Bhu Bharathi Act

 Bring Bhu Bharathi Act Relief To Sada Bainama Farmers In Telangana

రైతులకు శుభవార్త.. సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం.. ఈ నెలాఖరులోగా..?

Bhu Bharathi Act

తెలంగాణలో ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా సమస్యకు భూభారతి చట్టంతో పరిష్కారం లభించనుంది. తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట కలగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్-2025 ద్వారా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించనుంది. గతంలో జీవో 112 ద్వారా 2.26 లక్షల దరఖాస్తులు.. ఆ తర్వాత 6.74 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కోర్టు స్టే కారణంగా పరిష్కారం ఆలస్యమైంది. కొత్త చట్టంలో పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న భూభారతి చట్టం అమల్లోకి వస్తే.. దాదాపు తొమ్మిది లక్షల కుటుంబాలకు భూ హక్కులు పొందే అవకాశం కలుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు.. సాదా బైనామా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఈ సమస్య పరిష్కారానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూనే.. మరోవైపు ఈ నెలాఖరు నాటికి కొత్త రెవెన్యూ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ROR) చట్టం అమల్లోకి రాగానే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రారంభ దశలో గ్రామ పాలనాధికారుల ద్వారా.. అంటే పాత వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా ఈ దరఖాస్తులపై ప్రాథమిక విచారణ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించనున్నారు. ముఖ్యంగా.. ఆర్వోఆర్-2025 చట్టంలో కేవలం గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి మాత్రమే ప్రత్యేక ప్రొవిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సాదా బైనామా ప్రక్రియను ప్రోత్సహించకుండా కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే.. గతంలో స్వీకరించిన దరఖాస్తులకు మాత్రమే ఈ కొత్త చట్టం వర్తిస్తుంది.

గతంలో.. 2020 అక్టోబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 112 ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ సమయంలో.. 2020 అక్టోబర్ 10 నుండి 29 వరకు మొత్తం 2,26,693 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఆ తర్వాత.. ఆర్వోఆర్-2020 చట్టం అమల్లోకి వచ్చింది. దురదృష్టవశాత్తు.. ఈ కొత్త చట్టంలో అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ 5 ఏ,5 బీ లను తొలగించారు. దీని కారణంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు చట్టపరమైన అవకాశం లేకుండా పోయింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మరో 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలకు చేరుకుంది.

ధరణి చట్టంలో తగిన ప్రొవిజన్ లేనప్పటికీ.. ఈ దరఖాస్తులను ఎలా స్వీకరించారని.. వాటిని ఏ చట్ట ప్రకారం పరిష్కరిస్తారని ప్రశ్నిస్తూ కోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా.. ఈ దరఖాస్తుల పరిష్కారంపై కోర్టు స్టే విధించింది. ఆ స్టేను తొలగించడానికి గత ప్రభుత్వం నుండి సరైన ప్రయత్నాలు జరగలేదు. పాత చట్టానికి సవరణలు కూడా చేయలేదు. దీని కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు.. అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా.. ఆర్వోఆర్-2025 చట్టంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం కల్పించారు.

రెవెన్యూ రంగంలోని నిపుణులు ఈ కొత్త చట్టం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాదా బైనామాల దరఖాస్తులపై కోర్టులో స్టే ఉన్నప్పటికీ.. కొత్త చట్టంలో పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నందున ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు అంటున్నారు. స్టేను తొలగించిన తర్వాతే ప్రక్రియను ప్రారంభించాలనే అవసరం కూడా లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా.. 2020 అక్టోబర్ 29 వరకు దాఖలైన 2.26 లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేపట్టవచ్చని వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం వల్ల దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమేనని వారు అంటున్నారు. ఇప్పటికే ఐదారేళ్లుగా తమ భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలో ఒక స్పష్టమైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.