Why Hackypicky Hair Oil is so popular and how is it made?

 Why Hackypicky Hair Oil is so popular and how is it made?

Why Hackypicky Hair Oil is so popular and how is it made?

హక్కీపిక్కీ హెయిర్ ఆయిల్‌కు ఇంత ప్రచారం ఎందుకు, దీన్ని ఎలా తయారు చేస్తారు?

ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నిలబడి ఉంటారు.

ఇద్దరూ తలను కాస్త పక్కకు వంచి, నడుము కింద వరకు జుట్టును వదిలేసి ఉంటారు. వారి చేతిలో కొన్ని బాటిళ్లు ఉంటాయి. అందులో కాస్త నల్లగా కనిపించే ఆయిల్ ఉంటుంది.

ఇలాంటి చిత్రాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, ఈ-కామర్స్‌ సైట్లలో పెద్దఎత్తున కనిపిస్తున్నాయి.

ఈ-కామర్స్‌ సైట్లలోకి వెళ్లి ఆయుర్వేద హెయిర్ ఆయిల్ అని కొట్టగానే ఇలాంటి చిత్రం ముద్రించి ఉన్న బాటిళ్లు చాలా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఈ ఆయిల్ గురించి ఎన్నో విశ్లేషణలు, రివ్యూలు కనిపిస్తాయి. బాలీవుడు నటులు, డైరెక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లు… ఇలా ఆ ఆయిల్ చుట్టూ ‘గ్లామర్’, ‘క్రేజ్’ అల్లుకొని కనిపిస్తుంటుంది.

ఇదే హక్కీపిక్కీ హెయిర్ ఆయిల్.

హక్కీపిక్కీ తెగవారు తయారు చేసే హెయిర్ ఆయిల్ ఇది. వందకు పైగా వనమూలికలతో ఈ హెయిర్ ఆయిల్‌ను తయారు చేస్తామని ఆ తెగవారు చెబుతోంటే, అడవుల నుంచి వారు ఏ మూలికలూ తీసుకెళ్లడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

అసలు హక్కీపిక్కీ ఆయిల్ ఎలా తయారు చేస్తారో, ఆ ఆయిల్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

హక్కీపిక్కీలు ఎవరు?

ఈ హక్కీపిక్కీ అనేది ఆదివాసీ తెగ. ఈ తెగవారు కర్ణాటకలోని శివమొగ్గ, హాసన్, మాండ్యా, మైసూరు జిల్లాల్లో ప్రధానంగా కనిపిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, వీరి జనాభా సుమారు 12,000.

కన్నడ భాషలో హక్కీపిక్కీలు అంటే పక్షులను వేటాడే వారు అని అర్థం.

‘‘హక్కీపిక్కీలకు గుజరాత్ మూలాలు ఉన్నాయి. రాణా ప్రతాప్ సింగ్ దగ్గర వాళ్లు ఉండేవాళ్లని, యుద్ధాలు, కరవు వంటి కారణాలతో వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లారని చరిత్ర చెబుతోంది. ఆంధ్రా, తమిళనాడుకు కూడా వారు వలస వెళ్లారు’’ అని కర్ణాటక ఆదివాసీ రక్షణ పరిషత్ రాజ్య అధ్యక్షుడు ఎం.కృష్ణయ్య బీబీసీతో చెప్పారు.

ఈ తెగలో కొత్త తరం ఇప్పుడిప్పుడే చదువుకోడానికి ముందుకు వస్తోందని ఆయన తెలిపారు.

‘‘వాగరీ అనే భాషను వాళ్లు మాట్లాడతారు. ఆ భాష మూలాలు గుజరాతీలో కనబడతాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ మైసూరుకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ డీసీ. నంజుండ అన్నారు.

హెయిర్ ఆయిల్ చరిత్ర ఏంటి?

హక్కీపిక్కీలకు ఒకనాడు పక్షుల వేట ప్రధాన జీవనోపాధిగా ఉండేది. ఆ తరువాత వేటను నిషేధించడంతో సంప్రదాయంగా తయారు చేస్తూ వస్తున్న హెయిర్ ఆయిల్‌ను ఉపాధి వనరుగా మార్చుకున్నట్టు ఆ తెగ వారు చెబుతున్నారు.

