Which schemes offer high interest in fixed deposits?
ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అధిక వడ్డీ ఇస్తున్న స్కీములు ఇవే..
అక్టోబర్ 9న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన పరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ ప్రకటించకపోయినప్పటికీ, కీలక వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది.
ఆ ప్రకటనను బట్టి చూస్తే, రాబోయే డిసెంబర్, ఫిబ్రవరి భేటీల్లో వడ్డీ రేట్లు కనీసం అర శాతం వరకూ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణుల అంచనా. అప్పుడు గృహ, వాహన, వ్యక్తిగత (పర్సనల్ లోన్) రుణాల రేట్లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. అందుకే.. ‘‘ఎవరైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకుంటే ఇప్పుడే త్వరపడి, గరిష్ఠ వడ్డీ రేట్ల దగ్గర డిపాజిట్స్ లాక్ చేసుకుంటే లాభపడే అవకాశం ఉంది’’ అని కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి.
ఆర్బీఐ అంచనాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి లోపే ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, మెజార్టీ డ్యామ్‌లు, నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కాస్త నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా అమెరికా వడ్డీ రేట్లను తగ్గించింది. క్రూడాయిల్ ధరల్లో పెద్దగా మార్పుల్లేవు. వాస్తవానికి ఇవన్నీ దేశంలో వడ్డీ రేట్లు తగ్గించేందుకు అనుకూలాంశాలు.
అయితే, ఇజ్రాయెల్-లెబనాన్ ఉద్రిక్తతలు, చైనాపై ఇన్వెస్టర్లకు అనూహ్యంగా ఆసక్తి పెరిగిపోవడం వంటివి కూడా అనూహ్య పరిణామాలు. దీంతో రెండు నెలలు ఆగి వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈసారి జరిగిన మానిటరీ పాలసీ భేటీలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ప్రకటన రాకపోయినప్పటికీ, రాబోయే రోజుల్లో కోతలకు అవకాశం పక్కాగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేద్దామనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఆఖరు, లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వడ్డీ రేట్లలో కనీసం అర శాతమైనా తేడా ఉంటుందని అంచనా. దశలవారీగా రెపో రేట్ 6.5 శాతం నుంచి 6 శాతానికి ఆరునెలల కాలంలో తగ్గొచ్చు, మొదటగా పావు శాతం కోతలతో ఇది ప్రారంభం కావొచ్చని అంచనా.
పోటాపోటీగా వడ్డీ రేట్లు..:
నిర్దిష్టమైన ఆదాయాన్నిచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఇప్పుడున్న పరిస్థితులకు మెరుగైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
ఈ మధ్య రిటైల్ ఇన్వెస్టర్లు బ్యాంకుల వైపు తమ ఆసక్తిని తగ్గించుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసే రిటర్న్స్ ఇవ్వడం లేదంటూ బ్యాంకుల వైపు పెద్దగా ఆసక్తిని కనబర్చట్లేదు. రిస్కీ అయినా ఈక్విటీ మార్కెట్ల వైపు వెళ్లడం వల్ల బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు లిక్విడిటీ సమస్య (నిధుల కొరత) ఏర్పడుతోంది.
అందుకే గరిష్ఠ వడ్డీ ఇచ్చి ఆకర్షించేందుకు ఎస్బీఐ కూడా సిద్ధపడింది. ‘అమృత కలశ్’ పేరుతో కొత్త ఎఫ్‌డి స్కీమును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఎస్బీఐ. పరిమిత కాలపరిమితికి మాత్రమే ఈ స్కీమును మొదట లాంఛ్ చేసింది. ఇందులో 400 రోజులకు గరిష్ఠంగా 7.10 శాతం వడ్డీని ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు అయితే మరో అర శాతం అధికంగా, అంటే 7.6 శాతం వడ్డీ వస్తుంది.
అలానే ‘అమృత్ వృష్టి’ పేరుతో జులైలో ప్రారంభించిన కొత్త స్కీము అయితే 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకూ ఇంట్రెస్ట్ ఇస్తోంది. 2024 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉన్న స్కీములను ఇప్పుడు 2025 మార్చి 31 వరకు పొడిగించింది ఎస్బీఐ.
కేంద్రం తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము కింద గరిష్ఠ వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇతర ఏ చిన్న మొత్తాల పొదుపు పథకం కూడా ఈ స్థాయిలో వడ్డీ రేటు ఆఫర్ చేయడం లేదు. ఈ స్కీము కింద 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టే సౌలభ్యం ఉంది. అస్సలు రిస్క్ వద్దు అనుకునే వాళ్లు ఈ స్కీమును ఎంపిక చేసుకోవడం ఉత్తమం. భవిష్యత్తులో వడ్డీ రేట్లలో సవరణలు చేసినప్పటికీ, స్కీము ఎంట్రీ టైమ్‌లో ఉన్న వడ్డీ రేట్లే మెచ్యూరిటీ వరకూ కంటిన్యూ కావడం ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే ఈ గరిష్ఠ స్థాయి వడ్డీ రేట్ల దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే లాభపడే అవకాశం ఉంది.
వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు ఏంటి?
ప్రస్తుతం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు నిధుల కటకట ఎక్కువగా ఉంది. అందుకే ప్రైవేట్ బ్యాంకులు వీలైనంత ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. యెస్ బ్యాంక్, ఎస్‌బీఎం బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ బ్యాంకులు ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 నుంచి 8.1 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 8.6 శాతం వరకూ కూడా ఇంట్రెస్ట్ వస్తోంది.
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లను మనం దశాబ్దాల కిందటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీటిల్లో రిస్కూ తక్కువే, రివార్డ్ కూడా తక్కువే. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్లకు మెరుగైన రాబడిని ఇచ్చేందుకు డెట్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్, NBFC బాండ్స్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణగా చూస్తే శ్రీరాం ఫైనాన్స్ 9.45 శాతం, బజాజ్ ఫైనాన్స్ 8.6 శాతం, మహీంద్రా ఫైనాన్స్ 8.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.6 శాతం వరకూ వివిధ స్కీములలో రెండేళ్ల కాలపరిమితి వరకూ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే వీటిల్లో కూడా రిస్క్ స్థాయి మోడరేట్, లో, ఎక్స్‌ట్రీమ్ అనే మూడు కేటగిరీలుగా ఉంటుంది. మన వయసు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆధారంగా వీటిని ఎంపిక చేసుకోవడం మంచిది.
ఫ్లోటింగ్ రేట్స్ వద్దు:
ఇప్పటివరకూ ఉన్న గరిష్ఠ వడ్డీ రేట్ల సైకిల్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టబోతోంది. ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, పటిష్ఠంగా మారుతున్నప్పుడు, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పీక్ స్థాయిలో ఎక్కువ కాలం ఉండలేవు. అందుకే మన దగ్గర కూడా వడ్డీ రేట్లు కచ్చితంగా తగ్గబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బాండ్స్ 8.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 శాతం మాత్రమే వడ్డీని ఆఫర్ చేస్తున్న ఈ రోజుల్లో 35 బేసిస్ పాయింట్స్ అధికంగా ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అందిస్తున్నాయి. అయితే ఇంట్రెస్ట్ రేట్ డిక్లైనింగ్ సైకిల్ ప్రారంభమైనప్పుడు లేదా ప్రారంభమయ్యే స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గగానే వాటికి తగ్గట్టు ఇవి కూడా తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో హౌజింగ్ లోన్ తీసుకుంటే ఫ్లోటింగ్ రేట్ పెట్టుకోవడం మంచిది.
ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో అసెట్ అలొకేషన్ చాలా కీలకం. చిన్న వయసులో ఉన్నప్పుడు ఎఫ్‌డీలు, బాండ్స్ కంటే ఈక్విటీల్లో మన పెట్టుబడులు ఎక్కువగా ఉండాలి. ఈ వయసులోనే రిస్క్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ. మధ్య వయసులో ఉన్నప్పుడు హైబ్రిడ్ మోడ్ ఎంచుకోవాలి. అంటే డెట్ వైపు కూడా మన అలొకేషన్ ఎంతో కొంత ఉండాలి. అదే 60 ఏళ్లకు పైబడిన వారు మ్యాగ్జిమం సేవింగ్స్ మన ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కోసం చూడాలి. అప్పుడు రిస్కీ బెట్స్‌కు దూరంగా ఉంటూ ప్రభుత్వ బాండ్స్, స్కీములకే ఎక్కువ ప్రాధాన్య ఇవ్వాలి. అదే సమయంలో టాక్స్ ప్లానింగ్ కూడా ముఖ్యం.
రూ.116 లక్షల కోట్ల ఎఫ్‌డిలు:
ఈ రోజుల్లో ఇంకా ఎఫ్‌డిలు ఎవరు చేస్తున్నారు? అదో ‘పాతచింతకాయ పచ్చడి’ అనుకుంటారు. అంతా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ సహా ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లిపోతున్నారు కదా అనే భావన మనలో చాలా మందికే ఉండొచ్చు. కానీ ఆసక్తికరంగా గత మూడేళ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
1997లో రూ.5 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంక్ డిపాజిట్లు, 2001లో రూ.10 లక్షల కోట్లకు, 2006లో రూ.20 లక్షల కోట్లకు, 2009లో రూ.40 లక్షల కోట్లకు, 2016లో రూ.100 లక్షల కోట్లకు చేరాయి. అక్కడి నుంచి అలా పెరుగుతూ 2023 డిసెంబర్ 29 నాటికి మొత్తం డిపాజిట్లు (సేవింగ్స్, ఎఫ్‌డి కలిపి) రూ.200 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటా చెబుతోంది.
అయితే అక్కడి నుంచి క్రమంగా నిధులు మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ వైపు మళ్లుతున్నప్పటికీ, మార్చి 2024 నాటి లెక్కల ప్రకారం ఇప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు భారీగా డబ్బు చేరుతోంది. కాబట్టి, ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇస్తున్న ప్రాధాన్యత పూర్తిగా తగ్గలేదని అర్థమవుతోంది.
(గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు.)