Rupkavar Sati Case: What was this case that ruled Rajasthan politics and what happened?
రూప్‌కవర్ సతీ కేసు: రాజస్థాన్ రాజకీయాలను శాసించిన ఈ కేసు ఏమిటి, ఏం జరిగింది?
రాజస్థాన్‌లో 37 ఏళ్ల కిందట జరిగిన 'రూప్‌కవర్ సతీ' కేసులో ఎనిమిది మందిని అక్టోబర్ 9న జైపూర్ స్పెషల్ కోర్టు నిర్దోషులని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయాలని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను 14 మహిళా సంఘాల బృందం డిమాండ్ చేసింది.
రాజస్థాన్‌లోని దివరాల గ్రామంలో 'సతీ' సంఘటన జరిగినప్పుడు, రూప్‌కవర్ వయస్సు 18 సంవత్సరాలు. ఘటన జరిగిన 37 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువడింది.
ఈ తీర్పుపై సామాజిక న్యాయం, మహిళల హక్కులకోసం పోరాడే కవితా శ్రీవాస్తవ మాట్లాడుతూ “న్యాయం ఆలస్యమైందంటే, న్యాయం దక్కలేదనే అర్థం’’ అని అన్నారు.
“37 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు రావడంలో అర్థం ఏమిటి? 2004లో ఈ కేసులో బీజేపీ, కాంగ్రెస్ నేతలతో సహా పలువురు నిర్దోషులుగా విడుదలైనప్పటికీ అప్పటి వసుంధర రాజే ప్రభుత్వం అప్పీలు చేయడానికి నిరాకరించింది’’ అని ఆమె అన్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న హరిదేవ్ జోషి రాజీనామా చేశారు. 'సతీ' కేసులో నిందితులు ఒక్కొక్కరుగా నిర్దోషులుగా విడుదలయ్యారు, ఈ కేసు విషయంలో దివరాలలో ఇంకా నిశ్శబ్దం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సతీ కేసుకు వ్యతిరేకంగా గ్రామంలో నోరు మెదపడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు.
మహిళా సంఘాలు ఏం చెప్పాయి?
'రూప్‌కవర్ సతీ కేసు'లో తీర్పు వెలువడిన తర్వాత 14 మహిళా సంఘాల బృందం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కోర్టు తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని లేదా న్యాయం జరిగేలా ఇతర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భజన్ లాల్‌ను డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో సతీ ఆచారాన్ని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశాయి.
మహిళా సంఘాల ప్రకటనలో.. “2004 జనవరి 31న 17 మందికి పైగా నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. అందులో అప్పటి వైద్య శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ రాథోడ్, ఆహార, రవాణా శాఖల మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్, సతీ ధర్మ రక్షా సమితి, జైపూర్ రాజ్‌పుత్ సభ భవన్ సీనియర్ నాయకులు ఉన్నారు.
నిందితుల నిర్దోషిత్వాన్ని సవాలు చేయడానికి మహిళా సంస్థలు తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ విభాగం అప్పీల్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ కేసు పట్ల చాలామంది అజాగ్రత్తగా వ్యవహరించారు, పోలీసులు, ప్రాసిక్యూషన్ సరిగా వ్యవహరించలేదు, ఇది అప్పీల్ చేయాల్సిన కేసు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్లకూడదని అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్ణయించుకున్నారు. మాకు వేరే మార్గం లేదు, మేము 14 సంస్థలు, కొందరు వ్యక్తులతో కలిసి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. మా పిటిషన్ గత 20 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది" అని తెలిపాయి.
దివరాలలో నిశ్శబ్దం:
'రూప్‌కవర్ సతీ' గురించి దివరాలలోని అందరికీ తెలిసినా, ఎవరిని అడిగినా.. అలాంటి సంఘటన జరగలేదని చెబుతున్నారు.
1987 సెప్టెంబరు 4న సికార్ జిల్లాలోని దివరాలాలో జరిగిన 'రూప్‌కవర్ సతీ' కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను జైపూర్‌లోని సతీ నివారణ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం (అక్టోబర్ 9న) నిర్దోషులుగా ప్రకటించడంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
ఈ కేసుపై గతంలో పలు టీవీ ఛానళ్లలో మాట్లాడిన వారు కూడా భయపడి, ఇక ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకూడదనే రీతిలో ఉన్నారు. మాట్లాడితే సమాజం వారిని దూషించడమో లేదా పోలీసులు వేధిస్తారేమోనని భయపడుతున్నారు.
కోర్టులో ఏం జరిగింది?
సతీ నివారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలను రుజువు చేయలేకపోయింది.
నిందితుల తరపు న్యాయవాది అమన్ చైన్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. నిర్దోషులుగా విడుదలైన వారు సంఘటన జరిగిన సమయంలో 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పాఠశాల విద్యార్థులని, వారు సతీని ప్రోత్సహించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
ఇక 2004 జనవరి 31న ఇదే కోర్టు బీజేపీ నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్, కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్, రూప్‌కవర్ సోదరుడు గోపాల్ సింగ్ రాథోడ్ సహా 25 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఘటన జరిగిన అనంతరం అరెస్టయిన 32 మందిని 1996 అక్టోబర్‌లో సికార్ జిల్లాలోని అదనపు జిల్లా జడ్జీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ సంఘటన రాజస్థాన్ రాజకీయాలను మార్చివేసింది.
