PM KISAN 19th Installment Date
ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ కిసాన్ 19వ విడత.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్న మోదీ..
పీఎం కిసాన్ 19వ విడత నిధులు ఫిబ్రవరి 24న విడుదల కానున్నాయి. బిహార్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర ఫిబ్రవరి 24న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు. బిహార్ పర్యటనలో భాగంగా మోదీ పలు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. అలాగే పలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారని వివరించారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులను 2024 అక్టోబర్ 15న ప్రధాని మోదీ విడుదల చేశారు.
పీఎం కిసాన్ ఈ-కేవైసీ:
అయితే ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకే పీఎం కిసాన్ సహాయం అందుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ కంప్లీట్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ ఆధారిత ఈ-కేవైసీ ఆప్షన్ కూడా ఉంది.
పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు:
ఈ స్కీమ్ ను 2019 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించింది కేంద్రం. 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలోని రైతులందరీకి పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున చెల్లిస్తోంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. అయితే బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి. అలాగే కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
పీఎం కిసాన్ దరఖాస్తు:
ఈ పథకానికి అర్హత గల రైతులు ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్, భూమి రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. పీఎం కిసాన్ పోర్టల్ లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లను సంప్రదించవచ్చు
స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ లోకి లాగిన్ అయి Know Your Status ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ ను కరెక్టుగా ఎంటర్ చేయాలి.
మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అనంతరం డేటా లభిస్తుంది.
రిజిస్టేషన్ నంబర్ గుర్తు లేకపోతే మొబైల్ నంబర్ లేదా, ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.