ఈ హెయిర్ ఆయిల్‌ను తరాలుగా తయారు చేస్తూ వస్తున్నట్టు పక్షిరాజపురలోని హక్కీపిక్కీ తెగకు చెందిన సుదీష్ కర్కే బీబీసీతో చెప్పారు.

‘‘మైసూరు మహారాజుల కాలం నుంచే వనమూలికలతో ఈ నూనెను తయారు చేస్తున్నట్లు మా పెద్దలు చెప్పేవాళ్లు. మా తాతముత్తాతల నుంచి తయారీ విధానం నేర్చుకున్నాం’’ అని ఆయన తెలిపారు.

60, 70ల నుంచి హెయిర్ ఆయిల్‌ను అమ్మడం ప్రారంభించామని సుదీష్ కర్కే చెప్పారు.

‘‘మొదట్లో కొద్దికొద్దిగా తయారు చేసి ఊర్లు తిరుగుతూ అమ్ముకునే వాళ్లు. మా నూనె వాడితే జుట్టు రాలదని, పొడవు పెరుగుతుందని చెప్పే వాళ్లం. నూనెలు ఇచ్చి తినడానికి ఏమైనా పెట్టమని అడిగేవాళ్లం. అంతేకానీ నాడు డబ్బులు పెద్దగా వచ్చేవి కావు’’ అని కర్కే తెలిపారు.

ఆ తరువాత విదేశాలకు వెళ్లి అమ్మడం ప్రారంభించామన్నారు.

‘‘ఆయుర్వేద ఉత్పత్తులను అమ్ముకునేందుకు వారు సూడాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్తారు’’ అని డాక్టర్ నంజుండ అన్నారు.

ఎలా తయారు చేస్తారు?

వందకు పైగా వనమూలికలతో ఈ హెయిర్ ఆయిల్‌ను తయారు చేస్తామని సుదీష్ కర్కే తెలిపారు. అయితే మూలికల పేర్లు, తయారీ విధానం గురించి పూర్తి వివరాలు బయటకు చెప్పబోమని ఆయన అన్నారు.

‘‘10 పేర్లు మాత్రమే చెబుతాం. మిగతా పేర్లు తెలిసినా అందరికీ చెప్పం. చెబితే మిగతా వారు కూడా దాన్ని తయారు చేస్తారు. శీకాయ, ఆరేట, ఉసిరి, కలబంద, త్రిముఖి, తులసి, బ్రహ్మీ, వేప, కుంకుడుకాయ, బృంగరాజ్, మందారం పువ్వు, తంగేడు పువ్వు.. ఇలా చాలా ఉంటాయి’’ అని కర్కే వివరించారు.

‘‘కొబ్బరి నూనెలో రెండు రకాల నూనెలు కలుపుతాం. వారం రోజులు ఎండలో ఎండబెట్టిన వనమూలికలను ఆ నూనెలో వేసి 24 గంటలు వేడి చేస్తాం. మంట చిన్నగా ఉండాలి. వేడి ఎక్కువ అయితే వనమూలికల ప్రభావం తగ్గిపోతుంది’’ అని తయారీదారు అభిలాష జైకుమార్ బీబీసీకి వివరించారు.

తమ హెయిర్ ఆయిల్ వల్ల బట్టతల మీద జుట్టు రాదని, జుట్టు ఉన్న వారికి ఒత్తుగా పెరుగుతుందని మాత్రమే చెబుతామని అభిలాష జైకుమార్ అన్నారు. తమ ఆయిల్ వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని వారు చెబుతున్నారు.

అయితే, ఈ ఆయిల్ గురించి తయారీదారులు ఇన్ని విషయాలు చెబుతున్నప్పటికీ, దాని పనితీరుకు సంబంధించిన శాస్త్రీయ డేటా మాత్రం వారు ఏమీ చూపించలేదు.

ఆ ఆయిల్ ప్రభావం గురించి చెప్పగల సైంటిఫిక్ డేటా వారి వద్ద లేదని తిరుపతికి చెందిన కాస్మొటాలజిస్ట్ డాక్టర్ జితేంద్ర బీబీసీతో అన్నారు.

