Telangana Tenth 2025 Results
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - ఈసారి మెమోలు ఎలా ఉంటాయి..? రిజల్ట్స్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను చేపట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు. బుధవారం నుంచి కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇదంతా పూర్తి కావటానికి వారం నుంచి పది రోజుల వరకు సమయం పట్టొచ్చు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.
మెమోలు ఎలా ఉంటాయి..?
ఈ ఏడాదికి సంబంధించిన పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మార్కుల రూపంలోనే టెన్త్ ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.
గతేడాది చివర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం… ఈ ఏడాది(2025) ప్రకటించే ఫలితాల్లో గ్రేడింగ్ విధానం ఉండదు. గతంలో మాదిరిగానే మార్కులను ప్రకటించనున్నారు. ఫలితంగా మెమోలపై స్కోర్ వివరాలు ఉండాలి. ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే ఇంటర్నల్ మార్కులు ( 20 ) ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి వంద మార్కుల విధానం ఉంటుంది. ఇంటర్నల్ మార్కులు ఉండవని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
గ్రేడింగ్ విధానం ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో…. ఈసారి టెన్త్ మార్కుల మెమోల ముద్రణ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో సర్కార్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తే… ఫలితాల విడుదల తేదీకి లైన్ క్లియర్ అవుతోందని పదో తరగతి బోర్డు వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రేపోమాపో క్లారిటీ తీసుకుని… ఫలితాల విడుదల తేదీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
గతేడాది ఏప్రిల్ 2తో ఎగ్జామ్స్ పూర్తి కాగా…. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈసారి కూడా ఏప్రిల్ నెలఖారులోనే ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెసుకోవచ్చు. గతేడాది విడుదలైన ఫలితాల్లో 91శాతం ఉత్తీర్ణత నమోదైంది. 99.06శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 66 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.