'NPS Vatsalya' scheme will start on 18th of this month

'NPS Vatsalya' scheme will start on 18th of this month

NPS Vatsalya' scheme will start on 18th of this month

NPS: ఈనెల 18న 'ఎన్‌పీఎస్ వాత్సల్య' స్కీమ్ షురూ.. 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్!

NPS: ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించే కొత్త పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya). తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన పథకంగా కేంద్రం పేర్కొంది. ఇప్పుడు ఈ పథకాన్ని సెప్టెంబర్ 18, 2024 రోజున ప్రారంభించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పింఛన్ల నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ, కేంద్రం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత విధివిధానాలు ప్రకటించనున్నారు.

18 ఏళ్ల వయసు లోపు ఉన్న బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య అకౌంట్ తెరవవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతాలను సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుస్తారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో 2004లో జాతీయ పింఛను పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు కల్పిస్తుండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఎన్‌పీఎస్ పథకాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో చిన్న పిల్లలకు సైతం ఇందులో అవకాశం కల్పిస్తూ ఎన్‌పీఎస్ వాత్సల్య పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాలకు ఇది అదనమని చెప్పవచ్చు.

ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో చేరడం ద్వారా ముందస్తుగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీని ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వడ్డీపైన వడ్డీ లభిస్తుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తీసుకోవడం వల్ల పదవీ విరమణ నాటికి పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. అలాగే చిన్న తనం నుంచే పొదుపు అలవాటు చేసినట్లవుతుంది. సాధారణంగా ఎన్‌పీఎస్ స్కీమ్‌‌లో టైర్ 1, టైర్ 2 అనే రెండు ఖాతాలు ఉంటాయి. టైర్-1 ప్రాథమిక పింఛను అకౌంట్, ఇందులో చేరినపపుడు విత్ డ్రాలపై పరిమితులు ఉంటాయి. ఇక టైర్-2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం.

మరోవైపు.. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద రూ.1,50,000లకు అదనం. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత అంటే 60 ఏళ్లు వచ్చాక ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతం డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. దీని ద్వారా నెల నెలా చేతికి స్థిరమైన పెన్షన్ లభిస్తుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.