Formation of pay commission, announcement on 5 times increase in pension
8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం ఏర్పాటు, పెన్షన్ 5 రెట్లు పెంపుపై ప్రకటన.
ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పైనే ఉంది.
బడ్జెట్ నేపధ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ రకాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అదే విధంగా కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో పలు ఆసక్తికరమైన, కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ రూపకల్పనలో ఉన్నారు. ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ అనగానే దాదాపు అన్ని రంగాలు ఆశలు పెట్టుకుంటాయి. అందుకే వివిధ రంగాల ప్రతినిధులతో ఆమె విస్తృతంగా సమావేశమౌతున్నారు. ఇందులో భాగంగా కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈపీఎఫ్ పధకంలో భాగంగా 5 రెట్లు కనీస పెన్షన్ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరాయి. అదే సమయంలో 8వ వేతన సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని, ట్యాక్స్ మినహాయింపు పరిధి పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మూడు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఇన్‌కంటాక్స్ పరిధిని 10 లక్షలకు పెంచాలని కార్మిక ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కోరాయి. అంతేకాకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని విన్నవించాయి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసే చర్యలు నిలిపివేయాలని కోరాయి. అదే సమయంలో అసంఘటిత రంగ కార్మికులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించే క్రమంలో సూపర్ రిచ్ వర్గాలపై 2 శాతం అదనపు ట్యాక్స్ విధించాలని కోరాయి. మరోవైపు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995లో భాగంగా కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 5 వేలకు పెంచి వేరియెబుల్ డియర్‌నెస్ అలవెన్స్ జత చేయాలని కోరాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
సాధారణంగా కొత్త వేతన సంఘం ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంది. 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పడగా 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే వచ్చే ఏడాదికి పదేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పడితే అమల్లో వచ్చేందుకు ఏడాదిన్నర లేదా రెండేళ్లు పట్టవచ్చు. అందుకే తక్షణం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.