Whether you are a husband or wife, everything is according to the contract, do you know about this new trend?
భార్యా భర్తలే అయినా అంతా కాంట్రాక్ట్ ప్రకారమే, ఈ కొత్త ట్రెండ్ గురించి మీకు తెలుసా?
ఎమోషన్స్ వేరు. ప్రాక్టికాలిటీ వేరు అని బలంగా నమ్ముతున్న ఈ జనరేషన్ ఈ రెండింటి మధ్యా బ్యాలెన్స్ కోసం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే కొత్త ట్రెండ్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇలా కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే అయినా ఇప్పుడిప్పుడే దీనివైపు మొగ్గు చూపుతున్నారు. చెప్పుకోడానికి బాగానే ఉన్నా..దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటుండొచ్చు.
పెళ్లంటే నూరేళ్ల పాటు ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచే బంధం. అంటే ఓ సారి ముడి పడింది అంటే వాళ్లు జీవితం అంతా కలిసే ఉండాలన్నది వివాహ వ్యవస్థలో ఉన్న నిబంధన. సరే..ఈ రూల్ ని బ్రేక్ చేసిన వాళ్లు, చేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. మనస్పర్దలు, ఇంకేవో గొడవలు రకరకాల కారణాల వల్ల మధ్యలోనే విడిపోతున్నారు. అందుకే విడాకుల కేసులు పెరుగుతున్నాయి. అయితే..ఎన్నో శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వైరల్ అవుతున్న ట్రెండ్ మాత్రం కాంట్రాక్ట్ మ్యారేజ్.
అంటే..కాంట్రాక్ట్ పద్ధతిలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం అన్నమాట. ఆ కాంట్రాక్ట్ అయిపోయాక విడిపోతారు. ఎమోషన్స్ వేరు. ప్రాక్టికాలిటీ వేరు అని బలంగా నమ్ముతున్న ఈ జనరేషన్ ఈ రెండింటి మధ్యా బ్యాలెన్స్ కోసం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే కొత్త ట్రెండ్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇలా కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే అయినా ఇప్పుడిప్పుడే దీనివైపు మొగ్గు చూపుతున్నారు. చెప్పుకోడానికి బాగానే ఉన్నా..దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటుండొచ్చు. వీటి గురించే వివరిస్తున్నారు ఢిల్లీకి చెందిన రిలేషన్ షిప్ కౌన్సిలర్ డాక్టర్ మధు కొటియా.
వివాహ బంధానికి ఎక్స్ పైరీ డేట్
సాధారణంగా మన వివాహ వ్యవస్థలో పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ అంటూ ఉండదు. ఓ ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారంటే వాళ్లు జీవితాంతం కలిసే ఉండాలి. మధ్యలో విడాకులు తీసుకోవడం అనే సంగతి అలా ఉంచితే వివాహం ఉద్దేశం మాత్రం కలిపి ఉంచడమే. అయితే కాంట్రాక్ట్ మ్యారేజ్ లలో మాత్రం ఇలా కాదు. అబ్బాయి, అమ్మాయి ముందుగానే ఎన్ని రోజులు కలిసి ఉండాలో నిర్ణయించుకుంటారు. ఆ తేదీ వరకూ కలిసి ఉండడానికి కాంట్రాక్ట్ రాసుకుంటారు. అంటే ఆ వివాహ బంధానికి ఎక్స్ పైరీ డేట్ పెట్టుకుంటారు. ఒకవేళ ఆ తరవాత కూడా కలిసి ఉండాలనుకుంటే కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసుకుంటారు. లేదంటే అక్కడితో కథ ముగిసిపోతుంది. ఈ గడువులోనే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటారు. నచ్చితే బంధాన్ని కంటిన్యూ చేస్తారు.
ఆ రూల్ కి బ్రేక్
శాశ్వతంగా కలిసి ఉండాల్సిందే అన్న రూల్ ని బ్రేక్ చేయడమే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రధాన ఉద్దేశం. ఒకప్పుడు అంటే అడ్జస్ట్ అయిపోవడమో, సొసైటీ గురించి ఆలోచించి వెనక్కి తగ్గడమో లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అందరూ లిబరల్ గా ఆలోచిస్తున్నారు. పురుషులు, మహిళలు అన్న తేడా దాదాపు తగ్గిపోయింది. ఎవరి అభిరుచులు, అభిప్రాయాలు వాళ్లకి ఉంటున్నాయి. ఒకరిని ఇంకొకరు కంట్రోల్ చేయడాన్ని అసలు అంగీకరించడం లేదు. వివాహ బంధంలోనూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. వచ్చే పార్ట్ నర్ పూర్తిగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఈ కొద్ది రోజుల్లో రిలేషన్ షిప్ పై ఓ క్లారిటీ తెచ్చుకుని, కమ్యూనికేషన్ ఎలా ఉందని చెక్ చేసుకుని అప్పుడు ఓ నిర్ణయానికి వస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతమున్న సామాజిక పోకడలను పక్కన పెట్టి పూర్తిగా స్వేచ్ఛగా బతికేందుకే మొగ్గు చూపుతున్నారు.
డైవర్స్ పెరగకుండా
ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ లు డైవర్స్ కేసులు పెరగకుండా చూస్తుండొచ్చు. ఎందుకంటే ఇందులో విడిపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఎన్ని రోజులు ఇష్టమైతే అన్ని రోజులు కలిసి ఉంటారు. ఆ తరవాత ఎవరి దారి వారిదే. ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉండాలన్న ప్రెజర్ ఉండదు. సాధారణంగా డైవర్స్ అయిన వాళ్లని అదోలా చూస్తుంది సొసైటీ. తప్పు ఎవరిది అయినా నింద మాత్రం ఇద్దరూ మోయాలి. ఈ గొడవంతా ఎందుకు అనుకుంటున్న వాళ్లే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ లను ఎంచుకుంటున్నారు.
కొన్ని ఇబ్బందులు
చెప్పుకోడానికి బాగానే ఉంది. కానీ ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లకి పిల్లలు పుడితే పరిస్థితి ఏంటనేది చెప్పడం కష్టమే. ఆ పిల్లలకు ఓ భద్రత అంటూ లేకుండా పోతుంది. ఇదొక్కటే కాదు. ఇద్దరి మధ్యా ఓ ఎమోషన్ అనేది ఉండకపోవచ్చు. ఇది జస్ట్ కాంట్రాక్ట్ అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇద్దరి మధ్య ఎమోషనల్ ఇంటిమసీ ఉండే అవకాశం తక్కువ. అవతలి వ్యక్తిని సొంతం అనుకుంటే తప్ప ఇది బిల్డప్ అవదు. ఇక్కడ ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నాక బాండింగ్ అనే మాటే వినిపించదు.
ప్రేమ ముఖ్యం
ఏ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నారన్నది పక్కన పెడితే ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం మాత్రం కచ్చితంగా ఉండాలి. అప్పుడే ఏ రిలేషన్ అయినా నిలబడేది. ఎంత కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా సరే కమిట్ మెంట్ అంటూ ఉండాలి. కలిసి ఉన్న ఆ కొద్ది రోజులైనా ఇద్దరూ హ్యాపీగా బతకాలి. ఇది జస్ట్ ఓ ఒప్పందం. అప్పటి వరకే నువ్వు నేను అనుకుంటే అసలు ఆ మాత్రం కలిసి ఉండడంలో కూడా ఏ అర్థం ఉండదు. అయితే..ప్రస్తుతానికి కాంట్రాక్ట్ మ్యారేజ్ లను సమాజం పూర్తిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు. ఏదేమైనా ఈ తరహా కొత్త ట్రెండ్ లపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్స్.
గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఇది ఎవర్నీ ఉద్దేశించినది కాదు. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.