ITEP 2023: Launch of four-year integrated teacher education program
ITEP 2023: నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లాంచ్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ITEP 2023: విద్యా రంగం (Education Sector) లో మంచి మార్సులు తీసుకొచ్చేందుకు ITEP ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం నుంచి 57 విద్యా సంస్థల్లో కోర్సు ప్రారంభం కానుండగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చదువు పూర్తయిన తర్వాత టీచింగ్ వృత్తిలో స్థిరపడాలని అనుకునేవారికి ఐటీఈపీ(ITEP) చాలా మంచి అవకాశం. ప్రస్తుతం బీఈడీ (B.Ed) చేయాలంటే అయిదు సంవత్సరాలు పడుతుంది. అదే ఐటీఈపీ ద్వారా కేవలం నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఈ విధానంలో విద్యార్థులకు ఒక సంవత్సరం కలిసొస్తుంది. విద్యా రంగం (Education Sector) లో మంచి మార్సులు తీసుకొచ్చేందుకు ITEP ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం నుంచి 57 విద్యా సంస్థల్లో కోర్సు ప్రారంభం కానుండగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* 2023-24 నుంచి ప్రారంభం
2030 నాటికి ఉపాధ్యాయుల భర్తీ కోసం డ్యూయల్ మేజర్ బ్యాచిలర్స్ డిగ్రీల ఆఫర్‌తో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)కు కేంద్ర మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. 2023-24 అకడమిక్ ఇయర్ నుంచి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 57 విద్యాసంస్థల్లో ఈ కోర్సు అందించనున్నారు. ప్రవేశాల కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) నిర్వహించనున్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.
* డ్యుయల్ మేజర్ అండర్ గ్రాడ్యుయేట్
ITEP అనేది BA- BEd లేదా BSc- BEd లేదా BCom- BEdలను అందించే 4 సంవత్సరాల డ్యూయల్-మేజర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఎన్‌సీఈటీ పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 4 దశలకు అంటే ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ (5+3+3+4) కోసం టీచర్లను తయారుచేసేలా ఈ కోర్సును డిజైన్ చేశారు.
పేరొందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తున్నారు. 2020లోనే దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయగా 2021లో నోటిఫై చేశారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది.
* కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో
కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్( NCTE) రూపొందించింది. అభ్యర్థి డిగ్రీని పొందేందుకు వీలు కల్పించే విధంగా మ్యథ్స్, హిస్టరీ, సైన్స్, ఆర్థికశాస్ర్తం, వాణిజ్యం, కళలు తదితర సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు బాల్య సంరక్షణ విద్య (ECCE), పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం (FLN), సమగ్ర విద్య, భారతదేశం సంప్రదాయాలు, విలువలు, నైతికత, ఆధునిక బోధనా పద్ధతులు తదితర విషయాలపై అవగాన కల్పించనున్నారు.
* విద్యారంగంలో నూతన అధ్యాయం
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో విద్యారంగంలో నూతన అధ్యాయం మొదలవుతుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తుంది. టీచింగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు నేటి విద్యారంగ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నారు. 2023-24 నుంచి మొదలుకానున్న నేపథ్యంలో టీచింగ్ వృత్తిల్లో స్థిరపడాలని అనుకునే వాళ్లకు మంచి ఎంపిక అని సూచిస్తున్నారు.