Pushpa-2: How did Allu Arjun get such a craze in Bihar? Why was the trailer released in Patna?
పుష్ప-2: అల్లు అర్జున్‌కు బిహార్‌లో అంత క్రేజ్ ఎలా వచ్చింది? ట్రైలర్‌ను పట్నాలో ఎందుకు రిలీజ్ చేశారు?
అల్లు అర్జున్ కనపడగానే అరుపులు...
చేయి ఊపితే ఈలలు... డైలాగ్ చెప్పగానే కేకలు...
కిక్కిరిసిపోయిన మైదానం... కనుచూపు మేర జనం... పుష్పా పుష్పా అంటూ ఒకటే గోల...
ఈ సీన్ తెలుగు రాష్ట్రాల్లో కాదు.. బిహార్ రాజధాని పట్నాలో.
పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ లాంచ్‌కు దాదాపు 2 లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వస్తోంది.
కొత్త ట్రెండ్
‘‘పాన్ ఇండియా’’ ట్యాగ్‌తో వచ్చే తెలుగు సినిమాల ప్రమోషన్లు సాధారణంగా ముంబయిలో జరుగుతుంటాయి. సెప్టెంబరులో జరిగిన దేవర ట్రైలర్ లాంచ్ అలాంటిదే. కానీ రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ చేంజర్’’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో కాకుండా లఖ్‌నవూలో జరిగింది. ఇప్పుడు పుష్ప-2కు పట్నా వేదికైంది.
అయితే ఇక్కడ పుష్ప-2ను ‘‘ట్రెండ్ సెట్టర్’’ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు బాలీవుడ్ స్టైల్లో కొంతమంది అభిమానులు, మీడియా మధ్య ఇండోర్‌లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేసేవి. దాన్ని బ్రేక్ చేస్తూ భారీ స్థాయిలో అవుట్‌డోర్‌లో పుష్ప-2 ఈవెంట్ జరిగింది. ఒక దక్షిణాది సినిమా ఉత్తరాదిన ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం ‘‘ఇదే తొలిసారి’’ అని ఫిలిం క్రిటిక్ అన్వర్ అన్నారు. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఇటువంటి అనుభవం కొత్తే.
బాలీవుడ్‌లో సాధారణంగా సినిమా ప్రమోషన్లు తెలుగు, తమిళ్ వంటి దక్షిణాది సినిమాల మాదిరి భారీ స్థాయిలో ఉండవు. దక్షిణాదిన ఆడియో రిలీజ్, ట్రైలర్ లాంచ్, సక్సెస్ మీట్స్ వంటి ఫంక్షన్లు బహిరంగ ప్రదేశాల్లో వేలమంది అభిమానులతో నిర్వహిస్తుంటారు. ఇప్పుడు పుష్ప-2తో ఈ కల్చర్‌ను ఉత్తరాది సినీ అభిమానులకు పరిచయం చేశారు.
‘‘పట్నాలో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌కు అంత భారీ స్పందన రావడానికి కారణం, అలాంటి ఈవెంట్ వాళ్లకు కొత్త కావడమే’’ అని అన్వర్ అన్నారు.
బిహార్‌ను ఎంచుకోవడం వెనుక కూడా ఒక స్ట్రాటజీ ఉందనేది అన్వర్ మాట. బాలీవుడ్ ప్రమోషన్లు ముంబయి, దిల్లీ వంటి మెట్రో సిటీలకు మాత్రమే పరిమితమవుతాయి. వాళ్ల ఫోకస్ ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మీదనే ఉంటుంది.
‘‘ఇటువంటి ప్రమోషనల్ ఈవెంట్లు పరిచయం లేని చోట పెడితే స్పందన ఎక్కువగా ఉంటుందనేది పుష్ప టీం వ్యూహం అనుకోవచ్చు. అందుకే బిహార్‌ను వాళ్లు ఎంచుకున్నారు’’ అని అన్వర్ అభిప్రాయపడ్డారు.
అంటే ఉత్తరాదిలోని మాస్ ఆడియెన్స్ మీద పుష్ప టీం ఫోకస్ పెట్టింది.
