Financial assistance up to Rs.3 lakhs depending on eligibility
Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అర్హతను బట్టి రూ.3లక్షల వరకు ఆర్థిక సాయం
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు "రాజీవ్ యువ వికాసం" పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రూ.3 లక్షలకు తగ్గకుండా నిరుద్యోగ యువతకు సాయం అందిస్తామన్నారు. రూ.6వేల కోట్లతో ఈ పథకం రూపొందించామని.. 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని.. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని భట్టి పేర్కొన్నారు. దరఖాస్తు స్వీకరించిన అనంతరం పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు లెటర్లను అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ స్కీంకు సంబంధించిన పూర్తి విధివిధానాలను రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. మరో వైపు ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్నిప్రభుత్వం తీసుకొస్తోందని భట్టి స్పష్టం చేశారు.
తెలంగాణలోని యూనివర్సిటీలకు రూ.540 కోట్లతో వసతుల ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో భాగంగా మొదట రూ.15.5 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతగా రూ.115.5 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సమావేశమయ్యారు.