Fake Currency Identification
ఫేక్ కరెన్సీని గుర్తించడం ఎలా.. ఈ 10 విషయాలు తెలిస్తే.. మీరు అస్సలు మోసపోరు!
ఇండియన్ కరెన్సీ
దేశంలో నకిలీ కరెన్సీ చలామణి గణనీయమైన స్థాయిలో ఉంది. వివిధ నివేదికలు, గణాంకాలు ఈ సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్, ఇతర సంస్థలు ఎప్పటికప్పుడు నకిలీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకుంటూనే ఉన్నాయి. నకిలీ కరెన్సీని గుర్తించడం, దానిని అరికట్టడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ చలామణి మాత్రం ఆగడం లేదు.
కలిసి కృషి చేయాలి..
అయితే.. ప్రజల మోసపోకుండా అవగాహన కల్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి కృషి చేయాలని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ కరెన్సీ గురించి సమాచారం ఇవ్వడం, అనుమానాస్పద లావాదేవీలను నివేధించడం వంటి చర్యల ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో..
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొందరు కేటుగాళ్లు నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీలో ఏలూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 విషయాలు తెలుసుకుంటే.. నకిలీ కరెన్సీని గుర్తించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఓ పోలీస్ అధికారి చెప్పారు.
1.కాగితపు నాణ్యత..
అసలు నోటు దృఢంగా ఉంటుంది. నకిలీ నోటు తేలికగా.. మెత్తగా ఉంటుంది.
2.వాటర్ మార్క్..
అసలు నోటులో మహాత్మా గాంధీ చిత్రం, ఆర్బీఐ చిహ్నం వాటర్ మార్క్‌లో కనిపిస్తాయి.
3.సెక్యూరిటీ త్రెడ్..
అసలు నోటులో నిలువుగా వెండి రంగు గీత ఉంటుంది. దానిపై ‘భారత్’ అని రాసి ఉంటుంది.
4.మైక్రో ప్రింటింగ్..
నోటుపై చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, వాటిని భూతద్దంలో చూడవచ్చు.
5.ఇంటాగ్లియో ప్రింటింగ్..
నోటుపై కొన్ని గుర్తులు ఉబ్బెత్తుగా ఉంటాయి. వాటిని తాకితే అసలు, నకిలీ నోట్లకు తేడా తెలుస్తుంది.
6.కలర్ షిఫ్ట్..
ఒరిజినల్ నోటులోని కొన్ని రంగులు కాంతిని బట్టి మారుతాయి.
7.సీ త్రూ రిజిస్టర్..
ఒరిజినల్ నోటులోని కొన్ని గుర్తులు వెలుగులో చూస్తే కనిపిస్తాయి.
8.ఫ్లోరోసెంట్ ఇంక్..
నోటును అతినీలలోహిత కాంతిలో చూస్తే కొన్ని భాగాలు మెరుస్తాయి.
9.సీరియల్ నంబర్..
ఒరిజినల్ నోటుపై సీరియల్ నంబర్ ప్రత్యేకంగా ఉంటుంది.
10.ఆర్బీఐ చిహ్నం..
ఒరిజినల్ నోటుపై ఆర్బీఐ చిహ్నం స్పష్టంగా ఉంటుంది. దొంగనోట్లపై అలా ఉండదు. ఈ అంశాలను గుర్తుంచుకోవడం ద్వారా నకిలీ కరెన్సీని గుర్తించవచ్చు. ఒకవేళ ఏదైనా నోటుపై అనుమానం వస్తే.. దానిని బ్యాంకులో పరీక్షించవచ్చు.