Forerunner of Widow Remarriages - September 26 Iswara Chandra Vidyasagar Jayanti
వితంతు పునర్విహాలకు ఆద్యుడు - సెప్టెంబర్ 26 ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జయంతి
బ్రిటిష్ వారు ముందు బెంగాల్ ప్రాంతాన్నిఆక్రమించుకొని,తర్వాత భారత దేశంపై పట్టు సంపాదించారు.అందువల్లే స్వాతంత్ర ఉద్యమానికి పునాదులు బెంగాల్ లో పడ్డాయి.అదే సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు కూడా ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి.బెంగాల్ లో జన్మించిన అనేకమంది మహనీయులు ఆనాటి సమాజంలో నెలకున్న సాంఘిక దురాచారాలని నిర్మూలన చేయడానికి ఎంతో కృషి చేశారు. వారిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఒకరు.
ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామం (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద కుటుంబములో 1820 సెప్టెంబర్26న జన్మించారు. బాల్యమంతా పేదరికముతో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించారు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము వల్ల కొడుకు కూడా ఆదే వృత్తిని అవలంబించారు. మొదట గ్రామంలో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో1828లోఉద్యోగము దొరకడముతో కలకత్తాకు మారారు.వారి బంధువు మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపారు.
మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ టాగోర్, క్రైస్తవ మతముకు చెందిన అలెక్సాండర్ డఫ్, కృష్ణ మోహన్ బెనర్జీ, లాల్ బెహారీ డేలు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త, ఇతర సమాజములు సంస్కరణ పద్ధతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసమాజము లోలోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించారు. పందొమ్మిదవ శతాబ్దములోఅణగదొక్కబడిన మహిళల స్థితిని మార్చడానికి ప్రయత్నం చేశారు.ఇందుకు వారికి సరైన విద్య అవసరమని చెప్పారు.
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం (15వ నెంబరు చట్టం) ప్రతిపాదించి దాని అమలుకు అన్నివిధాలుగా కృషిచేశారు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించారు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవారు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించారు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశారు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్థికమైన ఇబ్బందులలో పడ్డారు. ఆయన1891 జులై29న తుది శ్వాస విడిచారు.

