Conductor ticketed for Parrots, what are the rules for traveling with pets in buses, trains and planes?
రామ చిలుకలకు టికెట్ కొట్టిన కండక్టర్,
బస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలేంటి?
కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ బామ్మ నాలుగుచిలుకలతో బస్సు ఎక్కగా, కండక్టర్ ఆ చిలుకలకు 444 రూపాయలను టిక్కెట్ రూపంలో వసూలు చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.
అధికారుల కథనం మేరకు ఈ బామ్మ బుధవారం ఉదయం 8గంటలకు తన మనవారిలితో కలిసి మైసూరుకు బయల్దేరారు. అయితే బామ్మకు, మనవరాలికి ఉచిత టిక్కెట్లు ఇచ్చిన కండక్టర్ చిలుకలకు ఒక్కో చిలుకకు రూ.111 చొప్పున నాలుగు చిలుకలకు రూ. 444 వసూలు చేశారు.
బస్సులో చిలుకలను తీసుకెళ్లడానికి అనుమతించడమే కాక, వాటికి రూ. 444 టిక్కెట్ వసూలు చేయడం నెటిజన్లను ఆకర్షించింది. చిలుకలకు టిక్కెట్ కొట్టడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కేఎస్ఆర్టీసీ నిబంధనల మేరకు పెంపుడు జంతువులకు, పక్షులకు టిక్కెట్ తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
‘హాన్స్ ఇండియా’ పత్రిక ప్రచురించిన కథనం మేరకు బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్ళేందుకు ఓ మహిళ తన మనవరాలితో బయల్దేరారు. ఆమె తనతోపాటు నాలుగు చిలుకలను పంజరంలో పెట్టుకుని బస్సెక్కారు. ఆ పంజరాన్ని సీటుపై తనకు, మనవరాలికి మధ్యన పెట్టారు. ఈ చిలుకలను చూసి సరదా పడిన సహప్రయాణికులు తమ కెమెరాలలో బంధించారు.
అయితే కండక్టర్ మాత్రం ఈ బామ్మ, మనవరాలికి శక్తి యోజన కింద ఉచిత టిక్కెట్ ఇచ్చారు. కానీ చిలుకలకు మాత్రం 'చిల్డ్రన్' కోటాలో, ఒక్కో దానికి 111 రూపాయల చొప్పున హాఫ్ టిక్కెట్ కొట్టారు. ఇలా మొత్తం 4 చిలుకలకు 444 రూపాయల టిక్కెట్లు కొట్టి, ఆ మొత్తాన్ని సదరు మహిళ నుంచి వసూలు చేశారు.
కేఎస్ఆర్టీసీ నిబంధనల మేరకు ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులు, లేదా పక్షులను తీసుకువచ్చినప్పుడు హాఫ్ టిక్కెట్ తీసుకోవాలి. లేదంటే వారి టిక్కెట్ మొత్తంపైన పదిశాతం జరిమానా విధిస్తారు. ఒకవేళ కండక్టర్ టిక్కెట్ జారీ చేయకపోతే, కేఎస్‌ఆర్టీసీ నిధుల దుర్వినియోగం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి, కండక్టర్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్టు హాన్స్ ఇండియా కథనం పేర్కొంది.
గతంలో సస్పెన్షన్ ఎదుర్కొన్న కండక్టర్:
కేఎస్‌ఆర్టీసీ బస్సులో గతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కానీ కండక్టర్ టిక్కెట్ కొట్టకపోవడం వల్ల ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బీదర్ జిల్లాలోని ఔరద్‌కు బయల్దేరిన బస్సులో ఓ ప్రయాణికుడు తనతోపాటు చిలుకలను కూడా తీసుకువచ్చారు. నిబంధనలమేరకు చిలుకలకు కూడా హాఫ్ టిక్కెట్ తీసుకోవాలని కండక్టర్ కోరారు.
కానీ చిలుకలకు టిక్కెట్ తీసుకోవడానికి ప్రయాణికుడు నిరాకరించారు. ఆయనకు సహప్రయాణికులు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో కండక్టర్ నిస్సహాయస్థితిలో పడిపోయి టిక్కెట్ కొట్టలేకపోయారు. అయితే మార్గ మధ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీల కోసం బస్సు ఎక్కారు. చిలుకకు టిక్కెట్ కొట్టలేదనే విషయాన్ని గ్రహించి దీనిపై అధికారులకు నివేదిక పంపారు. తరువాత కేఎస్‌ఆర్టీసీ అధికారులు కండక్టర్‌ను సస్పెండ్ చేశారు.
తెలంగాణలోనూ...గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంత మంది ప్రయాణీకులు తమ పెంపుడు జంతువులు, కోళ్లు, మేకలతో సైతం బస్ ఎక్కుతూ ఉంటారు. కొన్ని సార్లు బస్సుపైన కోళ్ళను బుట్టల్లో పెట్టి, తాళ్లతో కట్టి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలు నగరాల్లో కనిపించకపోవచ్చు కానీ, గ్రామాల్లో, పల్లెల్లో సర్వ సాధారణం.
2022లో తెలంగాణలోని సుల్తానాబాద్ లో ఒక ప్రయాణీకుడు తన కోడితో పాటు ప్రయాణిస్తుండటంతో బస్సు కండక్టర్ ఆ కోడికి కూడా టికెట్ కొనమన్నారు. ఈ విషయం వార్తగా మారింది. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళుతున్న బస్సులో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తాపత్రికలు పేర్కొన్నాయి.