అప్పట్లో ప్రభుత్వ వైఖరి ఏమిటి?
సతీ కేసుపై రాష్ట్రంలోని రాజ్‌పుత్ కమ్యూనిటీ ఆందోళనకు దిగింది. ఇది తమ ఆచారాలకు సంబంధించిన అంశమని, ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని భావించింది.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో రాజ్‌పుత్‌లకు మద్దతుగా నిలిచారు. అయితే కులపరంగా రాజ్‌పుత్ అయినప్పటికీ అప్పటి బీజేపీ నాయకుడు బైరాన్ సింగ్ షెకావత్ మాత్రం ఇది తప్పుడు సంప్రదాయమని, ఆధునిక సమాజం చేయకూడనిదని అన్నారు.
అప్పటి రాజకీయాలపై అవగాహన ఉన్న వారి ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి హరిదేవ్ జోషీ వారి ఆచారాలలో కలగచేసుకోకూడదని విశ్వసించారు.
రాష్ట్ర హోం మంత్రి గులాబ్ సింగ్ శక్తావత్ ఈ మొత్తం ఘటనను మతపరమైన అంశంగా పేర్కొంటూ అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. ఒకవేళజోక్యం చేసుకుంటే రాజ్‌పుత్ సమాజంలో కాంగ్రెస్‌పై కోపం పెరుగుతుందని సీఎం జోషీ అభిప్రాయపడ్డారు.
జోషీ ప్రకారం.. రాజకీయంగానే కాదు, ప్రభుత్వ దృక్పథంలోనూ ఇది సరైనది కాదు. కాబట్టి, ప్రభుత్వం చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఆటంకం లేకుండా కుటుంబం హిందూ సంప్రదాయం ప్రకారం మరణానంతర కర్మలను నిర్వహించుకోవడానికి అనుమతించాలి.
అయితే, ఈ సామాజిక ఆచారాలు అమలు చేయకుండా ప్రభుత్వం తక్షణమే ఆపాలని అప్పటి కేంద్ర హోం మంత్రి బూటా సింగ్ సూచించారు. బూటా సింగ్ సూచనలను జోషి పట్టించుకోకపోవడంతో, వివాదం తీవ్రమైంది. జోషీపై అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి ఫిర్యాదు చేశారు. దీంతో హరిదేవ్ జోషీపై రాజీవ్ గాంధీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం ఒత్తిడి తర్వాత చట్టం:
ఇంతలో 'సతీ' మద్దతుదారులకు, ప్రభుత్వానికి మధ్య పోరాటం కొనసాగింది.
అయితే, ‘సతీ’ వ్యతిరేకులతోపాటు, కేంద్ర హోం మంత్రి బూటా సింగ్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 1988 జనవరి 3 నుంచి రాజస్థాన్‌లో సతీ నివారణ చట్టం అమల్లోకి తెచ్చారు.
అయితే రూప్‌కవర్ సతీ ఘటనకు ఏడాది పూర్తవడంతో 1988లో రూప్‌కవర్ దహనమైన శ్మశానవాటికలోనే వేలాది మంది ప్రజల సమక్షంలో ‘చున్రీ మహోత్సవం’ నిర్వహించారు. ఈ ఘటన మరోసారి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికలకెక్కింది. జోషీ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసుల నియంత్రణలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించింది.
జోషీ చర్యలపై అప్పటి జర్నలిస్ట్ సీతారాం ఝలానీ స్పందిస్తూ.. ''జోషీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆందోళన చెందారు. రూప్‌కవర్ సతీ కేసు రాజ్‌పుత్ కమ్యూనిటీని కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం చేస్తుందని భయపడ్డారు, చివరకు అదే జరిగింది'' అన్నారు.
రాజస్థాన్ రాజకీయాల్లో ఇది చాలా సున్నితమైన అంశం. కానీ రాజ్‌పుత్ కమ్యూనిటీ జైపూర్ వీధుల్లో కత్తులతో ఊరేగింపు చేపట్టడంతో హద్దులు దాటింది. ఈ కత్తుల ఊరేగింపునకు ఎటువంటి ఆటంకాలు సృష్టించవద్దని ముఖ్యమంత్రి జోషీ అప్పటి డీజీపీని ఆదేశించారు. అయితే ఈ ఊరేగింపును ఆపడానికి అవసరమైతే ఆర్మీని పిలవాలని కేంద్ర హోం మంత్రి బూటా సింగ్ సూచించారు
‘దివరాల సతీ ఘటన’పై లోక్‌సభలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పాటు కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘సతీ ఘటన’పై కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యే, మాజీ మంత్రి నరేంద్ర సింగ్ భాటి అసెంబ్లీలో జోషీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
చున్రీ మహోత్సవ్ సతీ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తోందని అప్పట్లో అనేక మహిళా సంఘాలు మండిపడ్డాయి, నిరసనలు తెలిపాయి.
