Agneepath Scheme

Agneepath Scheme.. Apply like this to join the Army

అగ్నిపథ్ స్కీమ్.. ఆర్మీలో చేరేందుకు ఇలా అప్లై చేసుకోండి.

Agneepath Scheme.. Apply like this to join the Army

Agniveer Jobs | దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ ఒక గొప్ప అవకాశం. ఇది సైన్యంలో చేరేందుకు ఒక సులువైన మార్గం. పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులు కూడా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశానికి సేవ చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఎంపికైన వారిని అగ్నివీర్ అని పేర్కొంటారు. అగ్నివీరులకు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సైన్యంలో పూర్తి స్థాయి ఉద్యోగిగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇతర రంగాల్లో ఉద్యోగంలో చేరవచ్చు. మంచి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. దేశ సేవతో పాటు మంచి భవిష్యత్తును కోరుకునేవారికి మంచి అవకాశం అయిన అగ్నిపథ్ పథకం గురించి పూర్తి వివరాలు..

అగ్నిపథ్ స్కీమ్.. ఆర్మీలో చేరేందుకు ఇలా అప్లై చేసుకోండి

అంశాలు:

అగ్నిపథ్ (Agnipath) పథకం అంటే ఏమిటి?

అగ్నిపథ్ పథకంలో జీతం ఎలా ఉంటుంది?

అగ్నిపథ్ పథకానికి ఎవరు అర్హులు?

అగ్నిపథ్ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి?

అగ్నివీర్ పథకం కింద చేరిన జవాన్ సర్వీసులో అమరుడైతే..

అగ్నిపథ్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?

అగ్నిపథ్ పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా 10వ తరగతి, ఇంటర్ పాసైన వారు కూడా ద్వారా సైన్యంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన వారిని ‘అగ్నివీర్’గా పేర్కొంటారు. భారత సైన్యం (Indian Army, వాయు సేన (Indian Air Force), నౌకాదళం (Indian Navy)లో సైనికులుగా చేరవచ్చు. ఇది కేవలం 4 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత, మెరుగైన పనితీరు కనబర్చిన వారిని సైన్యంలోకి ఫుల్ టైమ్ ఉద్యోగిగా తీసుకుంటారు. లేదంటే అగ్నివీరులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగం చేసుకోవచ్చు.

అగ్నిపథ్ (Agnipath) పథకం అంటే ఏమిటి?

అగ్నిపథ్ పథకం అనేది యువతకు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం సాయుధ బలగాలలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ స్కీమ్ ద్వారా యువతకు 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ పథకం కింద ఎంపికైన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఈ పథకం ద్వారా భారత సైన్యం, వాయు సేన, నౌకాదళంలో సైనికులుగా చేరవచ్చు. ఆ తర్వాత అగ్నివీరులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగం చేసుకోవచ్చు.

అగ్నిపథ్ పథకం ప్రయోజనాలు ఏంటి?

అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం అభిస్తుంది.

నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు జీతం లభిస్తుంది.

4 సంవత్సరాల తర్వాత రూ. 11.71 లక్షలు ఒకేసారి ఇస్తారు. దీన్ని సేవా నిధి అంటారు.

సేవా నిధిపై ఆదాయపు పన్ను కూడా ఉండదు.

సర్వీస్ పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది.

రూ. 48 లక్షల జీవిత బీమా ఉంటుంది.

సర్వీస్ సమయంలో 25% అగ్నివీరులను సైన్యంలో శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు.

అగ్నిపథ్ పథకంలో జీతం ఎలా ఉంటుంది?

అగ్నివీర్ తన సర్వీస్ కాలంలో పొందిన వేతనం నుంచి కొంత మొత్తాన్ని సేవా నిధికి జమ చేస్తారు. అగ్నివీర్ ఎంత మొత్తం అయితే సేవా నిధికి జమ చేస్తాడో.. అంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 4 ఏళ్ల సర్వీసు పూర్తైన తర్వాత ఈ నిధిలోని మొత్తాన్ని వడ్డీతో పాటు కలిపి (సుమారు రూ. 11.71 లక్షలు) ఆ అగ్నివీర్‌కు చెల్లిస్తారు. ఒకవేళ సర్వీసు మధ్యలోనే అమరుడైతే ఈ మొత్తాన్ని వెంటనే వారి కుటుంబానికి అందజేస్తారు. ఈ సేవా నిధిపై ఎలాంటి ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) ఉండదు.

