ISPL
భారత్‌లో మరో కొత్త క్రికెట్ లీగ్.. గల్లీ క్రికెటర్లకు సదావకాశం
ISPL: ఐఎస్‌పీఎల్‌ను భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్ బాల్‌తో ఆడించనుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ లీగ్ మొదలుకానుంది.
ISPL: క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటివాటితో పాటు దేశవాళీలో పలు స్థానిక లీగ్‌లు అభిమానులను అలరిస్తుండగా తాజాగా మరో కొత్త లీగ్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త లీగ్ పేరు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్). మిగతా లీగ్‌లకు ఈ లీగ్‌కు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఆటకు ఉపయోగించే బాల్.. ఐఎస్‌పీఎల్‌ను భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్ బాల్‌తో ఆడించనుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ లీగ్ మొదలుకానుంది.ఈ మేరకు ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు ఐఎస్‌పీఎల్ వివరాలను వెల్లడించారు. మార్చి 2 నుంచి 9 దాకా టీ-10 ఫార్మాట్‌లో నిర్వహించనున్నఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. ఆరు జట్లు ఏడు రోజుల పాటు 19 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఐపీఎల్‌లో మాదిరిగానే ఈ లీగ్‌లో కూడా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను బరిలోకి దింపుతాయి. ఆరు ఫ్రాంచైజీలతో తొలి సీజన్ జరగనుంది. ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (వెస్ట్ బెంగాల్), బెంగళూరు (కర్నాటక), శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో తలపడనున్నాయి.ఒక్కో జట్టులో 16 మంది సభ్యులు ఉండనున్న ఈ లీగ్‌లో వచ్చేఏడాది ఫిబ్రవరి 24న ముంబై వేదికగా వేలం జరగాల్సి ఉంది. ఒక్కో జట్టుకు ఒక కోటి రూపాయల పర్స్ వాల్యూ ఉండగా ఒక ప్లేయర్‌కు కొనుగోలు చేసేందుకు అత్యధిక నగదు రూ. 3 లక్షలు. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కమిషనర్‌గా వ్యవహరించనుండగా బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలేలు కమిటీ మెంబర్లుగా ఉన్నారు. గల్లీ క్రికెటర్లను వెలికితీసి వారిని భావి క్రికెటర్లుగా రూపొందించే ప్రక్రియలో భాగంగానే తాము ఈ పనికి పూనుకున్నామని నిర్వాహకులు తెలిపారు.