General Elections 2024

General Elections 2024

General Elections 2024: ఓటు వేయడంలో ఎనీ డౌట్.. అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది!

General Elections 2024 General Elections 2024: ఓటు వేయడంలో ఎనీ డౌట్.. అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది!

ఓటు వేయడానికి వెళుతున్నారా? ఓటు వేయడం ఎలా? ఓటు వేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓటు వేయడానికి వెళ్ళేటపుడు.. ఓటు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు

General Elections 2024: ఒక్కరోజు.. ఒకే ఒక్కరోజు మిగిలి ఉంది. హోరాహోరీగా ప్రజాక్షేత్రంలో తలపడుతున్న రాజకీయ నేతల భవిష్యత్ తేల్చే సిరాచుక్క పడటానికి. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి తెలుగు రాష్ట్రాల్లో అంతా సిద్ధం అయిపోయారు. ప్రచారం ముగిసింది. అంతా సైలెంట్ అయిపోయింది. చాపకింద నీరులా ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ఇక ఓటు వేయడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓటు వేయడం కోసం ఈసారి హైదరాబాద్ నుంచి వేలాది మంది ఆంధ్రప్రదేశ్ లోని తమ స్వస్ధలాలకు వెళుతున్నారు. రేపు అంటే మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం పూర్తి అయింది. నాయకుల ఉపన్యాసాల చప్పుడు ఆగిపోయింది. ఎక్కడికక్కడ నోట్ల కట్టల చప్పుడు మొదలైంది. సైలెంట్ ప్రచారంతో నేతలు బిజీగా ఉన్నారు. ఇదంతా సరే.. మరి మీరు ఓటు వేయడానికి సిద్ధం అయ్యారా? ఏమిటీ.. ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టున్నారు? వద్దు.. రెండో ఆలోచనే వద్దు.. రేపు తప్పనిసరిగా ఓటు వేయండి.. ఇది ప్రజాస్వామ్య పండగ. ఇక్కడ మీ ఓటు పవిత్రమైన అర్చన. దీనిని చేజార్చుకోవద్దు.   ఐదేళ్లు నేతలు చెప్పింది విన్నారు.. చేసింది చూశారు.. ఇప్పుడు మీ వంతు.. చూపుడు వేలితో సరైన తీర్పు చెప్పండి.  

ఓటు వేయడానికి డిసైడ్ అయ్యారు కదా? మరి మీకు వచ్చే మొదటి అనుమానం నేను ఓటు వేయవచ్చా లేదా? నేను ఎక్కడ ఓటు వేయాలి? కదా.. 

ఓటరు లిస్ట్ లో పేరు ఉంటేనే మీరు ఓటు వేయగలరనే విషయం మీకు తెలిసిందే. కానీ, అసలు మీ ఓటు లిస్టులో(General Elections 2024) ఉందొ లేదో తెలీడం లేదు కదా.. అది చెక్ చేసుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి..  https://electoralsearch.eci.gov.in/ వెబ్సైట్ లోకి వెళ్లి మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ పేరు ఓటరు లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 1950కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఓటు చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక <eci>space<epic number> టైప్ చేసి 1950 కి మెసేజ్ చేయవచ్చు. ఇవేవీ కాదు అనుకుంటే నాలుగో ఆప్షన్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకునే అవకాశం ఉంది. 

General Elections 2024: హమ్మయ్య.. మీ ఓటు ఉంది. వేయడానికి వెళ్ళాలి.. ఎలా?  అవును, మీరు ఒంటరిగా లేదా మీ వ్యక్తిగత వాహనంలో మీ కుటుంబ సభ్యులతో ఓటు వేయడానికి వెళ్ళవచ్చు. 4 మంది కంటే ఎక్కువ మంది కలిసి ఉండకూడదని గుర్తుంచుకోండి. నిషేధాజ్ఞల కారణంగా, 4 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించారు. బూత్‌కు 100 లేదా 200 మీటర్ల పరిధిలో బారికేడింగ్‌ను ఏర్పాటు చేస్తారు. దాని లోపలికి వాహనాన్ని తీసుకెళ్లడం నిషేధం. మీ వాహనాన్ని దానికి కొద్ది దూరంలోనే జాగ్రత్తగా పార్క్ చేసుకోవడం బెటర్. 

పోలింగ్ బూత్ చేరుకున్నారు.. ఇప్పుడు ఇక్కడ ఏమి చేయాలి? మీరు పోలింగ్ స్టేషన్ లోపలికి చేరుకుంటారు. రద్దీగా ఉంటే, మీరు మీ వంతు కోసం కొంత సమయం వేచి ఉండాలి. (సాధారణంగా ఉదయం సమయంలో పోలింగ్ స్టేషన్ ఖాళీగా ఉంటుంది. పోలింగ్ ప్రారంభ సమయానికి కొద్దిగా ముందుగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి. తొందరగా ఓటు వేసి వచ్చేయవచ్చు.)

General Elections 2024: ముందుగా పోలింగ్ స్టేషన్‌లో, పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జ్ ఓటింగ్ లిస్ట్‌లో మీ పేరును చూసి మీ ఐడి ప్రూఫ్‌ను చెక్ చేస్తారు. ఈ సమయంలో, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. నకిలీ ఓటింగ్‌ను నిరోధించడానికి, ప్రతి అభ్యర్థి తరపున ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటారు. 

