The mother-in-law can also file a case of domestic violence against the daughter-in-law
అత్తగారు కూడా కోడలిపై గృహహింస కేసు పెట్టొచ్చు..: అలహాబాద్ హైకోర్టు
Allahabad HC on Domestic Violence Case: మనకు తెలిసినంత వరకు గృహహింస చట్టం కింద ఎక్కువగా కోడళ్లే కేసులు పెడుతుంటారు. కొందరు నిజంగానే వేధింపులకు గురై కేసులు పెడుతుంటే, మరికొందరు మాత్రం అత్తింటి వారిపై పగ తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిందే కాగా.. తొలిసారి ఓ అత్తగారు కోడలిపైనే గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు విచారణ కూడా జరిపింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. ఒకే ఇంట్లో ఉండే ఏ స్త్రీ అయినా సరే ఈ కేసును పెట్టొచ్చని వివరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలికి చెందిన సుధా మిశ్రాకు ఓ కుమారుడు ఉండగా.. చాలా రోజుల క్రితమే అతడికి గరిమా అనే అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే వీరంతా ఒకే ఇంట్లో ఉంటుండగా.. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలోనే గతేడాది జూన్ 30వ తేదీన సుధా మిశ్రా కోర్టును ఆశ్రయించింది. తన కోడలు గరిమా.. కుమారుడితో పాటు ఇంట్లో ఉన్న వాళ్లందరినీ తీవ్రంగా వేధిస్తోందని, తన బంధువుల సాయంతో ఇంట్లోకి చొరబడి తన డబ్బు, నగలు కూడా దోచుకెళ్లిందంటూ ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా తన కుమారుడిని వారి పుట్టింటికి వచ్చి అక్కడే ఉండిపోవాలని కోరుతుందని చెప్పుకొచ్చింది.
కానీ అందుకు కుమారుడు ఒప్పుకోకపోవడంతో.. రోజూ ఇంట్లో గొడవ చేస్తూ అందరినీ తీవ్రంగా వేధిస్తుందని వివరిస్తూ గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. అయితే సుధా మిశ్రా వేసిన పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. ముఖ్యంగా సుధా మిశ్రా చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుని కోడలితో పాటు ఆమె బంధువులకు సమన్లు జారీ చేసింది. దీంతో వారంతా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. వరకట్న వేధింపుల కింద తాను కేసు పెడితే.. అత్తగారు గృహహింస చట్టం కింద తనపై కేసు పెట్టారని గరిమా పిటిషన్‌లో పేర్కొంది. అలాగే గృహహింస చట్టం కింద కేసు పెట్టే హక్కు తనకు మాత్రమే ఉందని వివరించింది.
ఈక్రమంలోనే గురువారం రోజు విచారణ జరిపిన న్యాయస్థానం షాకింగ్ కామెంట్లు చేసింది. ట్రయల్ కోర్టు ఆరోపణలను జాగ్రత్తగా పరిశీలించామని.. అత్త గృహ హిసం చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కోడలు వేసిన వాదనను తోసిపుచ్చింది. అలాగే కోడలు గరిమాపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేయడానికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా బంధుత్వంతో సంబంధం లేకుండా, ఒకే ఇంట్లో నివసించే మహిళలు అందరికీ సదరు చట్టం వర్తిస్తుందని.. ఎవరిని ఎవరు శారీరకంగా, మానసికంగా వేధించినా కేసు పెట్టొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.