Which state in India has the highest number of women drinking alcohol?
Women Alcohol: భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మహిళలు అత్యధికంగా మద్యం తాగుతున్నారు? ఏపీ, తెలంగాణ వాటా ఎంత?
ఒకప్పుడు మగవారు మాత్రమే మద్యం తాగేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా తాగుతున్నారు. ఆడవారు మద్యం తాగడం ప్రస్తుతం సర్వసాధారణం అవుతోంది. ఈ కల్చర్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువ మందు తాగుతున్నారో ఓ సర్వే గుర్తించింది. అందులో ఏపీ, తెలంగాణ వాటా ఎంతో ఇక్కడ చూద్దాం.
మారుతున్న కాలంతో పాటు మహిళల్లోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మగవారు మాత్రమే తాగే మద్యాన్ని ఇప్పుడు ఆడవారు కూడా పోటీపడి తాగుతున్నారు. ఓ సర్వే ప్రకారం మొత్తం భారతదేశంలో 1 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా, ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారో ఇక్కడ చూద్దాం.
ఈశాన్య రాష్ట్రాల్లో
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎవరూ ఊహించని స్థాయిలో మహిళలు మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్‌లో, 15-49 సంవత్సరాల వయస్సు గల 26 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇక్కడి సంస్కృతి మద్యాన్ని ప్రోత్సహించేలా ఉండటం ఇందుకు కారణం కావచ్చు.
సిక్కిం
సిక్కింలో 16.2శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో ఎక్కువశాతం ఇంట్లోనే మద్యం తయారుచేస్తారని చెబుతుంటారు.
అస్సాం
అస్సాం రాష్ట్రంలో 7.3 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నాారు. మొదటి రెండు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే, అస్సాంలోని గిరిజన సమాజాలు కూడా మద్యం తయారీ, సేవించడంలో సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి.
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో 6.7 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో నగర ప్రాంతాల కంటే ఎక్కువ గ్రామీణ మహిళలు మద్యం సేవిస్తున్నట్లు తేలింది.
జార్ఖండ్
ఈశాన్య రాష్ట్రాల పక్కనే ఉన్న జార్ఖండ్‌లో కూడా 6.1శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
అండమాన్ & నికోబార్ దీవులు
జాబితాలో ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ & నికోబార్ దీవులు. ఇక్కడ 5 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్
జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 5 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది.
ఏపీ, కర్ణాటక
కర్ణాటకలో 0.21% మహిళలు మాత్రమే మద్యం సేవిస్తున్నట్లు తేలింది. ఇది దేశంలో మొత్తం మహిళల మద్యపాన శాతం కంటే తక్కువ. బెంగళూరులో 0.9% మహిళలు మద్యంకు బానిసలయ్యారు. వీరిలో ఈశాన్య, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారే ఎక్కువ. దక్షిణ భారతదేశంలో తెలంగాణ మినహా ఏపీ తదితర రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా మద్యం సేవించరని తేలింది.