ఇతర పోలింగ్ బూత్ అధికారులు మీ ఎడమ చేతి చూపుడు వేలుకు చెరిపివేయలేని సిరాను వేస్తారు. వారు మీకు స్లిప్ ఇచ్చి రిజిస్టర్‌లో మీ సంతకాన్ని తీసుకుంటారు. దీనినే ఫారం 17A అంటారు. ఓటరు సిరా వేయడానికి లేదా సంతకం చేయడానికి నిరాకరిస్తే, మీరు ఓటు వేయలేరు. ఇవి రెండూ తప్పనిసరి. సంతకం తెలియని వారు బొటనవేలు ముద్ర వేయవచ్చు. ఒకవేళ ఓటరు వికలాంగుడైనా, రెండు చేతులు లేదా వేళ్లు లేకుంటే, కాలి బొటనవేలుపై చెరగని సిరా వేస్తారు.

General Elections 2024: రెండవ అధికారి మీకు ఇచ్చిన స్లిప్‌ను మూడవ పోలింగ్ బూత్ అధికారికి ఇవ్వాలి.  ఈ అధికారికి  సిరా వేసిన వేలును చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మూడు వైపులా క్లోజ్ చేసి ఉన్న ఓటింగ్ ఛాంబర్ కు వెళతారు. అక్కడికి చేరుకున్న తర్వాత, మీకు నచ్చిన అభ్యర్థి ఎన్నికల గుర్తు ముందు ఉన్న బటన్‌ను నొక్కడం ద్వారా మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)పై మీ ఓటు వేస్తారు. ఇప్పుడు మీరు ఒక సుదీర్ఘ బీప్ శబ్దాన్ని వింటారు. ఇలా వినపడితే మీ ఓటు రిజిస్టర్ అయిందని అర్ధం. ఆ బీప్ శబ్దం వచ్చేవరకూ అక్కడే వేచి ఉండండి. ఆ సౌండ్ విన్న తరువాతే మీరు బయటకు రండి. 

General Elections 2024: ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. ఒకే అభ్యర్థి గుర్తు మీద ఒక పదిసార్లు నొక్కితే పది ఓట్లు పడినట్లు రికార్డ్ అవుతుందా? అని. అయితే, ఇది సాధ్యం కాదు. బ్యాలెట్ యూనిట్‌లో ఒక్కసారి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఎన్నిసార్లు బటన్ నొక్కినా ఒక్కసారి మాత్రమే ఓటు తీసుకుంటుంది. మీ తరువాత ఇంకో ఓటు వేయాలి అంటే  ప్రిసైడింగ్ అధికారి అనుమతించినప్పుడు మాత్రమే EVM అవకాశం ఇస్తుంది. కాబట్టి ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఏ గుర్తుకు ఓటు వేయాలో డిసైడ్ చేసుకుని.. సరిగ్గా ఆగుర్తుపై మాత్రమే నొక్కండి. తప్పుగా నొక్కినా.. లేదా సరిగ్గా నొక్కకపోయినా.. మీ ఓటును మీరు సరిచేసుకోలేరు. అది ఎందుకూ పనికిరాకుండా పోతుంది. 

General Elections 2024: మీరు ఓటు వేసిన అభ్యర్థికే మీ ఓటు వెళ్ళింది అని గ్యారెంటీ ఉందా అనే అనుమానం రావడం సహజం. అలాంటి అనుమానం వస్తే.. మీకు అది కూడా వెంటనే తీర్చుకునే అవకాశం ఉంటుంది. అదే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన VVPAT మిషన్. ఇది మీ ఓటు సరైనదో కాదో నిర్ధారిస్తుంది.

General Elections 2024: ఓటు వేసిన తర్వాత, EVM దగ్గర ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే VVPAT మెషిన్ కనిపిస్తుంది. దీనిలో, ట్రాన్స్ పేరెంట్  విండోలో ఒక స్లిప్ కనిపిస్తుంది. అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఎన్నికల గుర్తు ఉన్న స్లిప్ సీలు చేసిన VVPAT బాక్స్‌లో పడటానికి ముందు ఏడు సెకన్ల పాటు ఇది మీకు కనిపిస్తుంది. ఈ స్లిప్‌ ఆటోమేటిక్ గా  ఏడు సెకన్ల తర్వాత పెట్టెలో పడిపోతుంది. ఈ స్లిప్ ఏడు సెకన్లపాటు మీకు కనిపిస్తుంది, కానీ దీనిని మీకు ఇవ్వరు. 

ఇక మీకు ఏ అభ్యర్థీ నచ్చకపోతే  మీరు నోటా బటన్‌ను నొక్కవచ్చు. EVMలో ఇది ఎప్పుడూ చివరి బటన్ గా ఉంటుంది.

అదండీ విషయం. ఓటు వేయాలనుకుంటే ఉండే ప్రాసెస్. ఇప్పటికే చాలాసార్లు ఓటు వేసిన వారికి ఇదంతా తెలిసే ఉంటుంది. కాకపొతే.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు కదా ఎన్నిసార్లు చూసినా కాస్త కన్ఫ్యూజన్ ఉండవచ్చు కదా.. అలాగే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికీ ఈ ప్రాసెస్ అంతా  తెలీదు అందుకోసమే ఇక్కడ వీలైనంత వరకూ వివరంగా ఓటు ఎలా వేయాలి అనే సూచనలు అందించాం. వీటి ఆధారంగా సులువుగా ఓటు వేయవచ్చు. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే.. పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న అధికార్లకు మీ అనుమానాలు చెబితే వారు మీకు సహాయం చేస్తారు. గుర్తుంచుకోండి..ఐదేళ్ల కు ఒకసారి వచ్చే అవకాశం. సరైన నేతను ఎన్నుకోవడం మీధర్మం. మీ ధర్మం పాటించండి. ఏమి వెళతాంలే.. మనం ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమి ఉంటుంది లే.. సెలవు వచ్చింది హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేద్దాం.. ఇలా అశ్రద్ధ చేయకండి. మీ ఓటు మీ చేతిలో ఉండే ఆయుధం అని మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.