహిళలకు ముద్రా యోజన రుణాలను మంజూరు చేస్తారు. మహిళలు యజమానులుగా ఉన్న సంస్థలకు పూచీకత్తు లేకుండానే రూ.20 లక్షల వరకు రుణాన్ని ఇస్తారు. దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది.
ట్రెడ్ స్కీమ్
మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన స్కీమ్ ట్రెడ్ (TREAD). ఈ పథకం ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది. దీన్ని బ్యాంకులు ఇస్తాయి.
ఉజ్వల యోజన
దేశంలోని పేద మహిళల కోసం ప్రారంభించిన స్కీమ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్ కింద దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత గ్యాస్ కలెక్షన్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
స్టాండప్ ఇండియా మిషన్
ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు స్టాండప్ ఇండియా పథకం కింద రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలను ఇస్తారు. ప్రాజెక్టు వ్యయం మొత్తంలో 75 శాతం వరకు లోన్ మంజూరు అవుతుంది. ఈ స్కీమ్ మహిళలకు వ్యాపార పెట్టుబడిని అందిస్తుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
దేశంలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మహిళల పేరిట ఇళ్లు కేటాయింపు జరగడం వల్ల వారి సాధికారితకు మేలు చేకూరుతుంది.
స్టెప్ ఇనిషియేటివ్
స్టెప్ (STEP) అనేది దేశంలో మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన మరో ప్రభుత్వ పథకం. ఇది మహిళలకు నైపుణ్య శిక్షణను ఇచ్చే సంస్థలకు గ్రాంట్లను అందిస్తుంది.
మహిళా ఈ-హాత్ స్కీమ్
కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకం
మహిళల ఆర్థిక సాధికారత కోసం, పొదుపును ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)'. ఈ స్కీమ్ కింద కనిష్ఠంగా రూ.1000 డిపాజిట్ చేయవచ్చు. విడతల వారీగా కూడా రూ.2 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకేసారి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిపై 7.50 శాతం వడ్డీరేటు లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్. దీన్ని కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రారంభించింది. ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, ఉన్నత విద్య, వివాహ సమయాల్లో తోడ్పాటు కోసం మొదలుపెట్టింది.
10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 21 ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. కావాలనుకుంటే పాపకు 18 ఏళ్లు వచ్చిన తరువాత ఉన్నత విద్య, వివాహం కోసం 50 శాతం వరకు డబ్బును తీసుకోవచ్చు. ఖాతాను ప్రారంభించేందుకు ఏడాదికి కనీస డిపాజిట్ రూ.250. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు చేయవచ్చు. ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడికి, రాబడికి ఎలాంటి ఢోకా ఉండదు.మహిళా శక్తి కేంద్రాలు
మహిళా శక్తి కేంద్రాలు మహిళలు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, ఉపాధిని పొందడంలో సాయపడతాయి. ఆర్థిక సాధికారతను అందించడంలో ఉపయోగపడతాయి.