Do you know how dangerous it is to use tape on a damaged charging cable?
చార్జింగ్ కేబుల్ పాడైతే టేప్ అంటించి వాడడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
మనలో చాలామంది పాత చార్జింగ్ కేబుల్స్ వాడుతుంటాం. వీటి కేబుల్స్ పాడై, వాటి వైర్లు బయటకు వచ్చినా సరే వాటికో టేపు చుట్టేసి చార్జింగ్ పెట్టేస్తుంటాం. కానీ, ఇలా చేయడం ప్రమాదాలను కొనితెచ్చుకోవడమేనని తెలుసా?
పాడైన లేదా తెగిన కేబుల్స్ వల్ల ఫోన్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తెగిన లేదా లేదా పాడైన చార్జర్స్, నాసిరకం చార్జర్స్ కొనుగోలు చేయడం అంత మంచిది కానే కాదు.
పాడైన కేబుల్‌తో ఫోన్ చార్జింగ్ పెడితే, మనకు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది.
కొన్ని మీడియా కథనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలో అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్నిసార్లు నకిలీ చార్జర్లు ఉపయోగించడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి.
యూకేలోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ఇలాంటి చార్జర్లను ‘ప్రమాదానికి కారణమయ్యే వాటిగా’ పేర్కొంది. ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు, ‘‘మేం అనేక నకిలీ చార్జర్లను సేకరించాం. వాటిల్లో 98శాతం వినియోగదారులకు ప్రమాదాన్ని కలిగించేవే’’ అని తెలిపింది.
అందుకే సెల్‌ఫోన్ చార్జర్లను కొనుగోలుచేసేముందు భవిష్యత్తుముప్పును ఊహించి జాగ్రత్త వహించాలని కోరింది.
నాసిరకం లేదా, తాత్కాలికంగా రిపేరు చేసిన చార్జర్లు ఉపయోగిస్తే అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చార్జర్లు ఫోన్లు త్వరగా వేడెక్కించి పేలిపోయేలా చేస్తాయి. ఈ పేలుళ్ళు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి.
‘‘నాసిరకం కేబుళ్ళు, చార్జర్లు విద్యుత్ షాక్‌కు దారితీస్తాయి. దీనివల్ల సెల్‌ఫోన్‌కు మంటలు అంటుకుంటే తద్వారా ఇల్లు కూడా తగలబడే ప్రమాదముంటుంది’ అని ది ఎలక్ట్రిక్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది.
మాప్పియర్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 25 శాతం గృహ దహనాలు ఎలక్ట్రిక్ వైరింగ్ కారణంగానే జరిగాయి. వీటిల్లో ఎక్కువ భాగంగా మొబైల్ ఫోన్లు, చార్జర్లే కారణంగా నిలిచాయి.
ఫోన్ బ్యాటరీ డెడ్ అయితే?
తక్కువ నాణ్యత ఉన్న కేబుల్స్, చార్జర్లు వినియోగించడం వల్ల మన ఫోన్ బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గిపోయి ఒక దశలో పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
దీనికి కారణం నాసిరకం చార్జర్లు బ్యాటరీకి తగినంత విద్యుత్‌ను సరఫరా చేయవు. ఇది బ్యాటరీ జీవితకాలంపై ప్రభావం చూపుతుంది. మీ చార్జర్ కేబుల్ తెగిపోతే దానిని టేపు వేసి అతికించకండి. మీ అంతట మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఇలాంటి రిపేర్లు చేయకండి.
చార్జర్ కేబుల్ తెగిపోయినా, లేదా దెబ్బతిన్నా వెంటనే మీఫోన్ బ్యాటరీ పవర్ సరిపోయే ఒరిజినల్ చార్జర్ ను కొనుగోలుచేయడం దీనికి ఉత్తమ పరిష్కారం.
చార్జర్ పాడైనట్టు తెలుసుకోవడమెలా?
మీరు చార్జర్ కొనుగోలుచేసేటప్పుడు నకిలీ చార్జర్లకు, అసలైన చార్జర్లకు తేడా గుర్తించడం పెద్ద కష్టమైన పనేం కాదంటున్నారు నిపుణులు.
మీరు చేయాల్సిందల్లా ఈ కింది విషయాలను గుర్తుంచుకోవడమే..
- చార్జర్ పైన ఉండే లేబుల్ వంక ఓ సారి చూడండి, బ్రాండ్, నాణ్యత అనేవి లోపాన్ని వెంటనే బయటపడేలా చేస్తాయి.
- సాకెట్ చివరన పరిశీలించండి. అక్కడ మరీ మెరుస్తున్నట్టుగా ఉంటే, అది సమస్యాత్మకమైనది కావచ్చు.
- చార్జర్ బరువు : నాసిరకం చార్జర్లు తక్కువ బరువు, చౌకైన మెటీరియల్స్‌తో తయారుచేస్తారు. చార్జర్ లోపల బోలుగా ఉంటుంది.
- సైజు : చార్జర్ కనుక నకిలీదైతే వాటి ప్లగ్గులు పెద్దవిగా ఉంటాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ ఫోన్, చార్జర్ల గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంపాటు మన్నికగా ఉంటాయి.
- చార్జర్ కేబుల్ ను జాగ్రత్తగా చుట్టండి.
- ఎలా అంటే అలా చుడితే కేబుల్ తెగిపోయే ప్రమాదం ఉంటుంది.
- కేబుల్ ను బలంగా మడిచే ప్రయత్నాలు చేయకండి.
- చార్జర్ ను సూర్యకాంతికి, వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచండి.
- ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ ఫుల్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే చార్జింగ్ ఆపేయండి.
- ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి చార్జింగ్ పెడితే బ్యాటరీ జీవితకాలం ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- రాత్రంతా ఫోన్ చార్జింగ్ పెట్టడం చార్జర్‌కు, ఫోన్ కు కూడా ప్రమాదకరం.
- చార్జింగ్ పూర్తవగానే చార్జర్ నుంచి ఫోన్ వేరు చేయండి.
- చార్జర్ స్విచ్ కూడా ఆఫ్ చేయండి.
