Are you withdrawing money from post office schemes? Rules have changed.. These are the nominee charges!
Nomination: పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులేస్తున్నారా? రూల్స్ మారాయ్.. నామినీ ఛార్జీలు ఇవే!
Post Office Schemes: మీరు పోస్టాఫీసు పొదుపు పథకాలైన పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఎస్‌సీఎస్ఎస్ వంటి వాటిల్లో పొదుపు చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఇప్పటికే పథకాలకు నామినీ పేరును యాడ్ చేశారా? లేదా కొత్తగా చేర్చాలా? లేదా నామినీ పేరును మార్చాలా? ఈ రూల్స్ మారాయి. నామినీ పేరు జత చేసేందుకు ప్రస్తుతం ఎంత మేర ఛార్జీలు వసూలు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Small Savings Scheme Nomination: దేశంలోని సామాన్య ప్రజలను సైతం ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకాలు పోస్టాఫీసులో అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాల్లో లక్షల మంది పొదుపు చేస్తున్నారు. అయితే, ఏ పథకంలో డబ్బులు జమ చేసినా నామినేషన్ అనేది తప్పనిసరి. నామినీ పేరును జత చేయడం ద్వారా ఖాతాదారు మరణించిన సందర్బంలో సులభంగా అందులోని డబ్బులను వారసులకు అందించవచ్చు. అయితే మీరు కూడా పోస్టాఫీసు పథకాల్లో డబ్బులు జమ చేస్తుంటే నామినేషన్ రూల్స్ తెలుసుకోవాలి.
పోస్టాఫీసు పొదుపు పథకాల నామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అలాగే నామినీ వివరాలను అప్డేట్ చేయడం లేదా కొత్త పేరును జత చేయడం వంటి వాటికి వసూలు చేస్తున్న ఫీజులను తొలగించింది. ఇకపై పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పొదుపు ఖాతాలు కలికి ఉన్న వారు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే నామినీ పేరును చేర్చవచ్చు. లేదా ఉన్న పేరును తొలగించి కొత్త పేరును జత చేయవచ్చు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఖాతాదారులు ఉచితంగానే నామినీ వివరాలను మార్చుకోవచ్చని తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3, 2025 రోజున జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ' గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018 లోని షెడ్యూల్ 2 కింద వసూలు చేస్తున్న నామినేషన్ అప్డేషన్ సర్వీస్ ఛార్జీలు రూ.50ని పూర్తిగా తొలగించడం జరిగింది.' అని పేర్కొంది. ఇప్పటి వరకు పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఎస్‌సీఎస్ఎస్ వంటి పొదుపు పథకాలకు నామినేషన్ వివరాలను అప్డేట్ చేసేందుకు రూ.50 ఫీజు వసూలు చేసే వారు. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఫీజు లేకుండానే నామినేషన్ అప్డేట్ చేసుకోవచ్చు.
మరోవైపు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో డబ్బులు జమ చేస్తున్న వారు బహుళ పేర్లను నామినీగా చేర్చుకోవచ్చు. అంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురి పేర్లను నామినీగా జత చేయవచ్చు. అయితే, నలుగురికి మించి పేర్లు చేర్చేందుకు అవకాశం లేదు. అనుకోని సంఘనటలో పీపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే అతను సూచించిన విధంగా నామినీలకు డబ్బులు చెల్లిస్తారు.