సంవత్సరం మొత్తం ప్యాకేజీ చేతికి వచ్చే జీతం (70%) అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు వాటా (30%) ప్రభుత్వ వాటా

మొదటి సంవత్సరం రూ. 30,000 రూ. 21,000 రూ. 9,000 రూ. 9,000

రెండో సంవత్సరం రూ. 33,000 రూ. 23,100 రూ. 9,900 రూ. 9,900

మూడో సంవత్సరం రూ. 36,500 రూ. 25,580 రూ. 10,950 రూ. 10,950

నాలుగో సంవత్సరం రూ. 40,000 రూ. 28,000 రూ. 12,000 రూ. 12,000

కార్పస్ ఫండ్‌ మొత్తం - - రూ. 5.02 లక్షలు రూ. 5.02 లక్షలు

అగ్నిపథ్ పథకానికి ఎవరు అర్హులు?

భారతదేశ పౌరుడై ఉండాలి.

వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

సైన్యం, నావికాదళం, వాయుసేన షరతుల ప్రకారం విద్యా అర్హతలు ఉండాలి.

నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి.

గమనిక:

అగ్నిపథ్ పథకం కింద సైన్యంలోని మూడు విభాగాల్లో కేవలం జవాన్ స్థాయి ఉద్యోగాల భర్తీ మాత్రమే జరుగుతుంది. ఇది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు కాదు.

అగ్నిపథ్ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి?

ఆధార్ కార్డు

నివాస ధ్రువీకరణ పత్రం

విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలు

డోమిసైల్ సర్టిఫికేట్

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

దరఖాస్తుదారుడు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలలో పాల్గొనలేదని ఒక ప్రమాణ పత్రం కూడా సమర్పించాలి.

గమనిక:

సైన్యంలోని మూడు విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా మరికొన్ని డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది.

అగ్నివీర్ పథకం కింద చేరిన జవాన్ సర్వీసులో అమరుడైతే..

సాధారణంగా భారత త్రివిధ దళాల్లో పనిచేస్తూ.. విధి నిర్వహణలో శత్రువులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పరిహారం, సహాయం, అవార్డులు లభిస్తాయి. ఇదే తరహాలో త్రివిధ దళాల్లో చేరే అగ్నివీర్‌లకు కూడా సహాయం అందుతుంది.

అగ్నివీర్‌గా చేరిన ప్రతి సైనికుడికి రూ. 48 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తారు. ఒకవేళ సర్వీసు ఉండగానే అగ్నివీర్ మరణిస్తే, ఈ మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఈ జీవిత బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా, ఈ జీవిత బీమా అగ్నివీర్ శిక్షణలో ఉన్నప్పుడైనా, సహజ మరణానికి అయినా వర్తిస్తుంది. ఇక విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి అదనంగా రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ఇది జీవిత బీమాకు సంబంధం లేకుండా అగ్నివీర్ కుటుంబానికి అందించే అదనపు ఆర్థిక సహాయం.

అగ్నివీర్ సర్వీసు 4 ఏళ్లు ఉంటుంది. అయితే, అగ్నివీర్ ఏ సమయంలో అమరుడైనా.. ఆ తర్వాత 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయడానికి ఎంత కాలం మిగిలి ఉందో, ఆ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని ఆ అగ్నివీర్ కుటుంబానికి అందజేస్తారు. ఇదంతా ఒకేసారి చెల్లిస్తారు.

అగ్నివీర్ సేవా నిధి ప్యాకేజీ:

అగ్నివీర్ తన సర్వీస్ కాలంలో నెల నెలా పొందిన వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి, సేవా నిధికి జమ చేస్తారు. అగ్నివీర్ ఎంత మొత్తమైతే సేవా నిధికి జమ చేస్తాడో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 4 ఏళ్ల సర్వీసు పూర్తైర తర్వాత ఈ నిధిలోని మొత్తం (సుమారు రూ.11.71 లక్షలు) వడ్డీతో పాటు కలిపి ఆ అగ్నివీర్‌కు చెల్లిస్తారు. ఒకవేళ సర్వీసు మధ్యలోనే అగ్నివీర్ అమరుడైతే ఈ మొత్తాన్ని వెంటనే వారి కుటుంబానికి అందజేస్తారు. ఈ సేవా నిధిపై ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు.

తక్షణ ఆర్థిక సహాయం:

అమరుడైన అగ్నివీర్ అంత్యక్రియలు, ఇతర అవసరాల కోసం కొంత మొత్తాన్ని తక్షణ సహాయంగా ఆయన కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అగ్నివీర్ అమరుడైతే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి కూడా ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధి నుంచి ఎంత మొత్తం అందించాలనేది ఆర్మీ అధికారులు పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయిస్తారు.

మొత్తం పరిహారం ఎంతంటే..

