Health with games 2023

 Health with games 2023

ఆటలతో ఆరోగ్యం

Health with games 2023

'కుదిరితే పరిగెత్తు.. లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో.. అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు..' ఇది శ్రీశ్రీ కవితే కావచ్చు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనిషి చురుగ్గా ఉండాలి. మనలో చలనం లేనప్పుడు చైతన్యం నిస్తేజమౌతుంది. రెండున్నర దశాబ్దాల క్రితం వరకూ ప్రతి వ్యక్తీ వయసుకు తగ్గ పనులు చేయడం ఉండేది. ఆ పనులే మెదడుకీ, శరీరానికీ తగినంత వ్యాయామాన్నిచ్చేవి. అయితే నేడు పనులు, ఆలోచనలు యాంత్రీకరణ, రెడీమేడ్‌ అయిపోయాయి. దాంతో ఆలోచనాశక్తి, శారీరక శ్రమ కుంటుపడ్డాయి. దాంతో మనిషి భావి జీవితం ప్రమాదంలో పడుతోందని పరిశోధనలలో వెల్లడైంది. ఆ విషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ పిల్లలు, యువకులు పని రూపంలోనైనా, ఆటల రూపంలోనైనా రోజుకు కనీసం గంటసేపు శరీరానికి వ్యాయామాన్నివ్వాలి అని సూచించింది.

తల్లిదండ్రులుగా పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండాలని ఒంటిమేడ భవనాలు.. వాటిలో ఎసి రూములు.. లక్షల ఫీజులు కట్టి, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చదివిస్తారని అపోహపడే కార్పొరేట్‌ స్కూళ్ళు.. కాలేజీలు పిల్లలకు మనం అందిస్తున్న అత్యంత ప్రమాదకరమైన లగ్జరీ లైఫ్‌. ఈ ఒక్క విషయంలోనే పిల్లల ఆరోగ్యం, పునాది జీవితం గడిచిపోతున్నాయి. స్కూల్లో ఆటలు, ఆటస్థలాలు ఉన్నాయా.. లేదా.. చూడటంలేదు. ఒకవేళ ఉంటే మట్టిలో ఆడతారని, టైమ్‌ వేస్ట్‌ అవుతుందనే అపోహలతో ఆ స్కూల్స్‌లో చేర్పించడానికి ఇష్టపడటం లేదు. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అయిదు వందల మిలియన్ల (500,000,000) కొత్త దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.

2016లో జరిగిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 11-17 సంవత్సరాల వయస్కులలో 81 శాతం మంది శారీరక బలహీనతను కలిగి ఉన్నట్లు తేలింది. ఇటీవల యాక్టివ్‌ హెల్దీ కిడ్స్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. 'కోవిడ్‌ సమయంలో మూడింట ఒక వంతుకు పైగా పిల్లలు వ్యాయామ సమయం రోజుకు 17 నిమిషాలు తగ్గటం వలన నిస్సత్తువగా మారారని అధ్యయన నిపుణులు అభిప్రాయపడ్డారు. బాల్య దశలోని ఈ శారీరక స్తబ్దత ప్రపంచవ్యాపిత ప్రజారోగ్యానికి ఒక సవాలుగా మారిందని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక సూచన చేసింది. 'నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, రన్నింగ్‌, క్రీడలు వంటివి పిల్లలను శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చేసి.. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. కాబట్టి 11-17 సంవత్సరాల వయసు పిల్లలకు వీటిని 'తప్పనిసరి చేయాలి' అన్నదే ఆ సూచన. పిల్లలకు ఆటలు మానసిక వికాసాన్ని, మనో ధైర్యాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తినిచ్చే హార్మోన్ల విడుదలకు సహకరిస్తాయి. కోవిడ్‌-లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మనకు గమనంలో ఉండి, ఉండాలి. 'ప్రజలారా! ఈ కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మీకు ఎక్కడ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత వ్యాయామం చేయండి. ధైర్యంగా ఉండండి. అది మాత్రమే మనలను రక్షించగలదు' అని పిలుపునిచ్చింది.

కోవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, పబ్లిక్‌ పార్క్‌లు మూతపడటం తప్పనిసరే అయినప్పటికీ ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం కలిగించింది. ఆటలు మరుగవడంతో పిల్లలు సెల్‌ఫోన్లకు ఎడిక్ట్‌ అయ్యారు. తత్ఫలితంగా ఎదురౌతున్న తీవ్ర మానసిక వ్యాధులు, ఊబకాయం ఇవన్నీ వారికి ప్రమాద హేతువులుగా పరిణమించాయి. ఈ విషయంలోనూ డబ్ల్యుహెచ్‌ఓ ఒక సిఫార్సు చేసింది. పిల్లలు సెల్‌ఫోన్‌ వినియోగంలో రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించినట్లైతే వారిలో వికాసం నశిస్తుంది. మనోవైకల్యం ఏర్పడుతుంది. అభిజ్ఞా ప్రాబల్యం కొరవడుతుంది. వీటిని అధిగమించాలంటే శారీరక వ్యాయామం, డిజిటల్‌ స్క్రీన్ల వినియోగంలో కొన్ని కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరించింది. గ్లోబల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ ఫిజికల్‌ యాక్టివిటీ ద్వారా 2030 నాటికి కౌమారదశలో ఉన్నవారిలో శారీరక స్తబ్దతను 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికలో చేర్చబడింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు దీనికి సహకరించాలని పిలుపునిచ్చింది.

బోట్స్వానా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఈ నాలుగు ఆఫ్రికన్‌ దేశాలలో జరిపిన ఈ అధ్యయనాల ప్రకారం నిపుణుల సూచనల మేరకు డబ్ల్యుహెచ్‌ఓ ఒక ప్రకటన విడుదల చేసింది.

'తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు.. పిల్లలు.. శారీరక శ్రమలో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర వహించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పి, ప్రోత్సహించాలి. పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు బోధనేతర కార్యక్రమాలు, క్రీడలు తప్పనిసరిగా నిర్వహించాలి. సురక్షితమైన పచ్చని ప్రదేశాలు, ఆట స్థలాలు, క్రీడా సౌకర్యాలకు ప్రాధాన్యతని ఇవ్వడం ద్వారా ఇప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమేనని, ఈ విషయంలో ప్రభుత్వాలు గురుతర బాధ్యత వహించాలి' అని ప్రకటించింది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.