Miss India 2024: TV anchor Nikita Porwal as Miss India 2024
Miss India 2024: మిస్ ఇండియా 2024గా టీవీ యాంకర్ నికితా పోర్వాల్, ఈమె ఎంతో టాలెంటెడ్ కూడా, ఇంతకీ నికితా ఎవరు?
మిస్ ఇండియా 2024 కిరీటాన్ని నికిత పోర్వాల్ గెలుచుకుంది. మన దేశం తరఫున త్వరలో మిస్ వరల్డ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించబోతోంది. ఈమె మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి నికితా. ఈమెకు మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా కిరీటాన్ని పెట్టింది. నికిత గురించి ఇంతకు ముందు ఎవరికీ తెలియదు, ఇప్పుడు మిస్ ఇండియాగా గెలవడంతో నికితా పోర్వాల్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు నెటిజెన్లు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతానికి నికితా గురించి చాలా తక్కువ సమాచారమే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది.
నికితా పోర్వాల్ ఎవరు?
నికిత పోర్వాల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడే కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ప్రస్తుతం బరోడాలోని మహారాజా షాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
నాటకాల్లో టాప్
ఆమె 18 ఏళ్ల వయసులోనే తన కెరీర్‌ను ప్రారంభించింది. మొదట టీవీ యాంకర్ గా ఆమెకు అవకాశం వచ్చింది. తరువాత చిన్న చిన్న సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె చేసిన ఒక చిత్రం అంతర్జాతీయ ఉత్సవాల్లో కూడా ప్రదర్శించారు. ఇది ఇంకా మన దేశంలో విడుదల కాలేదు. త్వరలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఆమె థియేటర్ ఆర్టిస్టు కూడా. అరవైకి పైగా నాటకాల్లో ఈమె నటించింది. కథలు చెప్పడం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. నాటకాలను కూడా ఎంతో ఇష్టంగా రాస్తుంది. ‘కృష్ణ లీల’ అని పిలిచే నాటకాన్ని ఆమె రాసింది. ఈ నాటకం 250 పేజీలు ఉంటుంది.
నికితకు ఐశ్వర్యారాయ్ అంటే ఎంతో ఇష్టం. ఆమెనుతన ఆరాధ్య దైవంగా చెబుతుంది. ఐశ్వర్య అందం, తెలివితేటలు తనని ఎంతో ఆకర్షించాయని వివరిస్తోంది. అందంతో పాటు తెలివితేటలు కలిగి ఉండడం ఎంతో అదృమని అంటోంది నికితా.
ఈ మిస్ ఇండియా పోటీలు అక్టోబర్ 16న ముంబైలోని ఫేమస్ స్టూడియోలో నిర్వహించారు. ప్రతి భారతీయ రాష్ట్రం నుంచి 30 మంది పోటీదారులు పాల్గొన్నారు. నికిత మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో రేఖ పాండాయ్ నిలిచింది. ఇక మూడో స్థానంలో గుజరాత్ కు చెందిన ఆయుషి ధోలాకియా నిలిచింది.
మిస్ ఇండియా పోటీల్లో భారతదేశంలో జరిగే ఒక జాతీయ స్థాయి అందాల పోటీ. ఇందులో గెలిచిన విజేత మిస్ వరల్డ్ పోటీకి అర్హురాలు అవుతుంది. టైమ్స్ గ్రూప్ ప్రచురించే ఫెమీనా పత్రికా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి.
మిస్ ఇండియా విజేత మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె భారతీయ అందాన్ని, సంస్కృతిని, విలువలను విదేశాలకు తీసుకెళ్లే రాయబారిగా వ్యవహరిస్తుంది.