What did this couple who treated Ratan Tata say..
రతన్ టాటాకు సంప్రదాయ వైద్యం చేసిన ఈ దంపతులు ఏం చెప్పారంటే..
‘‘రోజుకు రెండు గంటల చొప్పున, ఎన్నో గంటల పాటు రతన్ టాటాకు సంప్రదాయ వైద్యం (థెరపీ) చేశాను. ఆ సమయంలో ఆయన ఎన్నో విషయాల గురించి మాతో మాట్లాడేవారు’’ అని తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మరుధమలైకి చెందిన కోము లక్ష్మణన్ చెప్పారు. ఆయన వర్మమ్ థెరపిస్ట్.కొన్ని రోజుల కిందట మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు గతంలో వర్మమ్ థెరపీ (ఒక రకమైన సంప్రదాయ వైద్యం) చేశామని లక్ష్మణన్ తెలిపారు.
లక్ష్మణన్ కోయంబత్తూరులోని మరుధమలై కొండల్లో సంప్రదాయ ఔషధ క్లినిక్‌ను నడుపుతున్నారు. 2019లో, ముంబయిలో రతన్ టాటా ఇంట్లోనే ఉండి, ఆయనకు లక్ష్మణన్ చాలా రోజుల పాటు వైద్యం చేశారు.
రతన్ టాటాను ఎప్పుడు కలిశారు?
2019 జనవరిలో టాటా సన్స్ డైరెక్టర్ ఆర్‌కే కృష్ణకుమార్ తమకు ఫోన్ చేశారని లక్ష్మణన్ చెప్పారు.
‘‘కృష్ణకుమార్ కేరళలోని తలస్సేరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఒక వీవీఐపీకి వైద్యం చేయడం కోసం ముంబయికి రావాల్సి ఉంటుందని ఆయన మాకు చెప్పారు. ఆ వైద్యం ఎవరికి చేయాలో ఏమీ చెప్పలేదు’’ అని లక్ష్మణన్ తెలిపారు.
‘‘సాధారణంగా మా దగ్గరికి వచ్చే వారికే మేం చికిత్స చేస్తాం. వ్యక్తిగతంగా బయటికి వెళ్లి ఎవరికీ చికిత్స చేయం అని చెప్పాను. ఆ తర్వాత కొన్ని నెలల వరకు ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ఆ తర్వాత, 2019 అక్టోబర్‌లో కృష్ణకుమార్ మళ్లీ కాల్ చేశారు.
రతన్ టాటాకు వైద్యం చేయాలని ఆయన కోరారు. రతన్ వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. ఒక తమిళ స్నేహితుడి ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. మా టీమ్ మీ క్లినిక్‌ను పరిశీలిస్తుంది. వారు చెప్పేదాని ప్రకారం, నేను మీతో మళ్లీ మాట్లాడతానని కృష్ణకుమార్ అన్నారు’’ అని లక్ష్మణన్ గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ముంబయికి వెళ్లడం గురించి తన భార్య మనోన్మణితో చర్చించినట్లు లక్ష్మణన్ తెలిపారు.
రతన్ టాటాకు వైద్య సేవలు అందించేందుకు తన భార్యతో కలిసి 2019 అక్టోబర్‌లో ముంబయికి వెళ్లినట్లు లక్ష్మణన్ గుర్తు చేసుకున్నారు.
సంప్రదాయ వైద్యం:
రతన్ టాటాకు చేసిన వైద్యం గురించి వివరించిన లక్షణన్, ముంబయిలోని ఆయన ఇంటికి సమీపంలో ఉన్న గెస్ట్ హౌస్‌లో తాము ఉన్నట్లు చెప్పారు.
