Road Accident Victims
రోడ్డు ప్రమాద బాధితులకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. కేంద్రం కొత్త పథకం
భారత్‌లో రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు (Road accidents) జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాంతక గాయాల పాలవుతారు. కొన్ని సందర్భాల్లో కాలు, చేయి పోగొట్టుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటప్పుడు బాధితుల బతుకు నరకం అవుతుంది. వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలవుతారు. మొత్తంగా వీరి పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇలాంటి బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు ఫ్రీ, క్యాష్‌లెస్ మెడికల్ ట్రీట్‌మెంట్ అందించడమే ఈ కొత్త పథకం లక్ష్యం.
ఈ పథకం మోటార్ వెహికల్ అమెండ్‌మెంట్ యాక్ట్ 2019లో ఒక భాగం. రహదారి భద్రతను మెరుగుపరచడం, మరణాలను తగ్గించడం ఈ చట్టం లక్ష్యం. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పథకం అమల్లోకి వస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ (Anurag Jain) తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బు చెల్లించే సామర్థ్యంతో ఉన్నా లేకపోయినా, సమీపంలోని ఆసుపత్రిలో తక్షణమే నాణ్యమైన మెడికల్ ట్రీట్‌మెంట్‌ను ఈ పథకం అందిస్తుంది.