Why did AR Rahman's couple get separated?
ఏఆర్ రెహమాన్ దంపతులు ఎందుకు విడిపోయారు?
ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకుంటున్నారు.
దీనికి సంబంధించి వారిద్దరి తరఫు న్యాయవాది వందనా షా నవంబర్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు.
పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త ఏఆర్ రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ టెన్షన్ కారణంగా ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చారని ఆ ప్రకటనలో తెలిపారు.
"ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి " అని తెలిపారు.
విడిపోతున్న విషయాన్ని ఏఆర్ రెహమాన్ (57) మంగళవారం అర్ధరాత్రి దాటాక తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు.
‘మా వైవాహిక బంధం 30 ఏళ్లకు చేరుతుందని ఆశించాం, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. పగిలిన ముక్కలు మళ్లీ యథాతథంగా అతుక్కోలేవు కానీ, ఈ భగ్నంలో అర్థాన్ని మేం వెతుక్కుంటాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.
విడాకులకు సంబంధించి రెహమాన్ భార్య సైరా బాను తొలుత ప్రకటించారని, ఆ తరువాత వారిద్దరి నుంచి ఉమ్మడి ప్రకటన వచ్చిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
విడిపోవాలనే నిర్ణయం చాలా బాధతో కూడుకున్నదని సైరా, రెహమాన్‌లు ఆ ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.
జీవితంలోని ఈ క్లిష్ట దశ నుంచి బయటికి రావడానికి, వారి ప్రైవసీని గౌరవించాలని ఇద్దరూ ప్రజలను అభ్యర్థించారు.
రెహమాన్ దంపతులకు ఎంతమంది పిల్లలు?
సైరా బాను, రెహమాన్‌లు 1995లో వివాహం చేసుకున్నారు.
వారికి ముగ్గురు సంతానం.. ఖతీజా, రహీమా, అమీన్.
అమీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభ్యర్థిస్తున్నాం. దీన్ని అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు" అని తెలిపారు.
ప్రతిష్టాత్మక అవార్డులు:
ఆస్కార్, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న రెహమాన్ సంగీత ప్రపంచంలో దాదాపు 32 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
రెహమాన్ 1989లో అంటే 23 ఏళ్ల వయసులో ఇస్లాం స్వీకరించారు.
ఏఆర్ రెహమాన్ వందల సినిమాలకు సంగీతం అందించారు. వీటిలో లగాన్, తాల్ వంటి చిత్రాలతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్టిస్టులతో రెహమాన్ పనిచేశారు.