‘‘గెస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు, రతన్ టాటా ఇంటికి వెళ్లి, రోజూ 2 గంటలు చికిత్స చేసేవాడిని. సాధారణంగా, తరచూ మా దగ్గరకు వచ్చే రోగులకు వర్మమ్ విధానంలో ఐదు నిమిషాలకు మించి చికిత్స చేయం. కానీ, ఆయనకు వర్మమ్ విధానంలో రోజూ 2 గంటలు చికిత్స చేసేవాడిని. వర్మమ్ విధానంలోని వాషింగ్ మెథడ్ ద్వారా తల నుంచి పాదాల వరకు రక్త ప్రసరణను మెరుగుపరిచే చికిత్స ఇది’’ అని లక్ష్మణన్ వివరించారు.
తాము చేసిన చికిత్సతో రతన్ టాటా సంతృప్తి చెందారని, ఈ సంప్రదాయ తమిళ వైద్య విధానం గురించి మరింత అడిగి తెలుసుకున్నారని లక్ష్మణన్ తెలిపారు.చికిత్స తర్వాత నెల రోజులకు, కృష్ణకుమార్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. రతన్ టాటా కాలులో చిన్న వాపు వచ్చిందని చెప్పడంతో లక్ష్మణన్ మళ్లీ ముంబయికి వెళ్లారు.
‘‘మళ్లీ మేం అక్కడికి వెళ్లాం. చికిత్స చేయడం కోసం నాలుగు రోజులు అక్కడే ఉన్నాం. 20 నుంచి 25 గంటల పాటు చేసిన చికిత్స సమయంలో ఆయన చాలా విషయాలు మాతో పంచుకున్నారు. నా కుటుంబ విషయాలను అడిగి తెలుసుకునేవారు. ఒకరోజు, సడెన్‌గా మీరు ఈ వైద్య కళను ప్రపంచానికి ఎప్పుడు పరిచేయం చేస్తారు? అని అడిగారు. అది నా చేతుల్లో లేదు, మీ దగ్గరే ఉందని చెప్పాను. ఆ తర్వాత వెంటనే ‘బొటన వేలు’ పైకి ఎత్తి ‘థంబ్స్ అప్’ చెప్పారు’’ అని లక్ష్మణన్ వివరించారు.
‘‘ఒకరోజు వైద్యం చేస్తున్నప్పుడు, మళ్లీ నా కుటుంబ విశేషాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేను, మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? అని అడిగాను. దానికి ఆయన ‘విధి ఆడిన నాటకం’ అని సమాధానమిచ్చారు. అంత ఉన్నతమైన మనిషి నాతో ఇంత సింపుల్‌గా మాట్లాడటాన్ని చూసి ఆశ్చర్యం వేసేది’’ అని లక్ష్మణన్ చెప్పారు.
రతన్ టాటా సాధారణ జీవనశైలి:
తాము తైలం, లేపనంతో వైద్యం చేసే ప్రక్రియ ఆయన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని లక్ష్మణన్ భార్య మనోన్మణి అన్నారు.
"'మనోన్మణి, మీరు నా కూతురు లాంటివారు. నేను కోయంబత్తూరుకు వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాను అని రతన్ టాటా చెప్పారు. ఆ తర్వాత ఆయన కోయంబత్తూరుకు వస్తున్నట్లు తాజ్ హోటల్ నుంచి సమాచారం అందించారు. కానీ ఆ ట్రిప్ రద్దు అయింది’’ అని ఆమె చెప్పారు.
"ఆయన సాధారణ జీవనశైలినే అనుసరిస్తారు. మా పట్ల ఆయన చూపిన ప్రేమ ఎన్నటికీ మరువలేనిది. ఆయన మరణవార్త విన్న వెంటనే ముంబయికి బయలుదేరి రతన్ టాటాకు నివాళులర్పించాం’’ అని మనోన్మణి చెప్పారు.
రతన్ టాటాకు చికిత్స చేసేందుకు ముంబయికి వెళ్లినప్పుడు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్‌ను కూడా కృష్ణకుమార్ పరిచయం చేశారని లక్ష్మణన్ చెప్పారు.