ACB Raids On AEE

 ACB Raids On AEE

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైనే..

ACB Raids On AEE

ACB Raids On AEE : చిన్న చేప అనుకుని వల వేసిన ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈఈ నిఖేష్ కుమార్ కు రూ.150 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలిసి ఏసీబీ షాక్ అయ్యింది. నిఖేష్ కుమార్ కు చెందిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సుమారు 30 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.

తెలంగాణ ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాలలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖేష్ కుమార్ ఆస్తుల విలువ రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేష్ కుమార్ కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 25 ప్రదేశాలలో ఏసీబీ దాడులు చేసింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నిఖేశ్ కుమార్ గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో మే నెలలో జైలు పాలయ్యారు. ఈ కేసు విచారణలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ వెలికితీసిన ఆస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.లక్ష లంచం తీసుకుంటూ

నిఖేశ్ కుమార్‌ను ఈ ఏడాది మేలో ఒక ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి అనే ఫిర్యాదుదారుడి నుంచి ఏఈఈ నిఖేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజినీర్ కె. కార్తీక్ , సర్వేయర్ పి. గణేష్ సర్వేయర్ తో కలిసి రూ. 1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాంపూర్‌లో ఓ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు, ఫార్వార్డ్ చేయడానికి అధికారులు రూ. 2,50,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో అప్పటికే రూ.1,50,000 అడ్వాన్స్‌గా చెల్లించగా, మిగిలిన రూ.1,00,000 అందజేస్తున్న సమయంలో ఏసీబీ దాడి చేసింది. సర్వేయర్ గణేష్ సర్వే చేయడానికి రూ. 40,000 డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు.

రూ.100-150 కోట్లకు పైగా ఆస్తులు

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ...నిఖేష్ కుమార్ ఆస్తులపై ఆరా తీసింది. నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టి శనివారం ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని 30 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ సోదాల్లో భారీగా వ్యవసాయ భూములు, భవనాలు, భారీగా బంగారం, ఫామ్ హూస్ ఇతర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.100 -రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

రూ.80 కోట్ల ఫామ్ హౌస్ లు

గండిపేట బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిఖేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, రాజేంద్రనగర్, మణికొండ పరిధిలో నిఖేష్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆయన పేరిట మూడు ఇళ్లు, రూ.80 కోట్ల ఫామ్‌ హౌస్‌లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన నిఖేష్‌ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ కేసులో స‌స్పెండ్ అయిన నిఖేష్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నా... ఆయనపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.