How often should you change your pillow covers?
మీ తల దిండ్ల కవర్లను ఎంత తరచుగా మార్చాలి?
రోజంతా పని చేసి అలసిపోయాక, మెత్తని పరుపు మీద పడుకుని, మెత్తటి దిండు మీద తల పెట్టి విశ్రాంతి తీసుకుంటే.. అంతకు మించిన హాయి మరొకటి ఉండదు. కానీ, వాటి కింద చూస్తే కోట్లాది బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు, ఇతర క్రిములు కనిపించొచ్చు. అవి మీ పడకే తమ ‘స్వర్గం’ అనుకుంటాయి.
చెమట, లాలాజలం, డెడ్ స్కిన్ సెల్స్‌తో నిండిన పరుపులు, దుప్పట్లు, దిండ్లు సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందడానికి చాలా అనువైన ప్రదేశాలు.
ఉదాహరణకు దుమ్ము పురుగు(డస్ట్ మైట్)లను తీసుకోండి. రోజూ 50 కోట్ల చర్మ కణాలు మన శరీరం నుంచి ఊడిపోతాయి. డస్ట్ మైట్‌లకు ఇది విందు భోజనం లాంటిది. ఆ పురుగుల కారణంగా, వాటి విసర్జితాల కారణంగా మనకు అలర్జీ, ఉబ్బసం, ఎగ్జిమా లాంటి సమస్యలు రావచ్చు.
బెడ్‌షీట్‌లు కూడా బ్యాక్టీరియాకు మంచి ఆశ్రయాలు. ఉదాహరణకు, 2013లో, ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ డి లిల్లే పరిశోధకులు హాస్పిటల్‌లోని పేషెంట్‌ల బెడ్‌షీట్లను పరిశీలించి, అవి స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాతో నిండి ఉన్నాయని కనుగొన్నారు. ఇది సాధారణంగా మానవ చర్మంపై కనిపించే బ్యాక్టీరియా.
చాలా స్టెఫిలోకాకస్ జాతులు పెద్దగా హాని కలిగించేవి కాకపోయినా, ఎస్. ఆరియస్ వంటి కొన్ని మాత్రం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన రోగులలో చర్మ వ్యాధులు, మొటిమలు, న్యుమోనియాకు కారణమవుతాయి.
‘‘బ్యాక్టీరియా అనేది ప్రజల స్కిన్ మైక్రోబయోమ్‌లో భాగంగా ఉంటుంది. ఇవి పెద్ద సంఖ్యలో చర్మం నుంచి పడిపోతుంటాయి’’ అని యూకేలోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మైక్రోబయాలజిస్ట్ మనల్ మహమ్మద్ చెప్పారు.
‘‘ఈ బ్యాక్టీరియా ప్రమాదకరం కానప్పటికీ, ఇవి బయటి గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి’’ అని మహమ్మద్ చెప్పారు.
ఆసుపత్రులలో పరిశుభ్రతను తీవ్రంగా పరిగణించి, రోగుల బెడ్‌షీట్‌లు, దిండు కవర్లను తరచుగా మారుస్తారు కాబట్టి ఇక్కడ చాలా డేటా లభిస్తుంది. 2018లో, నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇబాడాన్ శాస్త్రవేత్తలు ఉతకని హాస్పిటల్ బెడ్‌షీట్లలో మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, డయేరియా, మెనింజైటిస్, సెప్సిస్‌లకు కారణమయ్యే ఇతర వ్యాధికారక బ్యాక్టీరియాతో పాటు ఈ. కొలిని కనుగొన్నారు.
2022లో మంకీపాక్స్‌తో (ఎంపాక్స్) ఆసుపత్రిలో చేరిన రోగుల గదుల నుంచి నమూనాలను పరిశోధకులు సేకరించారు. బెడ్‌షీట్లను మార్చే క్రమంలో గాలిలోకి వైరస్ కణాలు విడుదల అవుతున్నట్లు వారు గుర్తించారు.
2018లో ఒక ఎంపాక్స్ రోగి పరుపును మార్చే క్రమంలో, ఒక యూకే హెల్త్‌కేర్ వర్కర్ ఆ వైరస్ కారణంగా ఆ వ్యాధి బారిన పడినట్లు భావిస్తున్నారు.
‘‘ఆసుపత్రులలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బెడ్‌షీట్లను ఉతుకుతారు. దీని వల్ల చాలా బ్యాక్టీరియా నశిస్తుంది’’ అని యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్ చెప్పారు.
సి. డిఫిసిల్.. ఇది అతిసారం కలిగించే బాక్టీరియా. దీని ప్రభావం ముఖ్యంగా వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. బెడ్‌షీట్లను ఉతకడం వల్ల సి.డిఫిసిల్ బ్యాక్టీరియా సగం వరకు నాశనం అవుతుందని డెన్నింగ్ చెప్పారు.
యూకేలో సి. డిఫిసిల్ ఇన్‌ఫెక్షన్ రేట్లు తగ్గాయి. ప్రామాణిక లాండ్రీ విధానాలను అనుసరించినంత కాలం, ట్రాన్స్‌మిషన్ రిస్క్‌ను తగ్గిస్తాయని ఇది సూచిస్తోంది.
