Cockroaches: Add these to house cleaning water and the cockroaches will run away permanently.
Cockroaches: ఇళ్లు తుడిచే నీటిలో ఇవి కలపండి, బొద్దింకలు శాశ్వతంగా పారిపోతాయి.
Cockroaches: ఇంటిని శుభ్ర పరిచే నీటిలో కొన్ని పదార్థాలు కలిపితే బొద్దింకల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మాప్ పెట్టే నీటిలో ఏం కలపొచ్చో చూడండి. ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఈ నెలంతా పండగలే. పర్వదినాలంటేనే ఇంటి పరిశుభ్రత. రానున్న దీపావళికి అయితే ఇళ్లంతా ఏ దుమ్మూ లేకుండా శుభ్రం చేస్తారు. అయితే ముఖ్యంగా అందరి ఇళ్లలోనూ ఉండే సమస్య బొద్దింకలే. ఏ డబ్బా దులిపినా, లోపలున్న వస్తువులు బయటకు తీసినా, మూలల్లోనూ బొద్దింకలు కనిపిస్తాయి. అయితే సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అందుకే ఇంటిని శుభ్రం చేసే మాప్ నీటిలో కొన్ని పదార్థాలు కలపాలి. దాంతో బొద్దింకలు తరిమికొట్టవచ్చు. అవేంటో చూడండి.
లవంగాలు:
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు బొద్దింకలు అస్సలు ఇష్టపడని కొన్ని పదార్థాలను నీటిలో కలపవచ్చు. అవి వాటి వాసనతోనే దూరంగా పారిపోతాయి. అలాంటి వాటిలో లవంగాలు ఒకటి. ఇందుకోసం నాలుగైదు లవంగాలు తీసుకుని వాటిని నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించాలి. ఈ నీరు సగం అయ్యేదాకా ఆగాలి. దాన్ని మాప్ పెట్టే నీటిలో కలుపుకోవాలి. దీనికి బదులుగా ఇంట్లో లవంగం నూనె ఉన్నా వాడొచ్చు. కొన్ని చుక్కలను నీటిలో కలపి ఇంటిని తుడిస్తే బొద్దింకలు ఈ వాసనకే దూరంగా వెళ్లిపోతాయి.
కాకరకాయ:
బొద్దింకలకు కాకరకాయ వాసన, దాని చేదు రుచి అస్సలు నచ్చదు. అలాంటప్పుడు ఇంట్లో ఉంచిన కాకరకాయను కొద్దిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసి మాప్ వాటర్ లో కలపవచ్చు. అలా కాసేపు వదిలేసి తర్వాత మామూలు నీటితో శుభ్రం చేయాలి. కాకరకాయ కూర చేసేటప్పుడు వాటిమీద చెక్కు తీస్తాం కదా. దాన్ని కూడా పడేయకుండా ఇలా పేస్ట్ చేసి కాస్త వడకట్టి దాన్ని నీటిలో కలపాలి. ఇది ఇల్లు మొత్తానికి పెట్టడం కాస్త కష్టం కానీ, కిచెన్ లో, సింక్ కింద, మూలల్లో ఈ రసం కలిపిన నీటితో తుడిస్తే మేలు.
వంటసోడా:
నీటితో శుభ్రపరిచే సమయంలో మీరు మాప్ పెట్టే నీటిలో వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను వాడొచ్చు. ఇవి ఇంట్లోని బొద్దింకలను కూడా తరిమికొడతాయి. దీని కోసం ఒక బకెట్ నీటిలో ఒక చెంచాడు వెనిగర్, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఒక చెంచాడు డిష్ వాష్ లిక్విడ్ కూడా వేయండి.. ఇప్పుడు మీరు ఈ ద్రావణం సహాయంతో ఇంటిని శుభ్రం చేయొచ్చు. ఇది బొద్దింకలను తరిమికొట్టడమే కాకుండా ఇంటి శుభ్రతను సులభతరం చేస్తుంది.