APPLE WATCH: Severe illness during flight journey... Doctor saved life with the help of Apple Watch
Apple Watch: ఫ్లైట్ జర్నీలో తీవ్ర అస్వస్థత... యాపిల్ వాచ్ సాయంతో ప్రాణాలు కాపాడిన డాక్టర్
యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలు కాపాడిందన్న వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఓ వృద్ధురాలికే ఫ్లైట్ జర్నీలో తీవ్ర అస్వస్థత కావడంతో, ఓ డాక్టర్ యాపిల్ వాచ్ సాయంతో ప్రాణాలు కాపాడాడు.
యాపిల్ కంపెనీ వివిధ రకాల ప్రొడక్ట్స్, గాడ్జెట్లను న్యూ జనరేషన్ ఫీచర్లతో అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. యాపిల్ వాచ్‌లను అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇవి చాలా సందర్భాల్లో యూజర్ల ప్రాణాలను రక్షించాయి. ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసి, సకాలంలో వైద్య సహాయం అందడంలో కీలక పాత్ర పోషించాయి. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్ధురాలి ప్రాణాలను కాపాడటానికి ఒక వైద్యుడు యాపిల్ వాచ్‌ను యూజ్ చేశాడు.
ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న బ్రిటీష్ వైద్యుడు, ఓ వృద్ధురాలి ప్రాణాలను యాపిల్ వాచ్ సాయంతో కాపాడాడు. 2024 జనవరి 9న ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఇటలీలోని వెరోనాకు ప్రయాణిస్తున్న విమానంలో ఈ సంఘటన జరిగిందని BBC పేర్కొంది. విమానంలోని 70 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ వృద్ధురాలికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంగ్లండ్‌లోని హియర్‌ఫోర్డ్ కౌంటీ హాస్పిటల్‌కు చెందిన 43 ఏళ్ల డాక్టర్ రషీద్ రియాజ్ విమానంలో ఉండటంతో, విమాన సిబ్బంది వైద్య సహాయం చేయాలని ఆయన్ని కోరారు.
డాక్టర్ రియాజ్ ప్రశ్నలకు వృద్ధురాలు మొదట్లో స్పందించలేదు. అయితే ఆమెకు గుండె సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఆమె రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేయడానికి ఫ్లైట్ అటెండెంట్ యాపిల్ వాచ్‌ను ఉపయోగించారు. ఈ చెకప్‌లో వృద్ధురాలికి లో ఆక్సిజన్ శాచురేషన్ ఉన్నట్లు తేలింది. రోగి ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరని, ఆమె ఆక్సిజన్ శాచురేషన్ తక్కువగా ఉందని తెలుసుకోవడానికి యాపిల్ వాచ్ సహాయపడిందని డాక్టర్ రియాజ్ వివరించారు.
యాపిల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. బ్లడ్ ఆక్సిజన్ యాప్‌ను రెగ్యులర్ ఫిట్‌నెస్, వెల్నెస్ ప్రయోజనాల కోసం రూపొందించారు. ఈ యాప్ మెడికల్ యూసేజ్ కోసం ఉద్దేశించింది కాదు. అయినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భంలో యాపిల్ వాచ్ ఫీచర్ ఉపయోగపడింది.
విమానం ఇటలీలో ల్యాండ్ అయ్యే వరకు డాక్టర్ రియాజ్ వృద్ధురాలి ఆక్సిజన్ శాచురేషన్ స్టెబిలైజ్ చేశారు. ఇందుకు సిబ్బంది నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసుకున్నారు. ల్యాండింగ్ తర్వాత బాధితురాలికి వైద్య సహాయం అందించగా, ఆమె పూర్తిగా కోలుకుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి గాడ్జెట్‌ల ప్రభావాన్ని డాక్టర్ రియాజ్ హైలైట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గాడ్జెట్‌ను ఎలా ఉపయోగించాలో ఈ ఫ్లైట్‌లో నేర్చుకున్నాను. ఈ రోజుల్లో సులువుగా అందుబాటులో ఉన్న బేసిక్ గాడ్జెట్‌తో ఈ విధమైన అత్యవసర పరిస్థితుల్లో, విమాన ప్రయాణాల్లో ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.’ అని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అత్యవసర పరిస్థితులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి, రక్తపోటు, ఆక్సిజన్ శాచురేషన్ వంటి ముఖ్యమైన సంకేతాలను కొలవడానికి విమానాలలో అవసరమైన ఎక్విప్‌మెంట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
అయితే యాపిల్ వాచ్ లైఫ్ సేవింగ్ స్టోరీల వెనుక ప్రస్తుతం కొన్ని చట్టపరమైన వివాదాలు నడుస్తున్నాయి. బ్లడ్ ఆక్సిజన్ యాప్‌కు సంబంధించిన పేటెంట్లపై యాపిల్, మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమ్ ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. ఫలితంగా రాబోయే సిరీస్ 9, అల్ట్రా 2 యాపిల్ వాచ్‌లలో అందుబాటులో ఈ యాప్ ఉండదని యాపిల్ ప్రకటించింది.