‘‘మూలికలను ఎంత మోతాదులో కలిపారు అనేదాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. ప్రభావం ఎలాంటిదైనా కావొచ్చు కానీ అది నిరూపించే సైంటిఫిక్ డేటా కావాలి. అటువంటి డేటాను వాళ్లు చూపించడం లేదు. ఒక వస్తువును వాడేటప్పుడు దానిలోని మంచిచెడులను వినియోగదారులు తెలుసుకోవాలి’’ అని డాక్టర్ జితేంద్ర అన్నారు.

ఇటీవల కాలంలో పెరిగిన మార్కెట్:

స్థానికులు చెబుతున్న దాని ప్రకారం సుమారు వెయ్యి కుటుంబాలకు ఆయిల్ తయారీనే జీవనాధారం. అయితే ఎంతో కాలం నుంచి ఈ ఆయిల్‌ను అమ్ముతున్నా గత కొన్ని సంవత్సరాలుగా తమ మార్కెట్ బాగా పెరిగినట్టు వారు చెబుతున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఆర్డర్లు పెరిగాయని తెలిపారు.

2023లో సూడాన్ అంతర్యుద్ధంలో సుమారు 100 మంది హక్కీపిక్కీ తెగవాళ్లు అక్కడ చిక్కుకుపోయారు. తర్వాత వారిని క్షేమంగా భారత్‌కు తరలించారు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వారిని కలిశారు. దీంతో వారి గురించి దేశమంతా తెలిసింది.

‘‘ప్రధాని మమ్మల్ని కలిసినప్పుడు సుడాన్ ఎందుకు వెళ్లారని అడిగారు. అక్కడ ఆయిల్ అమ్ముకోవడానికి వెళ్లామని చెబితే ఆయన మెచ్చుకున్నారు’’ అని శివమొగ్గకు చెందిన రాజేశ్వరి బీబీసీతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వారిలో రాజేశ్వరి కూడా ఒకరు.

ఆ తరువాత సినిమా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వంటి వారి వల్ల హక్కీపిక్కీ హెయిర్ ఆయిల్ మరింత పాపులర్ అయింది. అర లీటర్ హెయిర్ ఆయిల్‌ను 1,500 రూపాయలకు అమ్ముతున్నారు.

ప్రస్తుతం మైసూరు జిల్లాలోని హున్సూరు సమీపంలోని చాలా గ్రామాల్లో ఆదివాసీలకు ఇదే ప్రధానవృత్తిగా ఉంది. హున్సూర్ నుంచి గురుపుర వెళ్లేదారిలో పక్షిరాజపుర-1, పక్షిరాజపుర-2 వంటి గ్రామాల్లో ఆయిల్ తయారు చేసే కుటుంబాలున్నాయి. శివమొగ్గ జిల్లాలోనూ హెయిర్ ఆయిల్ తయారు చేసే మరికొన్ని గ్రామాలు ఉన్నాయి.

ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచారం:

హక్కీపిక్కీ తెగ వారు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌లోనూ ముందున్నారు.

చాలా మంది సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇచ్చి తమ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయిస్తున్నారుని స్థానికులు చెబుతున్నారు. ఆయిల్ అమ్మే కుటుంబాలు ఎక్కువగా ఉండటం వల్ల పోటీతో ఇలా చేస్తున్నారని తెలిపారు.

‘‘ప్రమోషన్ కోసం కొందరికి డబ్బులు ఇస్తారు. మరికొందరు ఉచితంగానే ప్రమోట్ చేస్తారు’’ అని ఎం.కృష్ణయ్య అన్నారు.

సోనూ సూద్, ఫరా ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు వీరి దగ్గరకు రావడం వల్ల కూడా పాపులారిటీ వస్తోంది. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఫొటోలు దిగి, వాటిని ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు.

‘‘సోను సూద్, గ్రేట్ ఖలీ వంటి వారు మా వద్దకు వచ్చారు. వాళ్లు మా వద్దకు వస్తేనే జరగాల్సిన ప్రమోషన్ జరిగిపోతుంది. కాబట్టి సెలబ్రిటీల కోసం మేం పెద్దగా ఖర్చు పెట్టం’’ అని అని సుదీష్ కర్కే అన్నారు.

