Is your liver safe?Ingestion Liver Diseases
శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. అది ఏమాత్రం దెబ్బతిన్నా ఎన్నో రకాల సమస్యలు తప్పవు. కానీ కొన్నేళ్లుగా కాలేయ వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
Liver Diseases: మీ కాలేయం సురక్షితమేనా?
తెలియకుండానే కబళించే లివర్ వ్యాధులు.. సమస్యేమిటో గుర్తించే సరికే ప్రాణాపాయ స్థితి
రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు
అధిక కొవ్వు, రసాయనాలున్న ఆహారం, మద్యం.. ఊబకాయం,హెపటైటిస్ ఇన్ఫెక్షన్లే కారణం
శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. అది ఏమాత్రం దెబ్బతిన్నా ఎన్నో రకాల సమస్యలు తప్పవు. కానీ కొన్నేళ్లుగా కాలేయ వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కాలేయ క్యాన్సర్లు నిశ్శబ్దంగా కబళిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యలను నివారించవచ్చు. పరిస్థితి ప్రమాదకరంగా మారిన వారికి కాలేయ మార్పిడి చికిత్సతో మంచి జీవితాన్ని అందించవచ్చు. కానీ కాలేయ దాతల కొరత ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 926 మంది బాధితులు కాలేయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలి కాలంలో కాలేయ సమస్యల బాధితుల సంఖ్య పెరుగుతోంది. హైపటైటి్‌స-బి వ్యాధి, విపరీతంగా మద్యం అలవాటు, అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడం, ఫ్యాటీ లివర్, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు వంటివి కాలేయ సమస్యలకు దారితీస్తున్నాయి. ఫ్యాటీలివర్, బై గ్లిజరైడ్ ఫాట్, సిర్రోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయి. 42 ఏళ్లు దాటిన వారిలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
కాలేయ సమస్యలను ఎలా గుర్తించవచ్చు
ఆకలి తగ్గిపోవడం, కడుపులో నొప్పి, రక్తపు వాంతులు, కామెర్లు, కడుపులో నీరు చేరడం, మల విసర్జనలో రక్తం పడటం, బరువు తగ్గిపోతుండటం, తరచూ జ్వరం, ముఖం, కాళ్ల వాపు వంటివి కాలేయ సమస్యలకు లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. కాలేయ జబ్బులను ప్రారంభ దశలో గుర్తిస్తే.. తేలికగా మందులతోనే బయటపడొచ్చని స్పష్టం చేస్తున్నారు. మరీ తీవ్రస్థాయికి చేరితే కాలేయ మార్పిడి అవసరమని వివరిస్తున్నారు. ఆల్కాహాల్ అలవాటును వదులుకోవడం, అధిక బరువును నియంత్రించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాష్ట్రంలో జీవన్‌దాన్ ద్వారా 2013 నుంచి ఇప్పటివరకు 1,473 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు నిర్వహించారు. ఇంకా 926 మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని కాలేయం కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్న 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారు ఎవరైనా కాలేయ దానం చేయవచ్చని వైద్యులు తెలిపారు. దానం చేసినవారిలో 3 నుంచి 6 నెలల్లో కాలేయం పెరిగి యథాస్థితికి వస్తుందని వివరించారు.
ఇది సైలెంట్ కిల్లర్..
కాలేయ వ్యాధి సైలెంట్ కిల్లర్. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటివి తీవ్రస్థాయికి చేరే వరకు పెద్దగా లక్షణాలేవీ చూపించవు. తరచూ అలసట, కడుపులో అసౌకర్యం, కామెర్ల వంటివి బాధపెడుతున్నవారు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
- డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ హెపటాలజిస్టు. స్టార్ ఆస్పత్రి
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రాసెస్డ్ ఆహారం, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, కృత్రిమ రంగులు కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. తాజా ఆహారం, తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. బీ, సీ, ఈ విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం కాలేయాన్ని రక్షించడానికి దోహదపడుతుంది. నీరు సమృద్ధిగా తాగాలి. మద్యపానం మానాలి. తగినంత శారీరక శ్రమ ఉండాలి. వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.
- డాక్టర్ మహమ్మద్ నయీమ్, క్లినికల్ డైరెక్టర్, కేర్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైజెస్టివ్ డిసీజెస్- లివర్ ట్రాన్స్‌ప్లాంట్
మొదటి దశలో ఏ లక్షణాలూ కనిపించవు
కాలేయ క్యాన్సర్ మొదటి దశలో పెద్దగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. మద్యం ఎక్కువగా తాగేవారు. హెపటైటిస్ బీ, సీ వ్యాధులున్నవారు, మెటబాలిక్ (జీవ క్రియలసంబంధ) వ్యాధులున్నవారు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాలేయ క్యాన్సర్‌కు ప్రత్యేక టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ అవసరం. కొంత మందికి కాలేయ మార్పిడి అవసరం కూడా పడొచ్చు. దేశంలో ఏటా 5వేలకుపైగా కాలేయ మార్పిడులు జరుగుతున్నాయి.
- డాక్టర్ రావుల ఫణికృష్ణ,
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, కిమ్స్