Biography of Babasaheb Dr Bhimrao Ramji Ambedkar

 Babasaheb Dr Bhimrao Ramji Ambedkar

Babasaheb Dr Bhimrao Ramji Ambedkar

భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగంలో కీలకపాత్ర వహించిన అంబేద్కర్ జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ స్టొరీ చదవాల్సిందే

బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.

బాల్యము, యువకునిగా అంబేద్కర్

అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వికులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవలు మోహో సైనిక స్థావరంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశాడు. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.

బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య

మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్‍కు రాలేకపోయారు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్‌రావ్ ను అవమానాలకు గురిచేశారు. రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు.

బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది

మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు! కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.

దళిత మహాసభ (1927)- మనుస్మృతి దహనము:

1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమీషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931, మరియు 1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్చిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయము కుదరక పోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు" ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయి.

ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధి శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నారు. ఈ ప్రకటన గూర్చి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. అంబేద్కర్ పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీ కి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరాని తన నిర్మూలనలో గాంధి కున్న చిత్తశుద్ది మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధి ఉద్యమమునుండి బయటకు వచ్చి ప్రత్యేఖముగా దళిత సమస్య పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసారు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్రము రావడం జరిగాయి.

రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్:

రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు

బౌద్దమును స్వీకరించుట:

అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. . 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు.

'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.