Telangana Tet 2025 schedule released
తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ విడుదల.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana TET 2025) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచుతారు.
జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఏడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగానే గత ఏడాది డిసెంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.