ఉత్తరాదినా ఫాలోయింగ్..
డబ్బింగ్ సినిమాల రూపంలో ఉత్తరాది వాళ్లకు తెలుగు సినిమాలు బాగా పరిచయమే. కొన్ని టీవీ చానెళ్లు డబ్బింగ్ సినిమాలను చాలా కాలం నుంచి ప్రసారం చేస్తున్నాయి.
‘‘అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తెలుగు యాక్టర్లు మాకు బాగా తెలుసు. ఎంతో కాలం నుంచి వాళ్ల డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం. డేంజరస్ కిలాడీ (జులాయ్), సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి సినిమాలు బాగా ఫేమస్’’ అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభయ్ సింగ్ అన్నారు.
‘‘కశ్మీర్‌లో కూడా అల్లు అర్జున్ ఫేమస్’’ అంటూ ఒక ఘటన గురించి సుమారు రెండేళ్ల కిందట బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఒక ఈవెంట్‌లో ప్రస్తావించారు.
‘‘మా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు కశ్మీర్‌లోని గురీజ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక అబ్బాయి తనకు అల్లు అర్జున్ తెలుసని చెప్పారు. అప్పటికి ఇంకా పుష్ప రిలీజ్ కూడా కాలేదు’’ అని ఇంతియాజ్ అలీ అన్నారు.
దిల్లీలో క్యాబ్‌లు లేదా ఆటోలలో ప్రయాణించేటప్పుడు, కొన్ని సార్లు డ్రైవర్లు కూడా ఇదే మాట చెబుతుంటారు. మాటల్లో మేం తెలుగు వాళ్లం అని తెలియగానే ‘‘తెలుగు సినిమాలు చూస్తుంటాం’’ అని చెబుతుంటారు. డబ్బింగ్ చిత్రాల తరువాత ఓటీటీలు సౌత్ ఇండియా సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. బాహుబలి, పుష్ప-1, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతారా, విక్రమ్ వంటి సినిమాలు సౌత్ ఇండియా హీరోల ఫ్యాన్ బేస్‌ను ఇంకా పెంచాయి.
పుష్ప-1 పాటలు నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి. క్యాబ్‌లు, ఆటోలు, షాపింగ్ మాల్స్, ఇళ్లలోనూ నిత్యం వినిపించేవి. ‘‘జుకేగా నహీ సాలా’’, ‘‘పుష్పకో ఫ్లవర్ సమజే హై క్యా..’’ వంటి డైలాగులతో కుర్రకారు రీల్స్ బాగా చేస్తుండే వాళ్లు.
‘‘ఎందుకు దక్షిణాది సినిమాలు అంటే ఇష్టం?’’ అని ఒకసారి బిహార్‌కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్‌ను అడిగినప్పుడు, ‘‘డ్యాన్స్‌లు బాగా వేస్తారు. ఫైట్లు, యాక్షన్ సీన్లు చాలా బాగా ఉంటాయి. హిందీ సినిమాలలో లేని మజా వాటిలో ఉంటుంది’’ అని అన్నారు. సాధారణంగా సౌత్ ఇండియా సినిమాలు హీరోలను ‘‘లార్జర్ దాన్ లైఫ్’’గా చూపిస్తుంటాయి. ఇది ఆ బిహారీ డ్రైవర్ వంటి వాళ్లకు ‘మజా’ ఇస్తూ ఉండొచ్చు.
కొత్త మార్కెట్ కోసం
బాహుబలితో తెలుగు సినిమా బడ్జెట్ ‘హద్దుల’ను దాటించిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్‌తో మరొక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆర్ఆర్ఆర్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన పాపులారిటీ, ఆస్కార్ అవార్డులతో నేడు హీరోలు, డైరెక్టర్లు ‘‘పాన్ ఇండియా’’కు మించి చూసే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ‘‘పాన్ ఇండియా’’ ఫీవర్‌తో వందల కోట్ల రూపాయలు పెట్టి తీసే తెలుగు సినిమాలకు సాధ్యమైనంత పెద్ద మార్కెట్ కావాలి. విజయానికి కలెక్షన్లే ప్రామాణికమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం.