అయితే కోళ్లు, మేకలు లాంటి పెంపుడు జంతువులను ప్రజా రవాణా మార్గాల ద్వారా తీసుకుని వెళ్లవచ్చా? అలా తీసుకుని వెళుతున్నప్పుడు వాటికి కూడా టికెట్ కొనాల్సిన అవసరం ఉంటుందా?
పెంపుడు జంతువుల ప్రయాణానికి నిబంధనలు..:
తెలంగాణలో కోళ్లు, మేకలు లాంటి పశువులను బస్సులలో తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటి గురించి ప్రత్యేక నిబంధనలేమి రాతపూర్వకంగా పొందుపరిచి లేవు.
అయితే, రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకుని వెళ్ళవచ్చు. కానీ, వాటికి కొన్ని నిబంధనలున్నాయి.
ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఆ వివరాలతో ట్రైన్ ఎక్కే స్టేషన్ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ కు ఒక దరఖాస్తు చేయాలి.
పెంపుడు జంతువుకు అవసరమైన అన్ని టీకాలను వేయించి సదరు సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి.
ప్రయాణానికి 24-48 గంటల ముందు మీ పెంపుడు జంతువు ప్రయాణానికి అనువుగా, ఆరోగ్యంగా ఉందని నిర్ధరిస్తూ పశువైద్యులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని కూడా చేతిలో ఉంచుకోవాలి.
ప్రయాణానికి నాలుగు గంటల ముందు క్యాబిన్ వివరాలు తెలియచేస్తారు.
అక్కడ నుంచి పార్సెల్ ఆఫీసుకు వెళ్లి టికెట్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని వెళ్ళాలి. అక్కడ పెంపుడు జంతువును పరిశీలించి దాని బరువుకు అనుగుణంగా టికెట్ వసూలు చేస్తారు.
సెకండ్ క్లాస్ లగేజ్ , బ్రేక్ వ్యాన్ లో పెంపుడు జంతువులను తీసుకుని వెళ్లవచ్చని భారతీయ రైల్వే చెబుతోంది.
అయితే, వీటిని ప్రయాణీకులు తమతో పాటు తీసుకుని వెళ్లాలని అనుకుంటే మాత్రం ఫస్ట్ క్లాస్ కూపే మొత్తాన్ని బుక్ చేసుకోవలసి ఉంటుంది. మిగిలిన ఏ తరగతుల్లోనూ వాటిని తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. అలాగే, శతాబ్ది, రాజధాని రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు.
ప్రతీ రైలులో పెంపుడు కుక్కల కోసం ఒక డాగ్ బాక్స్ ఉంటుంది. అయితే, ఒక రైలులో ఒకటే డాగ్ బాక్స్ ఉండటం వల్ల ఒక సారి ఒక పెంపుడు జంతువును మాత్రమే తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
వీటికి ముందుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం లేదు. 20 కంటే ఎక్కువ పెంపుడు జంతువులంటే హార్స్ బాక్సులను ఇస్తారు.
గతంలో విశాఖపట్నానికి చెందిన మనీష్ కుమార్ తన పెంపుడు జంతువును బెంగళూరు నుంచి విశాఖపట్నం తీసుకుని వెళ్లారు.
ఆయన ఫస్ట్ క్లాస్ కూపేను బుక్ చేసుకోలేదు. దాంతో, ఇంజిన్ డ్రైవర్ పక్కనే ఉన్న ఒక బోనులో తన పెంపుడు జంతువును పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.
రైలు ఆగిన ప్రతీ సారీ వెళ్లి తన పెంపుడు జంతువును చూసుకుంటూ ఉండేవాడినని చెప్పారు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం ఎక్కువ సేపు ఆగే స్టేషన్లలో పెంపుడు జంతువుకు ఆహారం ఇచ్చేందుకు, తిప్పేందుకు బోను నుంచి విడుదల చేస్తారని, కానీ, తాను ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం డ్రైవర్ అందుకు అంగీకరించలేదని చెప్పారు.
ఇంజన్ డ్రైవర్ అభిమతానికనుగుణంగా దానిని వదిలిపెడతారా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు. అయితే, ఇంజన్ బోగీలో పెంపుడు జంతువు పక్కనే ఉండి ప్రయాణించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
విమానాల్లో తీసుకుని వెళ్లాలంటే..:
విమానాల్లో పెంపుడు జంతువులను తీసుకుని వెళ్లాలంటే పాటించాల్సిన నిబంధనలు వేరుగా ఉంటాయి.
వీటిని క్యాబిన్ కార్గోతో పాటు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వీటికి అదనపు బ్యాగేజీ తరహాలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది.
గర్భంతో ఉన్న పెంపుడు జంతువులను ప్రయాణానికి అనుమతించరు. పెంపుడు జంతువును పెట్టిన పెట్టెతో కలిపి దాని బరువు 5 కేజీలు మించకూడదు.
వీటిని కూడా క్యాబిన్ బ్యాగేజీ తో పాటు పంపిస్తారు. ప్రయాణీకులతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించరు. వీటికి కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
పెంపుడు జంతువులను తీసుకుని వెళ్లేందుకు ప్రయాణ నిబంధనల కోసం సదరు ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లను చూడాల్సి ఉంటుంది.