PALASH PAL ARRESTED IN HYD
కొత్త భవనాలే అతని టార్గెట్ - అందంగా తయారు చేస్తానని చివరికి!
ఇంటీరియర్ డిజైన్ల పేరిట అందినకాడికీ దోచుకుంటున్న నిందితుడు - నూతనంగా నిర్మిస్తున్న భవనాలే లక్ష్యంగా మోసాలు - డబ్బులు చేతిలో పడ్డాక మొహం చాటేస్తున్న నిందితుడు పలాశ్ పాల్..
Most Wanted Notorious Cheater Palash Pal Arrested in Hyderabad : ఇంట్లో అందాన్ని ఇనుమడింపజేసే అలంకరణలకు ఇటీవలి కాలంలో ప్రధాన్యం పెరిగింది. పేరొందిన ఇంటీరియర్ డిజైనర్లను సంప్రదిస్తూ విపణిలో కొత్తట్రెండ్ల గురించి తెలుసుకుని వాటిని తమ ఇంట్లోనూ చేయించుకుంటున్నారు. అదే అదునుగా భావించిన బెంగాల్ కేటుగాడు హైదరాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న భవనాలే లక్ష్యంగా ఇంటీరియర్ డిజైన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇంటీరియర్ డిజైనర్‌ను అంటూ భవన యజమానులు, కన్‌స్ట్రక్షన్స్ సంస్థలకు తనను తాను పరిచయం చేసుకుని మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నాడు. డబ్బులు చేతిలో పడ్డాక బాధితులు ఫోన్లు చేసినా స్పందించకుండా మొహం చాటేస్తాడు. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నేర చరిత్రను బయటపెట్టారు.
నారాయగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు :
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పలాశ్ పాల్ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. తాజాగా నారాయణగూడకు చెందిన నిఖిత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో నిర్మిస్తున్న ఇంటికి ఉడ్‌వర్క్ చేసేందుకు పలాశ్ పాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకోసం 66 లక్షల రూపాయలు తీసుకున్న పలాశ్ పాల్ ఆ తర్వాత పని పూర్తి చేయకుండా మొహం చాటేశాడు. నిఖిత్‌రెడ్డి ఫోన్లు చేసినా స్పందించకుండా నిందితుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన నిఖిత్‌రెడ్డి నారాయగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. విచారణలో అతని నేర చరిత్ర చూసి ఖంగుతిన్నారు.
నాన్ బెయిలబుల్ వారెంట్ :
నిందితుడిపై మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులున్నట్లు విచారణలో తేలింది. 2023లో శంషాబాద్ పీఎస్‌లో 15లక్షల 40వేలు 2024లో రాయదుర్గం పీఎస్‌లో 9లక్షల 82వేలు బాధితులను ఇదే తరహాలో మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. అంతే కాదు నిందితుడిపై 2021లో ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ హత్య కేసు కూడా నమోదైంది. పలాశ్ పాల్ భార్య కోల్‌కతాలోని స్వస్థలంలో ఉంటుండగా అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు కమల్ మైతీ భార్యతో పలాశ్ పాల్ వివాహేతర సంబంధం పెట్టుకుని 2021లో స్నేహితుడినే హతమార్చాడు. ఈ కేసులో జైలుకెళ్లిన నిందితుడు బెయిల్‌పై బయటకొచ్చాడు. కేసు ట్రయల్స్‌లో ఉన్నా కోర్టుకు హాజరవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ చేసింది.
పలాశ్ పాల్‌ను రిమాడండ్‌కు తరలింపు :
నమోదైన మూడు కేసుల్లో కలిపి నిందితుడు 91లక్షల రూపాయలకు పైనే మోసానికి పాల్పడ్డాడు. ఇంకా వెలుగుచూడని మోసాల్లో బాధితులకు భారీగానే కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న 18లక్షల 65వేల రూపాయలను ఫ్రీజ్ చేశారు. 120గ్రాముల బంగారం, 40వేల రూపాయల నగదు, 18లక్షల విలువైన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు సహా ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పలాశ్ పాల్‌ను రిమాడండ్‌కు తరలించారు.