Opportunity to study and work in UK for two years.
UK Visa : రెండేళ్లు యూకేలో చదువుకునే, వర్క్ చేసే అవకాశం.. ఫిబ్రవరి 18 నుంచి అప్లికేషన్ ప్రక్రియ.
News about UK : భారతీయ విద్యార్థులు యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (YPS) 2025లో భాగంగా రెండేళ్ల పాటు యూకేలో చదువుకునే, వర్క్ చేసే అవకాశం. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
UK Special Visa for Indians : యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (YPS) 2025లో భాగంగా భారత్- బ్రిటన్ దేశాల స్పెషల్ వీసాల జారీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. రెండేళ్ల పాటు బ్రిటన్‌లో నివాసం, చదువుకోవడం, ఉద్యోగం, ప్రయాణం చేయటానికి వీలుగా ఈ ప్రత్యేక వీసాలను ఇవ్వనున్నారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల భారతీయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
యూకే స్పెషల్ వీసా
డిగ్రీ, ఆపై స్థాయి విద్యార్హతలతో పాటు బ్రిటన్‌లో నివాస ఖర్చులకు గాను 2,530 పౌండ్లు తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 3000 వీసాలను జారీ చేస్తామని హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారి నుంచి లబ్ధిదారులను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తామని.. ఎంపికైన వారు వీసా ప్రాసెస్ కోసం తగిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలను https://www.gov.uk/world/india వెబ్‌సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
అలాగే.. భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మాట్లాడుతూ.. "యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అనేది బ్రిటీష్, భారత దేశాల మధ్య ఆధునిక అవగాహన పెంపొందించడానికి సహాయపడే ఒక అద్భుతమైన కార్యక్రమం. దేశంలోని అన్ని మూలల నుంచి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని గట్టిగా ప్రోత్సహిస్తున్నాను. ఇటానగర్ నుంచి కోయంబత్తూర్ వరకు, లేహ్ నుంచి సూరత్ వరకు.. భువనేశ్వర్ నుంచి ఇండోర్ వరకు దరఖాస్తు చేసుకోండి'' అని అన్నారు.
2023 ఫిబ్రవరిలో ప్రారంభించిన UK- ఇండియా YPS అనేది ఒక పరస్పర ఉపయోగకర పథకం. ఈ పథకం కింద 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల UK, భారత పౌరులు రెండు సంవత్సరాల వరకు ఇతర దేశంలో నివసించవచ్చు, చదువుకోవచ్చు, ప్రయాణించవచ్చు, పని చేయవచ్చు. UK దేశానికి ప్రయాణించాలనుకునే భారతీయుల కోసం YPS బ్యాలెట్‌లో ప్రవేశించడానికి ఉచితం. బ్యాలెట్ నుండి ఎంపికైన వారికి బ్యాలెట్ ముగిసిన రెండు వారాలలోపు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
వీళ్లు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు. ఆ తర్వాత వారు బ్యాలెట్‌లో విజయం సాధించినట్లు తెలియజేసే ఈమెయిల్ తేదీ నుంచి 90 రోజులలోపు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా UK హోమ్ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, వారి బయోమెట్రిక్‌లను అందించడానికి, వీసా దరఖాస్తు ఫీజు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్‌తో సహా అన్ని అనుబంధ రుసుములను చెల్లించడానికి అవకాశం ఉంటుంది.