'PF' with draw through Phone Pay, Google Pay..
PF Withdrawal: ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 'పీఎఫ్' విత్ డ్రా.. త్వరలోనే కొత్త సదుపాయం!
PF Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి నగదు విత్ డ్రా ఇకపై చాలా ఈజీగా చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్లో నుంచి తీసుకునే మాదిరిగానే ఈపీఎఫ్ ఖాతాలోని నగదును సైతం ఉపసంహరణ చేసుకునే కొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఏటీఎం కేంద్రాలతో పాటుగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్స్ ద్వారా కూడా ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలోని నగదు తీసుకునేందుకు కొన్ని రోజుల పాటు సమయం పడుతోంది. దరఖాస్తు తిరస్కరణకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
పీఎఫ్ విత్ డ్రా సులభతరం చేసే ప్రక్రియలో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తామని ఇటీవలే కేంద్రం కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెల నాటికి ఈ ఏటీఎం నగదు విత్ డ్రా సదుపాయం అందుబాటులోకి రాబోతోందని పేర్కొన్నారు. దీంతో పాటుగా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించిన కసరత్తు సైతం జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌తో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మే లేదా జూన్ నెల నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ సదుపాయం సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగినట్లయితే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా నగదును బదిలీ చేసుకునే వీలు కలుగుతుంది. అయితే, గరిష్ఠంగా ఎంత మేర నగదు తీసుకోవచ్చు, ఏమైనా పరిమితిలు ఉంటాయా? వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇలాగ నగదు విత్ డ్రా సులభతరం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్ము చాలా మందికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే, ఇష్టారీతన పీఎఫ్ నగదు విత్ డ్రా చేస్తే అసలు ఉద్దేశం దెబ్బతినే అవకశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.