Hyderabad Regional Ring Road

 Key Update On Hyderabad Regional Ring Road Northern Part

రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. రూ.18,772 కోట్లతో.. కేంద్ర మంత్రి ప్రకటన

Key Update On Hyderabad Regional Ring Road Northern Part
తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి.. రూ.18,772 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ అంచనా వ్యయాన్ని కూడా అధికారులు సిద్ధం చేసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇప్పటికే రూ.6280 కోట్ల వ్యయంతో 285 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను నిర్మించినట్టు స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జాతీయ రహదారులను ఇప్పటికే పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కిలో మీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారులను నిర్మించినట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన రహదారులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించిన కిషన్ రెడ్డి.. ఈ ప్రారంభోత్సవానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నట్టు తెలిపారు.

మరోవైపు.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) గురించి కూడా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు. ఫైనాన్స్‌కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేసిన అధికారులు.. అందుకు సంబంధించిన అంచనా వ్యయాన్ని కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు.

మరోవైపు.. ఆరాంఘర్ నుంచి శంషాబాద్‌కు ఆరు లేన్ల హైవే కూడా ఇప్పటికే పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తయిందని చెప్పుకొచ్చారు. వీటితో పాటు.. బీహెచ్ఈఎస్ ఫ్లైఓవర్ కూడా తుదిదశకు చేరుకుందని.. వచ్చే నెలలో పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తయితే కూకట్‌పల్లి పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరోవైపు.. కేంద్రం, తెలంగాణల మధ్య పరిష్కారం కాని సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం (మార్చి 08న) ప్రజా భవన్‌లో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించగా.. ఈ భేటీకి బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు. ఇందుకు సంబంధించి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కిషన్ రెడ్డి లేఖ కూడా రాశారు. తమ పార్టీ ఎంపీలకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని లేఖలో తెలిపారు. ఎంపీలకు నియోజకవర్గాల్లో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని.. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేకపోతున్నామని లేఖలో వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభివృద్దికి అన్ని విధాల కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తశుద్ది, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు.
Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.