If you want to buy petrol diesel, you have to show that certificate..!
వాహనదారులకు షాక్.. ఇకపై పెట్రోల్ డీజిల్ కొనాలంటే ఆ సర్టిఫికెట్ చూపించాల్సిందే..!
Insurance Mandatory: దేశంలోని వాహనదారులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. దేశంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ విషయంలో కొనుగోలుదారులను పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నూతన వ్యూహాలను రవాణా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. వాస్తవానికి మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని పాటించకపోవటంతో కొత్త వ్యూహాలతో కేంద్రం ముందుకొచ్చిందని తెలుస్తోంది.
అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇకపై వాహనదారులు పెట్రోల్-డీజిల్ కొనుగోలు చేయాలన్నా లేకపోతే ఫాస్ట్‌ట్యాగ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరిగా మార్చబడింది. ఈ క్రమంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తి చేసుకోని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా రిమైండర్లు పంపించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశంలో ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు సగానికి ఇన్సూరెన్స్ లేవని తెలుస్తోంది.
అందువల్ల ప్రస్తుతం దేశంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనం విషయంలో తప్పనిసరిగా ఇకపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండేలా చూసే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటార్ వాహనాల చట్టంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. దీనిని అమలులోకి తీసుకురావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్ధతు అవసరమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోడ్లపైకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాగితాలు లేని వాహనాలు తిరగటాన్ని తగ్గించేందుకు డేటా చాలా కీలకం. అందుకే ఫాస్ట్‌ట్యాగ్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో ఆధార్ కార్డులను లింక్ చేయాలనే ప్రతిపాదన కొనసాగుతోంది.
వాస్తవానికి అనేక యూరోపియన్ దేశాల్లో వ్యక్తుల సామాజిక భద్రతా నంబర్‌లతో ఇలాంటి సేవలు అనుసంధానించబడతాయి. అయితే ఇలాంటి పద్ధతులను ప్రతిబింబించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా చర్యలతో ఇన్సూరెన్స్ కవరేజ్ నెట్‌ను విస్తృతం చేయడమే కాకుండా బీమా వ్యాప్తికి సంబంధించిన డేటా సేకరణ, విశ్లేషణను మెరుగుపరచడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. పైగా ఇలా చేయటం వల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
భారత రోడ్లపై సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని నిర్మించడానికి తాజా చర్యలు దోహదపడతాయని తెలుస్తోంది. డేటాను ఉపయోగించి రోడ్లపై ఇన్సూరెన్స్ లేకుండా తిరిగే వాహనాలను గుర్తించటం, వాటిని తగ్గించటంతో పాటు రోట్లపై ఎక్కువ మందిని రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వాతావరణాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పరోక్షంగా దేశంలో వాహన ఇన్సూరెన్స్ రంగం వృద్ధికి సైతం దోహదపడుతుందని వారు చెబుతున్నారు.