పైన పేర్కొన్న అన్ని రకాల పరిహారాలను కలిపితే.. సర్వీసులో ఉండగా అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి సుమారు కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు ఆర్థిక సహాయం అందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు దీనికి అదనం. ఇక అసాధారణ పోరాటం చేసి అమరులైన అగ్నివీరులకు కేంద్రం గ్యాలంట్రీ అవార్డులను కూడా ఇస్తుంది.

అగ్నిపథ్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?

అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్‌ల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు. కాలేజీలు/సంస్థలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు కూడా నిర్వహిస్తారు. కొన్నిసార్లు ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కాకుండా సైన్యంలోని మూడు విభాగాలు తమ అధికారిక పోర్టల్‌ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాయి. ఇందు కోసం ముందుగా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయానికి ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సమాచారం కూడా మీకు పోర్టల్‌లో లభిస్తుంది.

భారత సైన్యం (భూ సేన/ సైనిక దళం), వాయుసేన, నావికాదళం మూడింటిలో భర్తీ నియమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వాటి ఎంపిక ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. సైన్యంలోని మూడు విభాగాలు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నియామకాలు జరుపుతుంటాయి.

అగ్నిపథ్ పథకం లక్ష్యాలు:

యువతకు తక్కువ సమయంలో భారత సాయుధ బలగాలలో పనిచేసే అవకాశం ఇవ్వడం.

సైన్యంలో యువత సంఖ్యను పెంచడం.

యువతలో క్రమశిక్షణ, దేశభక్తి లాంటి లక్షణాలను పెంపొందించడం.

బాధ్యతాయుతమైన యువశక్తిని తయారుచేయడం.

అగ్నివీర్ అయిన తర్వాత యువత సాధారణ జీవితంలో కూడా క్రమశిక్షణతో ఉండగలగడం.

యువతకు సైన్యంలో చేరేందుకు అగ్నిపథ్ ఒక మంచి అవకాశం. ఈ పథకం ద్వారా దేశానికి సేవ చేయాలనే కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా.. మంచి వేతనాన్ని, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకోవచ్చు. కాబట్టి, దేశ సేవ చేయాలనుకునే యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

అగ్నిపథ్ పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):

అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరేందుకు ఏ వయస్సు వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు?

అగ్నిపథ్ పథకంలో చేరడానికి వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

సర్వీసులో ఉండగా అగ్నివీర్ అమరుడైతే ఎంత మొత్తం ఆర్థిక సాయం అందుతుంది?

అగ్నివీర్ సర్వీసులో ఉండగా అమరుడైతే.. సాధారణ సైనికుడి మాదిరిగానే పలు రకాల ఆర్థిక సాయం ఆయన కుటుంబానికి అందుతుంది. మొత్తం కోటిన్నర రూపాయల వరకు సాయం అందుతుంది. పూర్తి వివరాల కోసం పైన పేర్కొన్న కథనంలో చూడండి.

అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలోని మూడు విభాగాలు తమ అవసరాలకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్ చేపడతాయి. ఏ విభాగంలో చేరాలనుకుంటున్నారో (ఇండియన్ ఆర్మీ/ ఇండియన్ ఎయిర్ ఫోర్స్/ ఇండియన్ నేవీ) ఆ సైన్యం యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.

సాధారణ జవాన్ మాదిరిగి కాకుండా అగ్నివీర్‌కు కొన్ని పనులనే కేటాయిస్తారా?

అగ్నిపథ్ పథకం కింద సైన్యంలోని మూడు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి మీరు ఎంపికైతే.. ఆ విభాగానికి సంబంధించి ఒక సాధారణ సైనికుడు చేసే అన్ని పనులను మీరు చేయవలసి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ సైనికుడిలాగే మీ బాధ్యతలు ఉంటాయి.

అగ్నివీర్‌కు శిక్షణ ఉంటుందా?

అవును, అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరులకు శిక్షణ ఉంటుంది. సాధారణ జవాన్లకు నిర్వహించే తరహాలో కఠినమైన శిక్షణ ఉంటుంది.

అగ్నిపథ్ పథకం కింద ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం ఉంటుంది?

అగ్నిపథ్ పథకం కింద 10వ తరగతి, 12వ తరగతి పాసైన యువతకు సాయుధ బలగాలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. దీని కాలవ్యవధి 4 సంవత్సరాలు. నాలుగేళ్లు పూర్తైన తర్వాత సైన్యంలో పూర్తి స్థాయి ఉద్యోగిగా అవకాశం రావొచ్చు. లేదంటే ఆ తర్వాత ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో చేరవచ్చు. నాలుగేళ్లు పూర్తైన తర్వాత అగ్నివీర్‌కు ఒకేసారి రూ.11.71 లక్షలు అందజేస్తారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.