ఇలాంటి ప్రమోషన్ల వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ నూనె కోసమే బిహార్ నుంచి కర్ణాటక వచ్చిన రంజిత్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే నకిలీ ఆయిల్ వచ్చింది. ఒరిజినల్ కోసం ఇక్కడకు వచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో సోను సూద్ ఇక్కడికి వచ్చినట్లు వీడియో ఉంది. చాలామంది సెలబ్రిటీలు వచ్చినట్టు తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ నూనె మంచిదే దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను’’ అని రంజిత్ అన్నారు.

ఖరీదైన కార్లు, డూప్లెక్స్ ఇళ్లు:

ప్రస్తుతం వ్యాపారం బాగా ఉందని ఎం.కృష్ణయ్య చెబుతున్నారు. నెలకు సుమారు 2-3 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరుగుతూ ఉండొచ్చని తెలిపారు.

హక్కీపిక్కీ ఆదివాసీల్లో చదువుకున్న వారు పెద్దగా లేకపోవడం వల్ల కంప్యూటర్ ఆపరేటర్లు, టెలీకాలర్ల కోసం ఇతర వ్యక్తులను నియమించుకుంటున్నారు.

‘‘ఫోన్ కాల్స్ మాట్లాడం నా పని. నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తారు’’అని గౌరీ బిద్దనూరుకు చెందిన తరు బీబీసీతో చెప్పారు.

హక్కీపిక్కీలలో చదువుకున్న కొత్త తరం కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. అలాంటి వారిలో ఇంజినీరింగ్ చదివిన శాంతికుమార్ ఒకరు.

‘‘బెంగళూరులో మూడేళ్లు ఉద్యోగం చేశా. జీతం సరిపోక జాబ్ వదిలేసి మా సొంత హెయిర్ ఆయిల్ బిజినెస్‌ను చూసుకుంటున్నా’’ అని శాంతి కుమార్ తెలిపారు.

హక్కీపిక్కీలు ఉండే గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆర్థికంగా ఆ కమ్యూనిటీలో వచ్చిన మార్పు కనిపించింది. ఈ ఆదివాసీల్లో చాలా మంది డూప్లెక్స్ ఇళ్లు కట్టుకొన్నారు.

హెయిర్ ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన సంపద వారి జీవనశైలిని మారుస్తోంది. ఖరీదైన కార్లలో వారు తిరుగుతూ కనిపిస్తున్నారు. వివాహాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.

గుర్తింపు పత్రాలివ్వాలని కోరుతున్న హక్కీపిక్కీలు

‘‘మాకు సంబంధం లేదు’’:

అడవుల నుంచి వనమూలికలు తీసుకొస్తామని ఆయిల్ తయారు చేసే వారు చెబుతుంటే మరోవైపు కర్ణాటక అటవీశాఖ అధికారులు మాత్రం ఆ మాటలు తోసిపుచ్చుతున్నారు.

‘‘అడవుల నుంచి వారు ఏ మూలికలూ తీసుకెళ్లడం లేదు. అందుకు మా నుంచి ఎటువంటి అనుమతులు లేవు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా షాపులు వెలిశాయి. ఆ ఆయిల్ గురించి మాకు తెలియదు’’ అని మైసూర్ డీసీఎఫ్‌ఓ సీమ బీబీసీతో అన్నారు.

కర్ణాటక గిరిజనశాఖ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా బీబీసీకి దాదాపు ఇలాంటి సమాధానమే వచ్చింది.

‘‘హక్కీపిక్కీలకు మేం ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. వారు తయారు చేసే హెయిర్ ఆయిల్ గురించి మా వద్ద ఎటువంటి డేటా లేదు’’ అని ఒక గంగాధర్ అనే అధికారి తెలిపారు.

ప్రభుత్వం అవగాహన కల్పించి తగిన గుర్తింపు పత్రాలను ఇవ్వాలని ఎం.కృష్ణయ్య కోరుతున్నారు.

‘‘వనమూలికల కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. క్రమబద్ధంగా లైసెన్సులు జారీ చేయాలి. ఆయుష్ డిపార్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి’’ అని ఆయన కోరారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.