Kisan Credit Cards Limit
Budget 2025: బడ్జెట్లో రైతన్నలకు శుభవార్త.. ఆ పరిమితి రూ.2 లక్షలు పెంపు..!
Kisan Credit Cards: బడ్జెట్ ప్రసంగానికి ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఈసారి కూడా రైతులకు శుభవార్త ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎంతో ఆశతో తమకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయనే ఆలోచనతో ఉన్నారు.
ఈ క్రమంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతన్నలు భారీ అంచనాలతో బడ్జెట్ కోసం వేచి చూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచవచ్చని తెలుస్తోంది. దీని కింద ప్రస్తుతం అందిస్తున్న రూ.3 లక్షల ప్రయోజనాన్ని బడ్జెట్లో రూ.5 లక్షల వరకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి వ్యవసాయం ఖరీదైనదిగా మారిన వేళ రైతులు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
చాలా కాలంగా రైతుల అవసరాలకు అనుగుణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచలేదని ఒక అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రైతుల నుంచి దీని పరిమితిని పెంచాలనే డిమాండ్ బడ్జెట్ ప్రసంగానికి ముందు వినిపిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కేంద్రం బడ్జెట్లో దీనిపై కీలక ప్రకటన చేయవచ్చని చాలా మంది అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి కిసాన్ క్రెడిట్ కార్డులను 1998లో ప్రారంభించారు. దీని కింద రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందుబాటులోకి తీసుకురావటం కోసం ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వం నుంచి దీనికింద రైతులు కేవలం 9 శాతం రేటుకే లోన్ పొందవచ్చు. అలాగే రైతులకు 2 శాతం వడ్డీ సబ్సిడీ అందించబడుతుంది. అలాగే రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే వడ్డీ 3 శాతం రాయితీగా అందించబడుతుంది. అంటే కేవలం పావలా వడ్డీకే చివరికి రైతులు రుణాన్ని దీని ద్వారా పొందటానికి వీలు కల్పించబడింది. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. దీని విషయంలో కూడా ఏదైనా పెంపులు ప్రకటించే అవకాశం ఉందనే ఆశలు కూడా రైతుల్లో కొనసాగుతున్నాయి.