నిషేధం ఉన్నా చున్రీ వేడుక:
చున్రీ వేడుకను నిలిపివేయాలంటూ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అప్పటి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మకు లేఖ రాశారు.
లేఖను విచారణకు స్వీకరించిన జస్టిస్ వర్మ సెప్టెంబర్ 15న వేడుకను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. చున్రీ మహోత్సవాన్ని సతీ సంప్రదాయాన్ని ప్రోత్సహించేదిగా భావించిన హైకోర్టు.. ఈ వేడుకను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, సెప్టెంబర్ 15 రాత్రి నుంచి దివరాల గ్రామంలో ప్రజలు గుమిగూడారు. చున్రీ మహోత్సవానికి ఊరి బయటి నుంచి కూడా వేలాదిగా తరలివచ్చారు.
‘రూప్‌కవర్ సతీ ఘటన’ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చింది, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి హరిదేవ్ జోషీ, హోంమంత్రి గులాబ్ సింగ్ శక్తావత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1987 అక్టోబరు 1న రాష్ట్ర ప్రభుత్వం సతీ, దాని వేడుకను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం గ్రామంలో అంతా శాంతియుతంగా ఉందని అప్పట్లో సైన్యంలో పనిచేసి ప్రస్తుతం గ్రామాధికారిగా ఉన్న పంచ్ మాంగూ సింగ్ షెకావత్ అన్నారు. అయితే గ్రామపెద్దలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ‘రూప్‌కవర్ సతీ’ ఘటనపై మాట్లాడేందుకు విముఖత చూపుతున్నారు.
ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఓ వృద్ధుడు స్పందిస్తూ "18 ఏళ్ల రూప్‌కవర్ భర్తకు అంత్యక్రియలు చేసిన చితిపైనే దహనమవడం చాలా భయంకరంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూడాలనే ఉత్సుకతతో ఆ రోజు దూర ప్రాంతాల నుంచి చాలామంది మా గ్రామానికి వచ్చారు" అని అన్నారు.
ప్రజలు కొందరు ‘సతీ’ ఘటనపై భిన్న వాదనలు చేశారు. రూప్‌కవర్ స్వచ్ఛందంగా ఈ పని చేశారని కూడా ప్రజలు పేర్కొన్నారు.
రూప్‌కవర్ ఎవరు?
రూప్‌కవర్ సతీని స్వచ్ఛందంగా స్వీకరించారని చాలావరకు మీడియా, పోలీసు రిపోర్టులూ చెప్పాయి. చనిపోవడానికి ఏడు నెలల క్రితమే ఆమెకు మల్ సింగ్‌తో వివాహమైంది.
మల్ సింగ్ బీఎస్‌సీ విద్యార్థి, దివరాలలో తన కుటుంబంతో ఉండేవారు. రూప్‌కవర్ మామగారు ఉపాధ్యాయుడు.
రూప్‌కవర్ నిరక్షరాస్యురాలేం కాదు. ఆమె జైపూర్‌లో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. ఆమె ఏ విధంగానూ సనాతన వాదిగా కనిపించలేదు, ఆమె అలాంటి పని చేస్తారని ఎవరూ ఊహించలేదు కూడా.
రూప్‌కవర్ తన వివాహ ఫోటోలలోనూ ముసుగు లేకుండా (అప్పటి సంప్రదాయానికి భిన్నంగా) కనిపించారు. అయితే, ఆమె ప్రతిరోజూ నాలుగు గంటల పాటు సతీదేవిని పూజిస్తుందని గ్రామస్తుల నమ్మకం. ఆమె గీత, హనుమాన్ చాలీసాలను పఠించారు, మంత్రాలు పఠించారు. సంతోషంగా సతీని పాటించారని చెబుతున్నారు.
'స్తంభించిన రాష్ట్రం':
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అప్పటి పోలీసు అధికారి స్పందిస్తూ "సెప్టెంబర్ 4 నుంచి 16 తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోయినట్లు అనిపించింది. చున్రీ మహోత్సవం రోజు వరకు, హోం మంత్రి గులాబ్ సింగ్ శక్తావత్ దానిని మతపరమైన అంశంగా పిలిచారు, పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు వచ్చాయి" అన్నారు.
రూప్‌కవర్ తండ్రి బాల్ సింగ్ రాథోడ్ కూడా చున్రీ మహోత్సవ్‌లో పాల్గొన్నారు. ఆ రోజు దేశం నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల మంది సతీ స్థలానికి వచ్చారు. చున్రీ వేడుక నిర్వహించే సమయానికి దాదాపు ఐదు లక్షల మంది వచ్చారు.
రూప్‌కవర్ మామ సుమేర్ సింగ్, ఆయన సోదరుడు మంగేష్ సింగ్‌తో పాటు కుటుంబంలోని పురుషులకు గుండుచేసిన బన్సిధర్, అంత్యక్రియలు నిర్వహించిన బాబూలాల్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వారందరినీ విడుదల చేశారు. నిందితులను దోషులుగా నిరూపించేందుకు ప్రభుత్వం కోర్టులో గట్టి ప్రయత్నం చేయలేకపోయింది.