Details of the new regulations to be implemented in the IPL - 2023 season. and schedules.
IPL 2023 starts from March 31 and ends on May 28. IPL, which has been entertaining for the last fifteen years, will entertain the fans by introducing some new rules this time.
IPL - 2023 సీజన్ లో అమలు కానున్న నూతన నిబంధనలు వాటి వివరాలు. మరియు షెడ్యూలు.
ఐపీఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభమై మే 28 తో ముగుస్తుంది. గత పదిహేనేళ్లుగా అలరిస్తోన్న ఐపీఎల్ ఈసారి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి అభిమానులను అలరించనుంది.
2023 సీజన్ లో అమలు కానున్న నూతన నిబంధనలు వాటి వివరాలు.
1. కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్‌ను జట్లు ఉపయోగించుకోనున్నాయి.
2. టాస్ తర్వాత కెప్టెన్లు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టును ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అంటే ముందుగా బౌలింగ్ చేస్తే ఒకలా.. లేదా బ్యాటింగ్ చేయాల్సి వస్తే మరోలా రెండు టీమ్ షీట్లను కెప్టెన్లు టాస్ కోసం తమతో తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది.
3. నో బాల్స్, వైడ్స్ విషయంలోనూ ఆటగాళ్లు రివ్యూ కోరవచ్చు.
4. ఏ జట్టయినా నిర్ణీత సమయంలోగా పూర్తి కోటా బౌలింగ్ చేయలేకపోతే పెనాల్టీ విధిస్తారు. 30 గజాల వెలుపల ఐదుగురు ఫీల్డర్లకు బదులుగా నలుగుర్ని మాత్రమే ఉండనిస్తారు.
ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు గానీ ఓవర్ ముగిశాక గానీ.. వికెట్ పడిన తర్వాత గానీ.. బ్యాటర్ రిటైరైన తర్వాత గానీ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపొచ్చు. వికెట్ తీసిన తర్వాత బౌలింగ్ జట్టు కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ను పొందొచ్చు. కానీ ఓవర్ మధ్యలో వికెట్ పడితే.. ఆ ఓవర్లో మిగతా బంతుల కోటాను ఇంపాక్ట్ ప్లేయర్ బౌలింగ్ వేయడం సాధ్యపడదు.
ఇన్నాళ్లూ క్రికెట్ లో టాస్ వేసే ముందే రెండు జట్ల కెప్టెన్లు తమ తుది జట్లను ప్రకటించాల్సి ఉండేది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం టాస్ తర్వాతే కెప్టెన్లు తమ తుది జట్లకు సంబంధించిన షీట్లను ప్రత్యర్థి కెప్టెన్, రిఫరీకి అందజేస్తాడు. ఈ ఏడాది తీసుకొచ్చిన కీలక మార్పుల్లో ఇదే ప్రధానమైనది కావడం విశేషం.
తుది జట్టును ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను జట్లు గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లలో ఒకర్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇరు జట్లూ మ్యాచ్‌కు ఒకరు చొప్పున ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడుకోవచ్చు. కానీ తప్పనిసరిగా వాడుకోవాలనే నిబంధనేం లేదు.
ఏ ఆటగాడి స్థానంలోనైనా ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంటే.. ఆ ఆటగాడు అప్పటి నుంచి తిరిగి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కూడా మైదానంలోకి అడుగుపెట్టడం కుదరదు. ఉదాహరణకు X స్థానంలో Yని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటే.. X ఆ మ్యాచ్‌లో ఇక ఆడలేడు.
ఫీల్డింగ్ చేస్తుండగా.. ఎవరైనా ఆటగాడు గాయపడితే.. అతడి స్థానంలో ఫీల్డింగ్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రవేశపెడితే ఆ ఫీల్డర్ మ్యాచ్‌లో ఇక భాగం కాలేడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా భారత ఆటగాణ్ని మాత్రమే ఆడించాలి. ఒక వేళ తుది జట్టులో నలుగురి కంటే తక్కువ మంది విదేశీ ఆటగాళ్లున్న సందర్భంలో మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఫారిన్ క్రికెటర్‌ను ఆడించొచ్చు. ఈ సందర్భంలో కూడా సదరు విదేశీ ఆటగాడు ముందుగా అందజేసిన టీమ్ షీట్ ప్రకారం ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒకడై ఉండాలి.
కేవలం కెప్టెన్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రవేశపెట్టే విషయాన్ని ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్ దృష్టికి తీసుకురాగలడు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రవేశపెట్టాక.. అతడు బ్యాటింగ్ చేయగలడు అలాగే తన కోటా కింద 4 ఓవర్లు బౌలింగ్ చేయగలడు.
ఏ జట్టయినా నిర్ణీత సమయంలోగా పూర్తి కోటా బౌలింగ్ చేయలేకపోతే పెనాల్టీ విధిస్తారు. 30 గజాల వెలుపల ఐదుగురు ఫీల్డర్లకు బదులుగా నలుగుర్ని మాత్రమే ఉండనిస్తారు. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. ఫీల్డర్లు ఎవరైనా అనుచితంగా కదిలితే.. ఫీల్డింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.
ఇక నిర్ణీత సమయంలోపు 20వ ఓవర్ ప్రారంభం కాకపోతే.. ఆ తర్వాత మిగిలిన ఓవర్లు అన్నింటికీ సర్కిల్ బయట నలుగురు కంటే ఎక్కువ మంది ఫీల్డర్లను మోహరించే అవకాశం ఫీల్డింగ్ జట్టుకు ఉండదు. ఈ మార్పులు ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాచ్ ల ఫలితాలన ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.