The story of Sita.. is a lesson for us too! We should get inspired from her!
Ramayana is the story of Sita Mahat, who did not stop in killing the demons and led the story of Rama forward. Although Rama is the protagonist, the whole story is about Sita. Even as Sita joined Mithilapuri in the form of a baby, joined Janaka, who was waiting with empty hearts, Sita duly performed her role in establishing the conjugal dharma for Sri Rama, who tried to revive Shiva Dhanu, who is said to be the embodiment of ancient marital traditions. If Ramayana stands behind all the human values, emotions, protection of religion, incredible family relationships, desire-sacrifices, nature-man, selfless paramarthas and gets fame even today, Sita is the story of all the beautiful Rama story Manihara. In a word, Sita is the symbol of perfect femininity. A mine of inexhaustible values despite the change of generations. We should get inspired from her!
సీత కథ.. మనకూ పాఠమే! ఆమె నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలెన్నో !
రాక్షస వధలో విరామమెరుగని రాముని, రామకథను ముందుకు నడిపించిన సీత మహత్ చరితమే రామాయణం. కథానాయకుడు రాముడైనా, కథంతా సీతదే. ప్రకృతి యావత్తూ పసిపాప రూపమై, బీడు వారిన గుండెలతో నిరీక్షిస్తున్న జనకుని చేరి సీతగా మిథిలాపురిని మురిపించినా, ప్రాచీన వైవాహిక సంప్రదాయాలకు మారురూపుగా చెప్పే శివధనువును పునరుద్ధరించే ప్రయత్నం చేసిన శ్రీరాముని చేయందుకుని దాంపత్య ధర్మ ప్రతిష్ఠాపనలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా సీతకే చెల్లింది. సమస్త మానవీయ విలువలకు, ఉద్వేగ నిరూపణలకు, ధర్మరక్షణకు, అపురూపమైన కుటుంబ సంబంధాలకు, కోరిక-త్యాగాలకూ, ప్రకృతికీ-మనిషికీ, నిస్వార్థ పరమార్థాలకు వెన్నుదన్నుగా నిలిచి నేటికీ, ఏ నాటికీ కీర్తిని పొందేది రామాయణమైతే, అంతటి సుందర రామ కథా మణిహారంలో కలికితురాయి సీత. ఒక్క మాటలో చెప్పాలంటే సీత పరిపూర్ణ స్త్రీత్వానికి ప్రతీక. తరాలు మారినా తరగని విలువల గని. ఆమె నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలెన్నో!..
జ్ఞానభూమిలో పుట్టి జనక రాజర్షి కనుసన్నల్లో పెరిగిన సీత, బ్రహ్మవాదిని గార్గి చేత ప్రభావితమైంది. తద్వారా సకల ధర్మశాస్త్రాల్లో అపార జ్ఞానసముపార్జితురాలైంది. ప్రశ్నించేతత్వాన్ని ఆకళింపు చేసుకుంది. ఆ తత్వమే ఆమె వ్యక్తిత్వ వికాసానికి పునాది రాయి.
తనదే నిర్ణయం: సీత.. తాను తీసుకున్న నిర్ణయాలతో తనకెదురైన అన్ని పరిస్థితులకూ స్వయంసిద్ధగా ఉందే కానీ దేనికీ మరొకరిని కారణంగా చూపించలేదు. అది.. అయోధ్యను వదిలి అడవికి వెళ్ళటమైనా, లక్ష్మణ రేఖ దాటడమైనా, కడలి దాటించగలనన్న హనుమ వినతిని తిరస్కరించటమైనా, సుతులతో తిరిగి రాజ్యానికి రమ్మన్న రాముని కాదని భూమాత ఒడికి చేరుకోవడమైనా.. ప్రతి సందర్భంలోనూ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉంది.
ధైర్యశాలి: శింశుపావనంలో ఘోర రక్కసులు తనను చుట్టుముట్టినా, రావణుడంతటి వాడు తన ఎదుట నిలిచి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా అతనికి లొంగలేదు. సహజ క్షమాగుణంతో రావణుని ప్రవర్తనలో మార్పును కోరిందే కానీ రాక్షస కుల వినాశనాన్ని కోరలేదు.
వివేకవంతురాలు: రావణుడు మాయోపాయంతో తనను లంకకు ఎత్తుకుపోయే సమయంలోనూ తనకున్న కొద్దిపాటి నగలను జారవిడిచి తన ఉనికిని సూచించింది. మరోసారి మోసపోకూడదన్న ముందు జాగ్రత్తతో... పరిపూర్ణ విశ్వాసం కలిగించిన తర్వాతే హనుమతో మాట కలిపింది.
ఆత్మగౌరవం: తన కోసం నిరీక్షించిన భర్త కోసం, ఆనాటి పరిస్థితుల ప్రకారం అగ్నిపరీక్షకు అంగీకరించింది. కానీ, నిండు గర్భిణైన తనను అడవులపాలు చేసిన రాముడు, అయోధ్య ప్రజలు తిరిగి తనను రమ్మని ఎంత ప్రాధేయపడ్డా అంగీకరించలేదు. మాటిమాటికీ నిందలు భరించటం తనవల్ల కాదంది. ఆమె ఏ పని చేసినా తన ఆత్మసంతృప్తికే గానీ సమాజ అభ్యంతరాలకు లొంగి కాదు. ప్రజలు, పరిస్థితులూ- వారి మనోభావాలూ సీత జీవితంలో ఒక భాగమే కానీ వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని ఏనాడూ మార్చుకోలేదు. ప్రాణం కన్నా మిన్నగా సీతను ప్రేమించిన రాముడు, ఆమెను వదిలేస్తున్నానని చెప్పినా.. ఆవేశానికి లోను కాలేదు, ఏ అఘాయిత్యానికీ పాల్పడలేదు. భార్యాభర్తల బంధం సజావుగా సాగటానికి ఒక అవకాశమిచ్చిందే కానీ దాని కోసం తన ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించుకోలేదు.
నమ్మకం: సీతకు భర్త పరాక్రమంపై నమ్మకమూ ఎక్కువే. అందుకే రాముడు వస్తాడని, తనను సగౌరవంగా తీసుకువెళతాడనీ రావణుడితో సవాల్ చేయగలిగింది. గడ్డిపోచ కన్నా హీనంగా రావణున్ని చూడగలిగింది. ఏకపత్నీవ్రతుడైన తన భర్త చేతిలో రావణుడికి తగిన దండన తప్పదంది. అన్నట్టుగానే దానిని నిలుపుకున్నాడు రాముడు. అందుకే వారు ఆదర్శప్రాయులయ్యారు.
స్వావలంబన: ఇది సీత సొంతం. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ తనను తాను నిలుపుకున్న తీరు అద్భుతం. ఆమె తనపై తాను ఆధారపడ్డంతగా ఎవరిపైనా ఆధారపదలేదన్నది వాస్తవం. నాటి సీత చేసి, చూపించింది మన తరాలకి అనుసరణీయం. ఆ బాటలో నడుద్దాం.