Tragedy on the eve of the festival.. Unexpected accident while flying kites, boy died
పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగరేస్తుండగా అనుకోని ప్రమాదం, బాలుడు మృతి.
సంక్రాంతి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది. పతంగులు ఎగురవేసందుకు వెళ్లి ఓ 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లో సంక్రాంతి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి డాబా పైకి ఎక్కిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన తనిష్క్.. తన స్నేహితులు, అన్నయ్యతో కలిసి ఇంటి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పైకి వెళ్లాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా.. తనిష్క్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఏసీకి విద్యుత్ సరఫరా అవుతుండగా.. అది గమనించకుండా వెళ్లిన చిన్నారి ప్రమాదానికి గురయ్యాడు.
గమనించిన తనిష్క్ అన్నయ్య విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు బాలుడిని ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్దరించారు. దీంతో పండగ పూట చిన్నారి ఇంట్లో విషాదం అలుముకుంది. తమ గారాల పట్టి దూరమయ్యాడని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు:
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పండగను ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు. పిల్లలు, యువకులు విద్యుత్ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసేందుకు ప్రయత్నించరాదు. కరెంట్ షాకు తగిలే అవకాశం ఉంది. కాటన్, నైలాన్, లినెన్‌తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ భవనాల మీద నుంచి గానీ, సగం నిర్మించిన గోడల మీద నుండి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు. పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో పెద్దలు దగ్గర ఉండాలి.