ఆరోగ్యవంతుల బెడ్‌షీట్ల కన్నా, అనారోగ్యంతో ఉన్నవారి బెడ్‌షీట్లలో వ్యాధికారక బాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి, మన ఇళ్లలోని బెడ్‌షీట్లు, దిండు కవర్ల సంగతేంటి?
2013లో, అమెరికన్ బెడ్ కంపెనీ అమెరిస్లీప్, ఒక వారం పాటు ఉతకని దిండు కవర్లపై నుంచి నమూనాలను సేకరించగా, వాటిపై చదరపు అంగుళానికి 30 లక్షల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఇది సగటు టాయిలెట్ సీటు మీద ఉండే దానికంటే 17,000 రెట్లు ఎక్కువ.
2006లో డెన్నింగ్, ఆయన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి రోజూ ఉపయోగించే ఆరు దిండ్లను సేకరించారు. అవి 18 నెలల నుంచి 20 సంవత్సరాల పాటు ఉపయోగించినవి.
ఈ దిండ్లు అన్నింటిలో ఫంగస్ కనిపించింది. సంఖ్యాపరంగా, ప్రతి దిండులో కోట్ల ఫంగల్ కణాలు ఉండొచ్చని డెన్నింగ్ చెప్పారు.
‘‘రాత్రిపూట మన తలలోంచి చెమట కారడం వల్ల ఈ ఫంగస్ దిండులో చేరుతుందని మేము భావిస్తున్నాం. మనందరి పడకలలో దుమ్ము పురుగులు ఉంటాయి. ఈ దుమ్ము పురుగుల విసర్జితాలే ఫంగస్‌కు ఆహారం. మీరు తల పెట్టుకోవడం వల్ల ఆ దిండు వెచ్చగా ఉంటుంది. దాంతో, అందులో తేమ ఉంటుంది, ఆహారం ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది.. కాబట్టి అవి బాగా వృద్ధి చెందుతాయి’’ అని డెన్నింగ్ వివరించారు.
మనం దిండ్లను చాలా అరుదుగా ఉతుకుతాం కాబట్టి, ఫంగస్ ఎలాంటి సమస్యా లేకుండా సంవత్సరాల తరబడి జీవిస్తుంది. మనం వాటిని ఉతికినా, ఫంగస్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుంది. అదీ కాకుండా దిండ్లను ఉతకడం వల్ల అవి మరింత తేమగా మారి, తద్వారా ఫంగస్ మరింత పెరగడానికి వీలు కల్పిస్తుంది.
మనుషులు నిద్రపోయే సమయంలో నోటికి, దిండుకు మధ్య ఉన్న సామీప్యత కారణంగా, శ్వాసకోశ వ్యాధి ఉన్న రోగులకు, ముఖ్యంగా ఆస్తమా, సైనసిటిస్‌ల ఉన్నవాళ్లకు ఇది చాలా సమస్యలు సృష్టిస్తుంది. తీవ్రమైన ఉబ్బసం ఉన్నవాళ్లలో సగం మంది వరకు ఆస్పర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్‌కు అలర్జీ కలిగి ఉంటారు.
ఈ ఫంగస్‌కు గురికావడం వల్ల గతంలో టీబీ లేదా ధూమపాన సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడవచ్చు.
‘‘లుకేమియా ఉన్న వ్యక్తులు, లేదా అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులు లేదా కోవిడ్ లేదా ఇన్‌ఫ్లూయెంజాతో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవాళ్లకు ఇన్వేసివ్ ఆస్పెర్‌గిలోసిస్ రావచ్చు. అంటే ఫంగస్ మీ ఊపిరితిత్తులలోకి వెళ్లి అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అది ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేస్తుంది’’ అని డెన్నింగ్ చెప్పారు.
మరి, దిండ్లు ఉతికినా క్రిములు నశించకపోతే ఏం చేయాలి?
ఆస్తమా లేదా ఊపిరితిత్తుల సమస్యలు లేదా సైనస్ వ్యాధి ఉన్న వ్యక్తులు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు కొత్త దిండ్లను ఉపయోగించాలని డెన్నింగ్ సూచిస్తున్నారు.
ఇక బెడ్‌షీట్లను ఎంత తరచుగా ఉతకాలి అనే విషయానికి వస్తే, చాలా మంది నిపుణులు వారానికోసారి అలా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. బెడ్‌షీట్లను ఉతికి, ఇస్త్రీ చేయడం కూడా వాటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
‘‘అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల విషయంలో ఇది చాలా ముఖ్యం. పరుపును తడిపే అలవాటున్న పిల్లలుంటే, వాటిని ఉతకడం, ఇస్త్రీ చేయడం లాంటివి చేయాలి’’ అని డెన్నింగ్ చెప్పారు.
బెడ్‌పై పెంపుడు జంతువులు నిద్రించడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది. అలాగే మురికి సాక్స్‌లతో పడుకోవడం లేదా చర్మంపై మేకప్ లేదా లోషన్‌లతో నిద్రపోవడం, పరుపు మీద తినడం వంటివి చేయకపోవడం మంచిది.