Decision on pending DAs of employees.
TG Employees DAs : ఉద్యోగుల పెండింగ్ డీఏలపై నిర్ణయం - సాయంత్రంలోపు ప్రకటన..!
పెండింగ్ డీఏల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ (శుక్రవారం) ప్రభుత్వం నుంచి తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రంలోపు నిర్ణయం ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ప్రకటన కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు పాల్గొన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సుదీర్ఘంగా చర్చలు:
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సుదీర్ఘ సమయం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈ భేటీ మూడు గంటలకుపైగా కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశం అందుకు తొలిమెట్టని చెప్పిన ఆయన… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు.
పెండింగ్ డీఏలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ… ప్రస్తుతంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పుకొచ్చారు.ఆర్థిక పరమైన ఇబ్బందులను ఉద్యోగులకు వివరించారు. కొంత సమయం వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ జేఏసీ నేతలు.. 51 డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ఆర్థికేతర అంశాలన్నీ పరిశీలించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 317 జీవోకి సంబంధించి కూడా నివేదిక అందిందని… కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ భేటీలో పెండింగ్ డీఏల గురించి జేఏసీ ప్రతినిధులు ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. మొత్తం ఐదు పెండింగ్ డీఏలు ఉన్నాయని.. నాలుగైనా క్లియర్ చేయాలని కోరారు. అయితే రెండు పెండింగ్ డీఏలు ఇచ్చేందుకు సర్కార్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది.
సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… ఉద్యోగ సంఘ నేత స్థిత ప్రజ్ఞ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను సవివరంగా వివరించారు. ఇటీవల కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గడ్, జార్ఖండ్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల భవితను భద్రత చేకూర్చాయన్నారు.
పాత పెన్షన్ తో రాష్ట్రానికి ఆర్థిక భారం లేదని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తే ఎల్బీ స్టేడియంలో 2,00,000 కుటుంబాలతో ధన్యవాదాలు తెలియజేస్తామని స్థిత ప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఉండాలని కోరారు.