Bail for Kejriwal.. these are the conditions
కేజ్రీవాల్కు బెయిల్.. షరతులు ఇవే.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ 50 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయనకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఐదు షరతులతో బెయిల్ ఇస్తూ, తిరిగి జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టగా.. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ‘‘జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్న అమృత్ పాల్ సింగ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ప్రభావం పడుతుంది” అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ... ‘‘అమృత్ పాల్ సింగ్ కేసు భిన్నమైనది” అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అభ్యర్థే కానప్పుడు ప్రచారం కోసం ఆయనను విడుదల చేయాల్సిన అవసరం లేదని మెహతా విన్నవించారు. జస్టిస్ ఖన్నా బదులిస్తూ ‘‘మేం జూన్ 1 వరకు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆర్డర్ పాస్ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ కు కోర్టు విధించిన షరతులు ఇవే..
1. సీఎం ఆఫీస్ కు, ఢిల్లీ సెక్రటేరియెట్ కు వెళ్లొద్దు.
2. రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలి. అంతే మొత్తానికి ష్యూరిటీ ఇవ్వాలి.
3. లెఫ్టినెంట్ గవర్నర్ క్లియరెన్స్/అనుమతి పొందేందుకు అవసరమైతే తప్పా అధికారిక ఫైళ్లపై సంతకం చేయబోనని ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉండాలి.
4. లిక్కర్ స్కాం కేసులో తన పాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.
5. సాక్షులతో మాట్లాడకూడదు. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడకూడదు.