Master plan for Warangal after 52 years

 Master plan for Warangal after 52 years

Warangal : 52 ఏళ్ల తరువాత వరంగల్‌కు మాస్టర్ ప్లాన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కారు.

Master plan for Warangal after 52 years

Warangal : ఎట్టకేలకు వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించింది. దీంతో వరంగల్ అభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటీ.. వరంగల్ మాస్టర్ ప్లాన్‌లో ఏముందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మాస్టర్ ప్లాన్‌లో ఏముందో ఓసారి చూద్దాం.

వరంగల్ మహా నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించింది. నగర అభివృద్ధికి 1972 లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇది దాదాపు దశాబ్ధ కాలానికిపైగా ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉంది.

దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు అర్ద శతాబ్ధం తరువాత వరంగల్ మహా నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకుంది.

50 ఏళ్లుగా..

ఏ నగరానికైనా ప్రతి 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాలు, చేపట్టబోయే ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలి. ఇలా వరంగల్ నగరానికి చివరగా 1972లో అప్పటి అవసరాల మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దాదాపు 52 ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే ప్లాన్ అమలు అవుతోంది. గతంతో పోలిస్తే వరంగల్ నగర రూపురేఖల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో కుడా అధికారులు విజన్ 2041తో 2013లోనే మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం మారిపోవడంతో మాస్టర్ ప్లాన్ అంశం మరుగున పడిపోయింది.

పదేళ్లుగా కాగితాల మీదనే..

వరంగల్ నగరం స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎంపిక కాగా.. గతంతో పోలిస్తే నగర జనాభా విపరీతంగా పెరిగింది. దీంతో 2013లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ఆ తరువాత వివిధ కారణాల వల్ల కనుమరుగవగా.. 2018లో మాస్టర్ ప్లాన్ అంశాన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు తెరమీదకు తెచ్చారు. కుడా అధికారులు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న ‘లీ అసోసియేట్స్’ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థతో కలిసి.. మాస్టర్ ప్లాన్‌లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేశారు.

ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి, అందులో సాధ్యమైన వాటిని పరిష్కరించి 2018లోనే మాస్టర్ ప్లాన్‌కు తుది రూపు తీసుకొచ్చారు. చివరకు 2020 మార్చి 11న అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ సంతకం చేశారు. ఆ తరువాత ఫైల్ అప్పటి సీఎం వద్దకు వెళ్లగా.. మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోద ముద్ర పడలేదు. దీంతో పదేళ్ల నుంచి కుడా మాస్టర్ ప్లాన్–2041కాగితాల దశలోనే ఉండిపోయింది.

విజన్ 2050తో..

కొన్నేళ్ల నుంచి మాస్టర్ ప్లాన్ ఆమోదానికి నోచుకోక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. మాస్టర్ ప్లాన్‌ను విజన్ 2050తో తయారు చేయాలని ఆదేశించారు. దీంతో మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు, చేర్పులు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుడా మాస్టర్ ప్లాన్‌కు అమోదం తెలిపి, వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కుడా మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కొన్నేళ్లుగా ఊరిస్తున్న ఈ అంశానికి తెరపడగా.. వరంగల్‌లో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లు అయ్యింది.

181 గ్రామాలు..

కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ దాదాపు 1,805 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దాని పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని మొత్తం 19 మండలాలు, 181 గ్రామాలు, 3.3 లక్షల ఇళ్లు, 14 లక్షల వరకు జనాభా ఉంది. ఇదివరకు రూపొందించిన ‘మాస్టర్ ప్లాన్–2041’ లో వివిధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, ఇతర భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ ను 14 జోన్లుగా విభజించారు.

అందులో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, మిక్స్‌డ్ యూజ్ జోన్, పబ్లిక్ యుటిలిటీస్ జోన్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్, గ్రోత్ కారిడార్–1, 2 రీక్రియేషన్ జోన్, విలేజ్ ఎక్స్పాన్షన్ జోన్, ట్రాన్స్ పోర్ట్ జోన్, అగ్రికల్చర్ జోన్, ప్రొటెక్టెట్ అండ్ అన్ డెవలపెబుల్ యూజ్ జోన్, హెరిటేజ్ కన్జర్వేషన్ జోన్ ఇలా మొత్తం 14 రకాల జోన్‌లుగా విభజించారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌కు ఆమోద ముద్ర పడటంతో.. ఇకనుంచి వరంగల్ నగర అభివృద్ధి ప్రణాళిక బద్ధంగా సాగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.