Sorghum prevents diabetes 2023
జొన్నలతో మధుమేహం దూరం
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో మధుమేహం కనిపిస్తోంది. దాన్ని దూరం చేయడానికి నడకతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. మధుమేహం, బిపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. వీటిలో జొన్నలు ముఖ్యమైనవి. ప్రయోజనకరమైనవి. తక్కువ ధరకు దొరకుతాయి. సుమారు ఎనిమిది గంటలు నానబెట్టి జొన్నలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు మరింత పెరగడంతో పాటు త్వరగా జీర్ణమవుతాయి.
100 గ్రాముల జొన్నల్లో 72. 6 గ్రాముల పిండి పదార్థాలు, 10. 4 గ్రాముల మాంసకత్తులు, 1.6 గ్రాముల పీచు పదార్థాలు, 4. 1 మిల్లీ గ్రాముల ఐరన్, 25 మిల్లీ గ్రాముల కాల్షియం, 20 మిల్లీ గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జబ్బు పడిన వారికి జొన్నలతో చేసిన ఆహార పదార్థాలను ఇవవ్డం వల్ల వారు త్వరగా కోలుకుంటారు.
జొన్నలతో చేసే ఏ పదార్థమైనా బలవర్ధకమైనదే. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజూ జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జొన్న గటక, జొన్న జావ, జొన్న అన్నం ఇలా ఏ రకంగా తీసుకున్నా జొన్నలతో మేలే జరుగుతుంది.
జొన్నల్లో ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం ఉంది. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించే శక్తి వీటిలో ఉంది.
ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గి ఆరోగ్యంగా ఉంచుతుంది. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది.