‘‘అల్లు అర్జున్ తన మార్కెట్‌ను పెంచుకోవడంలో భాగంగానే బిహార్‌లో పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. పుష్ప-1కు తొలుత అనుకున్నంత ఓపెనింగ్స్ రాలేదు. ఆ తరువాత మెల్లగా మౌత్ టాక్‌తో ఆడియెన్స్ రావడం మొదలై కలెక్షన్ల వర్షం కురిసింది. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో పబ్లిసిటీ బాగా చేసి మంచి ఓపెనింగ్స్ ఉండేలా చూసుకోవాలని టీం భావిస్తోంది’’ అని అన్వర్ అన్నారు.
‘‘పుష్పా కభీ జుకేగా నయ్ (పుష్ప ఎప్పుడూ తగ్గడు)... ఆజ్ పహలీ బార్ ఆప్కా ప్యార్ కేలియే జుకేగా (నేడు మీ ప్రేమకు తొలిసారి తలొంచుతున్నాడు)...’’ అంటూ అల్లు అర్జున్ హిందీలో మాట్లాడటం కూడా ఉత్తరాది వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నంగా చూడొచ్చు.
డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన అల్లు అర్జున్‌కు పుష్ప-1 రూపంలో నార్త్ ఇండియాలో బ్రేక్ వచ్చింది. ప్రముఖ ఫిలిం బిజెనెస్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం, పుష్ప-1 హిందీ వర్షన్ 50 రోజుల్లో రూ.100.85 కోట్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప-2తో కలెక్షన్లను మరింత పెంచుకోవడంతో పాటు తన ఇమేజ్‌ను మరొక మెట్టు ఎక్కించాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు?
పట్నాలో జరిగిన పుష్ప-2 ఈవెంట్ ఒక మలుపు వంటిదని విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘పుష్ప-2 ఈవెంట్‌ను ఒక పాజిటివ్ సైన్‌గా చూడొచ్చు. ఇంత భారీ స్థాయిలో చేయడం, దానికి మంచి స్పందన రావడం తప్పకుండా ఒక మలుపు. తెలుగులోని ఇతర డైరెక్టర్లు, నటులు, నిర్మాతలకు కచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ వంటిది. వాళ్లు కూడా దీన్ని ఫాలో కావొచ్చు’’ అని యూఎఫ్‌ఓ మూవీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) జి.లక్ష్మణ్ బీబీసీతో అన్నారు.
ఇలా సౌత్ ఇండియా సినిమాలు నార్త్ ఇండియాకు, అక్కడి సినిమాలు ఇక్కడకి రావడం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లకు మంచిగా కంటెంట్ దొరుకుతుందని లక్ష్మణ్ చెప్పారు.
అలాగే దక్షిణాది సినిమా కల్చర్‌ను బాలీవుడ్ సినిమాలు కూడా అందిపుచ్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘దక్షిణాది డైరెక్టర్లు ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నారు. ఇక్కడి నటులు కూడా అక్కడ నటిస్తున్నారు. కాబట్టి సౌత్ ఇండియా సినిమా కల్చర్‌ను బాలీవుడ్ కూడా అందిపుచ్చుకోవచ్చు. దక్షిణాది చిత్రాలకు సొంతమైన భారీ ఈవెంట్స్‌ను ఇప్పుడు అక్కడి వారికి పుష్ప-2 పరిచయం చేసింది. కచ్చితంగా దీని ప్రభావం హిందీ సినిమాల మీద ఉంటుంది’’ అని లక్ష్మణ్ అంచనా వేశారు.
భారీ బడ్జెట్‌లో సినిమాలు తీసి, వాటి కలెక్షన్ల కోసం మార్కెట్‌ను పెంచుకునే భాగంలో దీన్ని చూడొచ్చా అని అడిగనప్పుడు, ‘‘సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో కంటెంట్ డిసైడ్ చేస్తుంది. పుష్ప-1 హిట్ అయింది. పుష్ప-2 మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఖర్చు పెడతారు’’ అని లక్ష్మణ్ అన్నారు.
