Bought the land after seeing it on Facebook. The real thing came to know after registration!
Real estate fraud : ఫేస్‌బుక్‌లో చూసి భూమి కొన్నారు.. రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు విషయం తెలిసింది!
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని పుతులూరు గ్రామంలో రోడ్డు పక్కనే భూమి అమ్మకానికి ఉందని.. ఫేస్‌బుక్‌లో పోస్టు వచ్చింది. ఆ పోస్టును చూసిన కూకట్‌పల్లికి చెందిన ఆడం జ్యోతి.. తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ భూమిని చూశారు. నచ్చిన తర్వాత మధ్యవర్తులతో మాట్లాడుకొని ఎకరానికి రూ. 31. 40 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.
రేట్ కుదిరాక.. పెద్ద శంకరంపేట తహసీల్దార్ ఆఫీస్‌లో డబ్బులు కట్టి.. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తరవాత అసలు విషయం తెలిసింది. రోడ్డు పక్కన చూపించిన భూమి కాకుండా.. దూరంగా తక్కువ ధరతో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో మోసపోయామని గ్రహించిన జ్యోతి.. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌లో ఏడుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మోసం చేసింది నిజమేనని గుర్తించారు. ఏడుగురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నిందితులు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాకు చెందిన చవాన్ సాగర్ (27) ను A-1, శంకరంపేట గ్రామస్తుడు జంగం శ్రీనివాస్ ( 52) A-3 ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. వారిని మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరు పరిచామని పోలీసులు తెలిపారు. మిగతా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వివరించారు.
పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనండి..
భూములు కొంటున్నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని.. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. అన్ని డాక్యూమెంట్స్, హద్దులు చెక్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం భూమిలో ఎవరు కబ్జాలో ఉన్నారనేది చుట్టూ పక్కలా వారిని అడిగి తెలుసుకోవాలని వివరించారు. తొందరపడి భూములను కొనుగోలు చేస్తే.. పోయిన డబ్బును తిరిగి పొందడం కష్టమని స్పష్టం చేశారు. భూములను అమ్మించే రియల్టర్స్ ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.